క్లియోపాత్రాకి సంబంధించి ఇప్పటికీ ఎన్నో విషయాలు కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. వాటి సంగతి ఎలా ఉన్నా ఆమె సమాధి గురించి ఆర్కియాలజిస్ట్‌లు అన్వేషిస్తూనే ఉన్నారు. ఈ మధ్యనే ఈజిప్టియన్ల దేవతగా ఆరాధించే ఓసిరిస్ టెంపుల్ దగ్గర ఒక టన్నెల్ బయటపడింది. దాన్ని పట్టుకుని వెళ్తే ఆమె సమాధి దొరికినట్టే అన్నారు. మరి ఆ సమాధి దొరికిందా? ఇంకా మిస్టరీగానే ఉందా?
ప్రాచీన ఈజిప్టుని ఏకచ్ఛత్రాధిపత్యంగా 20 ఏండ్లు ఏలిన రాణి సమాధి గురించి చరిత్రకారులు, ఆర్కియాలజిస్ట్‌లు తెగ వెతుకుతున్నారు. ఆమె సమాధి దొరికితే ఆమెకి సంబంధించిన మరెన్నో విషయాలు తెలుస్తాయని ప్రపంచమే ఎదురుచూస్తోందంటే అతిశయోక్తి కాదు.
ఇదో అద్భుతం
క్లియోపాత్రా తన తండ్రి, ఈజిప్టు రాజు అయిన 12వ టాలెమీ నుంచి అధికారాన్ని చేపట్టింది. ఆ తరువాత51 బి.సి. నుంచి 30 బి.సి. వరకు ఈజిప్టులోని టోలెమిక్ రాజ్యానికి రాణిగా ఉంది. ఈజిప్టుకు చిట్టచివరి ఫారో ఈమె. ఈ రాణి సమాధి గురించి తెలుసుకోవాలని అన్వేషిస్తున్న పరిశోధకులకుఈజిప్టులో ఒక టెంపుల్ దగ్గర భూఅంతర్భాగంలో ఒక టన్నెల్ కనిపించింది. ఈజిప్టియన్లు దైవంగా పూజించే ఓసిరిస్ దేవాలయంలో ఈ టన్నెల్ బయటపడింది.
ఈ ప్రాంతాన్ని టపోసిరిస్ మ్యాగ్నా అని పిలుస్తారు. ఇది ప్రాచీన అలెగ్జాండ్రియా పట్టణానికి పశ్చిమాన ఉంది. ఇక్కడ బయటపడిన టన్నెల్ 6.5 అడుగుల ఎత్తు, 4,300 అడుగుల పొడవుతో ఉంది. అంటే దాదాపుగా 43 అడుగుల లోతున ఉన్న దీన్ని ‘జియోమెట్రిక్ మిరకిల్’ అని ఈజిప్టియన్ టూరిజం, యాంటిక్విటీస్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో చెప్పింది.
ఒకవేళ కనుక్కుంటే...
ఈ టన్నెల్ ద్వారా ఈజిప్టును పాలించిన సామ్రాజ్ఞి సమాధి కనుక్కోవచ్చనే ఆశ చరిత్రకారుల్లో తలెత్తింది. సాన్ డొమింగో యూనివర్సిటీ ఆర్కియాలజిస్ట్ క్యాత్లీన్ మార్టినెజ్ మాట్లాడుతూ ‘‘క్లియోపాత్రా సమాధి ఇక్కడ దొరుకుతుంది అనిపిస్తోంది. ఆర్కియాలజిస్ట్ల అన్వేషణలో టెంపుల్ గోడల లోపల నుంచి ఉన్న టన్నెల్స్, భూగర్భంలో ఉన్న దారులు కనుక్కోవడం ఇదే మొదటిసారి. ఈ టన్నెల్ ద్వారా క్లియోపాత్ర సమాధిని కనుక్కోగలిగాం అంటే ఇది 21వ శతాబ్దంలో చాలా ముఖ్యమైన డిస్కవరీ అవుతుంది. టపోసిరిస్ మ్యాగ్నా టెంపుల్లో15 ఏండ్లకు పైగా సమాధి గురించి వెతికే పనిలో ఉన్నా. ఈ మధ్యే ఈ టన్నెల్ బయటపడింది.
దీనికంటే ముందు మా టీంకు తవ్వకాల్లో కొన్ని నాణాలు దొరికాయి. వాటి మీద క్లియోపాత్ర, అలెగ్జాండర్ బొమ్మలు, పేర్లు ఉన్నాయి. ఐసిస్ దేవత బొమ్మలు, బంగారు నాలుక ఉన్న మమ్మీ, గ్రీకో–రోమన్–స్టయిల్ మమ్మీలు ఉన్న సమాధులు దొరికాయి. వీటితో పాటు అక్కడ సిరామిక్ వెజల్స్, కుండలు, విగ్రహాలు కూడా కనిపించాయి” అని చెప్పింది. ఆర్కియాలజిస్ట్‌గా మారిన మార్టినెజ్ క్రిమినల్ లాయర్. ఆ తరువాత ఆర్కియాలజిస్ట్ అయింది.
ఈ టెంపుల్ ప్రాంతంలో తవ్వకాలు చేసేందుకు పిటిషన్ వేసి మరీ అనుమతులు తెచ్చుకుంది. క్లియోపాత్ర సమాధి అయితే దొరకలేదు కానీ టన్నెల్‌తో పాటు మరెన్నో ముఖ్యమైన విషయాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. భూగర్భజలాల్లో ఈ ప్రాచీన టన్నెల్ కలిసిపోవడానికి ప్రధాన కారణం భూకంపాల వల్లనే అని రీసెర్చర్లు చెప్తున్నారు. భూ కంపాల వల్లే టెంపుల్ కూలిపోయి ఇలా భూగర్భంలో కలిసిపోయి ఉంటుంది అనేది చాలామంది ఆర్కియాలజిస్ట్ల అభిప్రాయం.
దోపిడీ అయ్యాయా?
క్లియోపాత్రా, ఆమె ప్రేమికుడు మార్క్ ఆంటోని 30 బి.సి.లో మరణించాక ఆ ఇద్దరినీ కలిపి ఒకే దగ్గర సమాధి చేశారని ప్రాచీన చరిత్రకారులు చెప్పారు. రచయిత ప్లుటార్చ్ (ఎ.డి. 45–120) ఆ సమాధి ప్రాచీన ఈజిప్టు దేవత ఐసిస్ టెంపుల్ దగ్గర ఉందని రాశాడు. అంతేకాకుండా అది చాలా అందమైన మాన్యుమెంట్. అందులో బంగారు, వెండి, పచ్చలు, ముత్యాలు, ఏనుగు దంతాలతో నిండి నిధినిక్షేపాలు ఉన్నాయని చెప్పాడు.
ఎవరెన్ని చెప్పినప్పటికీ ఈ సమాధి మాత్రం ఇప్పటికీ ఎక్కడ ఉందో తేలలేదు. ఈ సమాధి గురించి చరిత్రకారులు, పరిశోధకులు వెతుకుతూనే ఉన్నారు. అంతెందుకు ఆ మధ్య టూరిస్ట్‌లకు కూడా ఈ సమాధిని వెతికే పని అప్పచెప్పింది ఆ దేశం. 2010లో ఈజిప్ట్ మాజీ యాంటిక్విటీస్ మినిస్టర్ జహి హవాస్... ఇప్పుడు టపోసిరిస్ మ్యాగ్నా అని పిలుస్తున్న ఒకప్పటి అలెగ్జాండ్రియా సమీపంలో తవ్వకాలు చేయించాడు. ‘‘అందులో క్లియోపాత్ర ఈజిప్టును పాలించినప్పటి తేదీలతో ఉన్న సమాధులు ఎన్నో బయటపడ్డాయి.
ఆర్కియాలజికల్ డిస్కవరీస్ ఎన్నో జరిగాయి. కానీ వాటిలో క్లియోపాత్రా సమాధి మాత్రం లేదు” అని హవాస్ పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో చెప్పాడు. ఒకవేళ క్లియోపాత్రా సమాధి అక్కడ దొరికినా కూడా అందులోని విలువైన వస్తువులన్నీ దోపిడీ అయిపోయి ఉంటాయి. అంతెందుకు గుర్తు పట్టేందుకు వీల్లేని పరిస్థితిలో ఉండి ఉంటుంది అని కొందరు పరిశోధకులు పెదవి విరుస్తున్నారు.