బెల్టు షాపులే సంక్షేమమా కేసీఆర్?: రాజగోపాల్‌‌రెడ్డి

  • ప్రతిపక్షం నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని అడ్డంగా కొన్నరు
  • సిద్దిపేటకు వెయ్యి కోట్లు తీసుకెళ్లి.. మునుగోడుకు రూ.3 కోట్లన్నా ఇవ్వరా?
  • రాష్ట్రంలో ప్రజాస్వామ్యమే లేకుండా చేశారని మండిపాటు
  • కౌలు రైతులకు రైతుబంధు ఎందుకివ్వరో చెప్పాలని డిమాండ్
  • ప్రతిపక్షం నుంచి 18 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 12 మందిని అడ్డంగా కొన్నరు
  • సిద్దిపేటకు వెయ్యి కోట్లు తీసుకెళ్లి.. మునుగోడుకు రూ.3 కోట్లన్నా ఇవ్వరా?

చండూరు, వెలుగు: ‘‘ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు తెలంగాణ ప్రజలు 18 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను గెలిపించారు. కానీ సీఎం కేసీఆర్ అందులో 12 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. అసెంబ్లీలో ప్రశ్నించే గొంతు లేకుండా చేసిండు.. ఏం చేసినా అడిగేవారు ఉండకూడదనే ఈ కుట్ర పన్నిండు” అని మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేదే లేకుండా చేశారని విమర్శించారు. ప్రజలకు విద్య, వైద్యం అందించి, ఉద్యోగాలు కల్పించాల్సిన సీఎం.. వాటిని పక్కనపెట్టి ఊరూరా పెద్దసంఖ్యలో బెల్టుషాపులు పెట్టి ఫుల్లుగా తాగిస్తున్నాడని ఫైర్ అయ్యారు. బెల్టుషాపులు పెట్టి జనంతో తాగించడమే సంక్షేమం అంటున్నాడన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా చండూరు మండలంలోని ఒంటెద్దుగూడెంలో రాజగోపాల్‌‌‌‌ ప్రచారం నిర్వహించారు. సీఎం సొంత జిల్లా సిద్దిపేటకు వెయ్యి కోట్లు తీసుకెళ్లిన ఆర్థిక మంత్రి హరీశ్​రావు.. తన మునుగోడు నియోజకవర్గానికి కనీసం రూ.3 కోట్లు కూడా ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. అసెంబ్లీ సాక్షిగా ఈ విషయమై తాను ప్రశ్నిస్తే స్పందించని వాళ్లు.. ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఇది చేస్తాం.. అది చేస్తాం.. అని మాట్లాడుతున్నారని చెప్పారు.

రైతుబంధు పేరిట భూస్వాములకు లక్షలు

కరోనా కాలంలో తన సొంత డబ్బుతో పేద ప్రజల్ని ఆదుకున్నానని, ఎక్కడా అవినీతి చేయలేదని రాజగోపాల్‌‌‌‌రెడ్డి అన్నారు. ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ తన రాజీనామాతో బయటకు వచ్చారని, తన రాజీనామా వల్లే అసెంబ్లీ మొత్తం నియోజకవర్గ ప్రజల కాళ్ల దగ్గరికి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ కేజీ టు పీజీ విద్య, లక్ష ఉద్యోగాలు, ఉద్యోగాలు రానివాళ్లకు నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ఇండ్లు లేనివాళ్లకు డబుల్​బెడ్​రూం ఇండ్లు... ఇలా లెక్కలేనన్ని హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. రైతుబంధు పేరిట భూస్వాములకు లక్షలకు లక్షలు ఇస్తున్నారని, కానీ గుంట భూమి లేకున్నా ఎవుసం చేస్తూ అప్పులపాలవుతున్న కౌలు రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘‘కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలని అడిగాను తప్పా? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎలాగూ కట్టలేకపోతున్నారు.. కనీసం రూ.3 లక్షలు ఇవ్వండని అడిగాను.. అది తప్పా?’’ అని నిలదీశారు. తెలంగాణ వల్ల కేసీఆర్ కుటుంబం తప్ప ఏ వర్గమూ బాగుపడలేదన్నారు. అందరి బతుకులు మారాలంటే టీఆర్ఎస్ సర్కారు పోవాలని, బీజేపీ ప్రభుత్వం రావాలని, అందుకే మునుగోడు ఉప ఎన్నికలో కమలం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని రాజగోపాల్​రెడ్డి విజ్ఞప్తి చేశారు.