దేశంలోనే అత్యున్నత పురస్కారంగా పిలిచే ‘భారత రత్న’కు ఎవరు అర్హులు? ఇప్పటివరకు ఏ ప్రాతిపదికన ఇచ్చారు? మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు, గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ఇటీవల జోరందుకున్న నేపథ్యంలో దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటివరకు 46 మంది ఇండియన్స్‌కు, ఇద్దరు ఫారెనర్స్ ( అబ్దుల్ ఘఫర్ ఖాన్, నెల్సన్ మండేలా)కు ఈ అవార్డు దక్కింది. ఇందులో ఎక్కువ మంది బ్రాహ్మణులే. ఇప్పటి వరకు భారత రత్న అందుకున్న వారిలో శూద్రులు ముగ్గురు మాత్రమే. అంటే దేశంలో దళితులు, శూద్రుల్లో భారత రత్న అందుకోదగ్గ గొప్పవాళ్లు లేరనా? లేక అగ్రవర్ణాలకు, బ్రాహ్మణులకు మాత్రమే దేశ అత్యున్నత అవార్డు అందుకునే హక్కు ఉందనా?
ఇప్పటి వరకు 46 మంది ఇండియన్స్‌కు భారత రత్న దక్కితే.. అందులో 29 మంది బ్రాహ్మణులే ఉన్నారు. మిగతా వారిలో ఐదుగురు ముస్లింలు, నలుగురు కాయస్థాలు, ముగ్గురు శూద్రులు ఉండగా.. దళిత, బనియా, ఖత్రి, పార్సీ, క్రిస్టియన్ నుంచి ఒక్కొక్కరికి ఈ అవార్డు దక్కింది. ఇప్పటివరకు నలుగురు మహిళలకు భారత రత్న దక్కింది. ఇందులో ముగ్గురు బ్రాహ్మణ కుటుంబాలకు చెందినవారే. మరొకరు క్రిస్టియన్. దేశంలో 4 శాతం ఉన్న బ్రాహ్మణులు లేకుంటే భారత రత్నకు అర్హులే లేరన్నట్లుగా పరిస్థితి తీసుకువచ్చారు. అవార్డు గ్రహీతల లిస్టును చూస్తే.. నిష్పక్షపాతంగా, నిజాయితీగా, కుల రహితంగా భారత రత్నకు ఎంపిక జరుగుతున్నదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశ జనాభాలో ప్రధానంగా ఉన్నది శూద్రులు, దళితులు, ఆదివాసీలే. సగం మందికిపైగా శూద్రులు ఉండగా.. 66 ఏండ్ల భారత రత్న అవార్డు చరిత్రలో ముగ్గురు శూద్రులకు మాత్రమే అవార్డు దక్కింది. 18 శాతం ఉన్న దళితుల్లో ఒక్క డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు మాత్రమే ఈ పురస్కారం ఇచ్చారు. ఇక 7 శాతం ఉన్న ఆదివాసీల్లో ఒక్కరికి కూడా ఇవ్వలేదు. వల్లబ్‌భాయ్ పటేల్‌కు అది రాజీవ్‌గాంధీతో కలిపి 1991లో భారత రత్న ఇచ్చారు. పటేల్‌కు ముందు ఇద్దరు శూద్రుల (తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు కె.కామరాజ్, ఎంజీ రామచంద్రన్)కు ఈ పురస్కారం దక్కింది. ఇప్పుడు భారత రత్న కోసం ప్రముఖంగా డిమాండ్లు వినిపిస్తున్న పేర్లు పీవీ నర్సింహారావు, బాలసుబ్రహ్మణం. ఈ ఇద్దరూ కూడా బ్రాహ్మణులే అన్న విషయం ఇక్కడ గుర్తించాలి. ఇటీవల టీడీపీ ఫౌండర్, మాజీ సీఎం, కమ్మ నాయకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలంటూ ఆ పార్టీ గళమెత్తింది. అయితే.. ఆ డిమాండ్‌కు జాతీయ స్థాయిలో పెద్దగా ప్రాచుర్యం దక్క లేదు.
రాజకీయ ఎంపికలు
1954 నుంచి భారత రత్న అవార్డు ప్రదానం జరుగుతున్నది. తొలి సంవత్సరం సి.రాజగోపాలచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సీవీ రామన్‌కు 60 ఏండ్ల వయసులో దీనికి ఎంపిక చేశారు. ఆ ముగ్గురూ బ్రాహ్మణులే. అప్పటి ప్రభుత్వం దేశవ్యాప్తంగా భారత రత్నకు ఎవరిని ఎంపిక చేయాలి? ఎలా ఎంపిక చేయాలి? అన్న ప్రిన్సిపుల్స్‌ను రూపొందించలేదు. తమకు అనుకూలమైన వారికి ఇచ్చుకుంటూ పోయారు. అవార్డు గ్రహీతల ఎంపికలో పవర్ పాలిటిక్స్ ప్రభావం ఉంది. ప్రధాన మంత్రులుగా ఉన్నప్పుడే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ భారత రత్న అందుకున్నారు. అంబేద్కర్ (1990), పటేల్ (1991) వంటి కొందరికి మరణానంతరం చాలా కాలానికి ఈ అవార్డు లభించింది. నాదర్ కమ్యూనిటీకి చెందిన కె.కామరాజ్, భౌతిక శాస్త్రవేత్త సీవీ రామన్, ఫారెన్ యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన అమర్త్యసేన్తోపాటు నాన్ రెసిడెంట్ ఇండియన్స్‌ను అప్పట్లో కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లు ‘పిక్ అండ్ చూస్’ మెథడ్‌లో అవార్డుకు ఎంపిక చేశారు. చెప్పాలంటే అవార్డుకు ఎంపికలో ప్రతిభకు అంత ప్రాధాన్యం లేదు. అంతా కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్లే చక్రం తిప్పుతుంటారు. పవర్లో ఉన్న వాళ్లు తమ రాజకీయ ప్రయోజనాలకు తగ్గట్టు తమ కులానికి చెందినవాళ్లను ఎంపిక చేస్తున్నట్లు స్పష్టమవుతున్నది. 34 ఏండ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన జ్యోతి బసును భారత రత్నకు ఎంపిక చేయకపోవడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పటేల్‌కు మరణానంతరం 41 ఏండ్లకు భారత రత్న దక్కింది. అంబేడ్కర్‌కు కూడా మరణానంతరం 34 ఏండ్లకు దక్కింది. అంబేడ్కర్‌తోపాటు గ్లోబల్ లీడర్ నెల్సన్ మండేలాకు కూడా 1990లో వీపీ సింగ్ హయాంలో భారత రత్న దక్కింది. ప్రధాన మంత్రులుగా పనిచేసిన వీపీ సింగ్‌తోపాటు జాట్ తెగకు చెందిన చౌదరీ చరణ్‌సింగ్ వంటి ఎందరినో ఇప్పటికీ ఆ అవార్డుకు ఎంపిక చేయలేదు. కేంద్రంలో ప్రో మండల్ ప్రధాన మంత్రి ఉంటే తప్ప వీరి పేర్లు తెరమీదికి వచ్చే పరిస్థితి లేదు.
క్యాస్టిజం ఏ దేశానికీ మంచిది కాదు
క్యాస్టిజం ఎక్కువగా ఉన్న ఏ దేశమూ సరైన అభివృద్ధి సాధించలేదు. మనుషులు మధ్య హెచ్చుతగ్గుల భావన ఒక్క భారత్ లోనే కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉంది. కానీ అన్ని కులాలు, వర్గాలు కలిసి ఒక్కటన్న భావనతో కలిసి పని చేస్తేనే ఏ దేశమైనా పురోభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది. భారత రత్న అవార్డు గ్రహీతల లిస్టు చూస్తే సామాజిక ఐక్యత, వైవిధ్యం అన్న విషయాలను పట్టించుకున్న దాఖలాలు కనిపించవు. పెద్ద కులాలు, తక్కువ కులాలు అన్న భావన వదిలేసి దేశంలో 18 శాతం ఉన్న దళితులు, 7 శాతం ఉన్న ఆదివాసీల్లోని మేధావులు, గొప్ప వాళ్లను భారత రత్నాలుగా గుర్తించే రోజు రావాలి. దేశానికి వెన్నెముక లాంటి వ్యవసాయ, కార్మిక రంగాల్లోని వారికి కూడా దేశ అత్యున్నత గౌరవం దక్కాలి.
ఫూలే, భీమ్, మండల్ అర్హులు కాదా?
కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సెక్యూలరిజం, ప్లూరలిజం, డైవర్సిటీ పేర్లు చెప్తూనే బ్రాహ్మణ రాజకీయాలను నడిపించింది. బీజేపీ పాలనలో భారత రత్న అందుకున్న వాళ్లలో బిస్మిల్లా ఖాన్, భూపెన్ హజారికా తప్ప మిగతా వాళ్లంతా బ్రాహ్మణులే. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా భారత రత్నను బ్రాహ్మణ రత్న అన్నట్టుగానే వ్యవహరించాయి. కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసి కమ్యూనిస్టు పార్టీలు పవర్‌ను పంచుకున్నా.. ఆ తీరులో ఎలాంటి మార్పు జరగలేదు. దేశంలో సామాజిక విద్యకు , పురోభివృద్ధికి తోడ్పాటునందించిన రాజా రామ్మోహన్ రాయ్, జ్యోతీరావు ఫూలే, నారాయణ గురుకు భారత రత్న దక్కాల్సి ఉండే. మహాత్మా గాంధీకి ఈ అవార్డు ఇవ్వాలనుకున్నప్పటికీ దానికన్న ఉన్నతమైన వ్యక్తిగా భావించి ఇవ్వలేదు. ఇప్పటివరకు ఒక్క ఆదివాసీకి కూడా భారత రత్న దక్కకపోవడం ఏమిటి? బిర్సా ముండా, కొమురం భీమ్ వంటి వారు అర్హులు కాదా? ఓబీసీలను కూడా ఎంపిక చేయకపోవడం ఏమిటి? మండల్ కమిషన్ రిపోర్ట్ తయారు చేసిన బీపీ మండల్ అర్హులు కాదా?