ఉప ఎన్నికలంటే డబ్బు, మద్యమేనా? : ప్రొ. కూరపాటి వెంకటనారాయణ

రా ష్ట్రంలోని 33 జిల్లాల నుండి వేలాదిమంది కార్యకర్తలు, వందలాదిమంది నాయకులు, మంత్రి మండలి మొత్తం ఇంకా ఆది నాయకత్వం, కుటుంబ సభ్యులు వారి బంధువులు అంతా మునుగోడులో మోహరించి ఉన్నారని ప్రతి ఒక్క ఓటరును వెంటాడుతున్నారని వార్తా కథనాలు చెపుతున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో నిత్యం డబ్బు పంపిణీ చేయడం మద్యం ఇంకా వివిధ రకాల ప్రలోభాలకు గురి చేస్తున్న వైనం  దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మున్నెన్నడు జరగలేదని విజ్ఞులు వాపోతున్నారు.  ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఈ విధానాలను మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు చైతన్యవంతమైన ప్రజలు చూస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడగలిగే బాధ్యత కలిగిన భారత ఎన్నికల కమిషన్ న్యాయవ్యవస్థ కూడా స్పందించడం లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 

హైదరాబాదు మహానగర మున్సిపాలిటీ ఎన్నికలు మొదలు దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో కూడా డబ్బు, మద్యం విస్తృతంగా పంపిణీ జరిగిందని ఇక మునుగోడుకు వచ్చేసరికి ఈ ప్రజాస్వామ్య విధ్వంస ప్రక్రియ మరింత వికటించుచున్నదని అంటున్నారు. మన ప్రజాప్రతినిధులు  మంత్రి పుంగవులు ముఖ్యంగా గత రెండు సంవత్సరాల నుండి నిత్యం ఎన్నికల నిర్వహణ, ఓటర్లను నిర్బంధం చేయడం, లిక్కర్ డబ్బు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రభావితం చేయడం, ప్రలోభ పెట్టడం ఒక అనునిత్య కార్యక్రమంగా మారిపోయింది. 

ప్రజాప్రతినిధుల దందాలు

ధరణి సమస్యలను పరిష్కరించకుండా అవినీతిని ప్రోత్సహిస్తూ ప్రజల భూములకు తగాదాలు పెట్టిస్తున్నారని, తిరిగి వారే సెటిల్మెంట్లు చేస్తున్నారని బాధితులు వాపోవుతున్నారు. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో పాలక పార్టీ ఎమ్మెల్యేలు 84 ఇంకా 12 మంది మంత్రులు, మన ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మున్సిపల్ చైర్మన్లు, నామినేటెడ్ పదవులలో ఉండే నాయకులు, వేలాది మంది కార్యకర్తలతో మునుగోడును ముంచేత్తుతున్నారని తెలుస్తున్నది. ప్రతిపక్షాలు కూడా వారికి చేతనైనంత మేరకు వారి నాయకులకు, కార్యకర్తలకు వివిధ రకాల సరంజామాలు ఏర్పాటు చేస్తున్నారని పరిశీలకులు తెలుపుతున్నారు. ఇసుక అక్రమ రవాణా మద్యం వ్యాపారం బినామీ కంపెనీల పేరు మీద డబ్బు పోగు చేసుకోవడం కూడా నూతన రాష్ట్రంలో నాయకులకు అంది వచ్చిన అవకాశంగా మారింది. ఎన్నికల ముందు టిక్కెట్టు తెచ్చుకొని ఉద్యోగ సంఘాల నాయకులను, కుల సంఘాల నాయకులను నిరుద్యోగులను యువకులను వివిధ పార్టీల నాయకులను వివిధ ప్రలోభాలతో మచ్చిక చేసుకుని ప్రజలను మద్యం డబ్బు ఇతర ప్రలోభాలతో లొంగదీసుకుని అధికారులను ఉపయోగించుకొని ఓట్లు దండుకోవచ్చని భావిస్తున్నారు. 
రాజకీయ వ్యవస్థ మన తెలంగాణ రాష్ట్రంలోఒక ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ లాగా రూపుదిద్దుకొని  పరిపాలన చేసుకుంటున్నది. సాధారణంగా ఈ దుర్మార్గపు పద్ధతులతో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టడం, డబ్బు మద్యం పంపిణీ, నిర్బందాలు అమలు చేసే విద్యలో.. కొన్ని ప్రాంతీయ పార్టీల ఎన్నికల నిర్వహణ చరిత్ర తెలియచేస్తున్నది. ఎన్నికల ముందు గోకర్ణ గజకర్ణ టక్కుటమార కనికట్టు విద్యలతో ప్రజలను మభ్యపెట్టి తెలంగాణలో అమలు చేసే ఈ దుర్మార్గపు ఆప్రజాస్వామిక పద్ధతులు తారాస్థాయికి చేరుకున్నవి.

తెలంగాణ మేధావులు స్పందించాలి

ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ఈ మునుగోడు ఉపఎన్నిక సందర్భంలో ఓటర్ల పై అమలు చేస్తున్న దమనకాండను ముక్తకంఠంతో ఖండించాలి. ఇది 60 సంవత్సరాలు పోరాటం చేసి ఆత్మగౌరవం  స్వయం పాలన కొరకు సాధించుకున్న రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఈ దుర్మార్గపు పద్ధతులను గమనించిన దేశ ప్రజలకు మనం ఏ సమాదానం చెప్పగలుగుతాము అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. 

గత ఎనిమిది సంవత్సరాల నుండి పాటిస్తున్న  ఈ నిశ్శబ్దాన్ని విడనాడాలి. తెలంగాణలో ప్రస్తుతం అమలు జరుగుతున్న వంశపారంపర్య కుటుంబ పాలన హోల్సేల్ దోపిడి నిర్బంధ కాండ ప్రజాస్వామ్య విలువలను మంట కలపడం గమనిస్తున్న ప్రజాస్వామ్యవాదులు సామాజిక స్పృహ కలిగిన మేధావులు స్పందించాల్సిన అవసరం ఉంది. భావితరాల ప్రజలకు జవాబు ఇవ్వగలగాలి. వనరుల దోపిడి తెలంగాణను అప్పుల కుప్పగా చేయడం ప్రజలను బానిసలుగా మార్చడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం మొదలగు విషయాలపై స్పందించకుంటే మునుగోడు ఎన్నికల ప్రహసనం రాష్ట్రమంతటనే కాక యావత్ భారతదేశం లో కూడా వ్యాప్తి చెందే ప్రమాదాన్ని  ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొగ్గలోనే తుంచి వేయాల్సిన అవసరం ఉంది.

- కూరపాటి వెంకటనారాయణ
ప్రొఫెసర్