కో-లివింగ్​ హాస్టల్లో డ్రగ్స్ దందా..బెంగళూరు నుంచి తెప్పించి వ్యాపారం

కో-లివింగ్​ హాస్టల్లో డ్రగ్స్ దందా..బెంగళూరు నుంచి తెప్పించి వ్యాపారం
  • తాను తీసుకోవడమే కాకుండా ఇతరులకు అమ్మకం
  • ఆర్కిటెక్ట్ అరెస్ట్

మాదాపూర్, వెలుగు: తనతో పాటు హాస్టల్లో ఉంటున్న మరికొంత మందికి ఎండీఎంఏ డ్రగ్స్​అమ్ముతున్న యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్​సీఐ కృష్ణమోహన్​వివరాల ప్రకారం.. కడపకు చెందిన జి. తేజకృష్ణ(28) మాదాపూర్​చంద్రనాయక్​తండాలోని జేఎంజే కో–లివింగ్​హాస్టల్లో ఉంటూ ఆర్కిటెక్ట్​గా పనిచేస్తున్నాడు. బెంగుళూరులో ఐటీ ఉద్యోగం చేస్తూ డ్రగ్స్​సప్లయర్​గా ఉన్న సాండీ(27) అనే వ్యక్తి వద్ద ఎండీఏంఏ డ్రగ్స్​కొనుగోలు చేసి తాను తీసుకునేవాడు.

దాంతో పాటు తనకు చెందిన వ్యక్తులకు, హాస్టల్లో ఉన్న వారికి సైతం ఎండీఎంఏ అమ్ముతున్నాడు. దీనిపై సమాచారం రావడంతో మాదాపూర్​ఎస్ఓటీ పోలీసులు, మాదాపూర్​పోలీసులు కలిసి గురువారం తనిఖీ చేశారు. తేజకృష్ణ వద్ద 11.14 గ్రాముల ఎండీఎంఏ, రెండు సెల్​ఫోన్లు, వెయింగ్​మిషన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్​ చేశారు. 2024  జనవరి నుంచి తేజకృష్ణ సిటీలో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తేజకృష్ణ గతంలో ఎండీఎంఏ అమ్ముతూ శేరిలింగంపల్లి ఎక్సైజ్​పోలీసులకు చిక్కాడు. 

 మెటల్​చార్మినార్​ వద్ద మరొకరు అరెస్ట్.. 

హైటెక్​సిటీలోని మెటల్​చార్మినార్​ కేంద్రంగా కొకైన్​అమ్ముతున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాదాపూర్​సీఐ కృష్ణమోహన్​వివరాల ప్రకారం.. మాదాపూర్​ఇజ్జత్​నగర్​లోని అలేఖ్య హోమ్స్​లో నివాసం ఉంటున్న ప్రసన్నకుమార్​రెడ్డి(28) తన తండ్రికి చెందిన బిజినెస్​చూసుకుంటున్నాడు. తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడంతో  బెంగుళూరులో నివాసం ఉండే నైజీరియాకు చెందిన డ్రగ్ పెడ్లర్ కెవిన్​(40) వద్ద కొకైన్​కొనుగోలు చేశాడు.

హైదరాబాద్​కు వచ్చిన తర్వాత తనకు తెలిసిన వారికి కూడా కొకైన్ అమ్మేవాడు. గురువారం మెటల్​చార్మినార్​వద్ద ఇతరులకు కొకైన్​ అమ్మేందుకు వచ్చిన ప్రసన్నకుమార్​ను మాదాపూర్​పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు కలిసి అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి మొత్తం రూ.15.30 లక్షల విలువైన 23 గ్రాముల కొకైన్​, ఒక కారు, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకొని అరెస్ట్​ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు డ్రగ్​ సప్లయర్​కెవిన్, ఇద్దరు డ్రగ్​పెడ్లర్లు ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన  విశ్వమిత్రా, మణికొండకు చెందిన సాయి దీపక్, బోయిన్​పల్లికి చెందిన డ్రగ్స్​ వినియోగదారుడు వరుణ్​గౌడ్​పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

కాచిగూడలో మరో ఇద్దరు..  

హైదరాబాద్ సిటీ: కాచిగూడ ఢిల్లీ పబ్లిక్‌‌ స్కూల్‌‌ సమీపంలో డ్రగ్స్‌‌ అమ్ముతున్న ఇద్దరిని శంషాబాద్‌‌ ఎక్సైజ్‌‌, డిస్టిక్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 25 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌‌, 8 గ్రాముల ఓజీ కుష్‌‌ను సీజ్ చేశారు. వీటి ధర రూ.3 లక్షల వరకు ఉంటుందని అంచనా.  నిందితులను అబ్దుల్లా బిన్‌‌ అజీజ్‌‌ బర్వాజ్‌‌, మహ్మద్‌‌ ఖలీంగా గుర్తించారు. ఈ కేసులో మరో వ్యక్తి రషీద్‌‌ అలీఖాన్‌‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.