తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ కుంభవృష్టి కురవడం, హఠాత్తుగా వరదలు రావడం, ఆనకట్టలు ప్రమాదంలో పడటం, ఇండ్లూ కాలనీలు మునిగిపోవడం వంటి పరిణామాలకు కారణాలు ఏమై ఉండవచ్చనే చర్చ నడుస్తోంది. గతంలో పాఠశాలల వక్తృత్వ, వ్యాసరచనా పోటీల్లో కలం గొప్పదా, కత్తి గొప్పదా అనే అంశం ఇవ్వడం ఆనవాయితీ అయినట్టు ఇటీవలి కాలంలో ఏ విపరిణామం సంభవించినా ప్రకృతి వైపరీత్యం అని ప్రకృతి మీదికి నెట్టేయడమో, లేదా మానవ తప్పిదం అని కనిపించని అమూర్త మానవుడి మీదకు తోయడమో అలవాటైపోయింది. అసలు కారణాల చర్చ సమాజం ముందుకు రాకుండా చేయడానికి చాలా పెద్ద ఎత్తుగడ ఇది. అటు ప్రకృతి వైపరీత్యం అనే మానవాతీత శక్తిని కారణం చేయడమో, ఇటు మానవ తప్పిదం అని ఆ తప్పు చేసిన మనిషి ఎవరో బైటపడకుండా దాచడమో కాక ఈ సమస్యలో ఆలోచించాల్సిన కోణాలున్నాయి.
అన్నిటికి కారణాలున్నాయి..
నిజానికి ప్రకృతి పరిణామాలు కూడా యాదృచ్ఛికమైనవేమీ కావు. అనావృష్టి, అతివృష్టి, వరదలు, తుపానులు, సునామీ, భూకంపాలు, క్షామం, అటవీదహనాలు వంటి ప్రకృతి విపరిణామాలన్నిటికీ కారణాలున్నాయని, ఒక సుదీర్ఘ కార్యకారణ సంబంధాల గొలుసులో ఏవో సుదూర, నిగూఢ కారణాల వల్ల జరుగుతున్నవేనని, నిష్కారణంగా జరుగుతున్నవి కావని శాస్త్ర విజ్ఞానం రోజురోజుకూ కనిపెడుతున్నది. మానవ పర్యావరణంలో, మొత్తంగా భూగోళ జీవ పర్యావరణంలో జరుగుతున్న మార్పులే ఈ ప్రకృతి వైపరీత్యాలనబడేవాటికి కారణమని తెలుస్తూనే ఉంది. భూగర్భంలోని పలకల కదలిక వల్ల సహజంగా ఏర్పడుతుందనుకునే భూకంపానికి కూడా ఇప్పుడు కారణాలు చెప్పగలుగుతున్నారు. ఎక్కడో భూగర్భంలోనో, సముద్ర గర్భంలోనో జరిపిన ఏదో అణ్వస్త్ర పరీక్ష వల్లనో, మరెక్కడో భూమి మీద పీడన పెరగడం వల్లనో ఆ పలకల కదలిక జరుగుతున్నదని, భారీ జలాశయాలకూ సమీప ప్రాంతాల్లో పలకల కదలికలకు, భూకంపానికి సంబంధం ఉన్నదని కూడా శాస్త్రం చెబుతున్నది. పెట్టుబడిదారీ ఉత్పత్తి, వస్తు వినియోగ సంస్కృతి ప్రకృతి మీద సాగిస్తున్న అరాచకానికి ప్రకృతి ప్రతీకారం తీర్చుకుంటున్నదని అంటున్నవాళ్లు కూడా ఉన్నారు.
ప్రకృతి పాత్ర ఎంత?
క్లైమేట్ చేంజ్ అనే వాతావరణ మార్పు వల్ల, ఉష్ణోగ్రతల పెరుగుదలలో అనూహ్యమైన మార్పుల వల్ల, ఇంధన వినియోగం పెరిగినకొద్దీ ఓజోన్ పొర చిరిగిపోవడం వల్ల, జల, వాయు, భూ కాలుష్యం వల్ల అనావృష్టి, అతివృష్టి సంభవిస్తున్నాయని ఇప్పుడు దాదాపు అందరికీ తెలుసు. తెలుగు సమాజం వరకే వస్తే, జూన్ 7 న మృగశిరతో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం కొన్నేండ్లుగా వారాలు, నెలలూ ఆలస్యంగా వస్తున్నది. ఆ రావడం కూడా ఎన్నో రోజులు అనావృష్టి ఉండి, హఠాత్తుగా ఒకరోజో, కొన్ని రోజులో అతివృష్టి కురుస్తున్నది. క్యుములోనింబస్ వర్షాలు అని శాస్త్రవేత్తలు పేరుపెట్టిన ఈ ఉధృత వర్షాల వల్ల హఠాత్తుగా వాగులు, వంకలు, నదులు ఉప్పొంగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లోని ఇండ్లకు భారీగా వరదనీరు చేరుతున్నది. ఇండ్లు, వాహనాలు కొట్టుకుపోయాయని, ఒక అంతస్తంతా మునిగిపోయిందని, ఒక కాలనీలో పడవలు నడపాల్సి వస్తున్నదని వార్తలు చదవడం, వినడం మనకు అలవాటైపోయింది. ఇది ప్రకృతి వైపరీత్యమనో మానవ తప్పిదమనో అనడం సులభం. కానీ ఇందులో నిజంగా ప్రకృతి పాత్ర ఎంత? మన వాగులూ, వంకలూ, ఏర్లు, నదులు అన్నీ, కూడా ఒకప్పుడు ప్రవహిస్తుండినంత విశాల ప్రాంతాన్ని మనం ఇప్పుడు వాటికి వదలడం లేదు. ఏ జల ప్రవాహం చూసినా అది గతంలో ప్రవహించిన వైశాల్యంలో సగానికో, పావుకో దాన్ని ప్రవాహమార్గం తగ్గింది. రెండు పక్కలా భవన నిర్మాణాలు, కరకట్టలు వచ్చాయి. అలా ప్రవాహ వైశాల్యం తగ్గిపోవడం మాత్రమే కాదు, ప్రవాహం పొడవునా ఒకటో రెండో అంతకన్న ఎక్కువో ఆనకట్టలు వచ్చి, హెచ్చు నీరు వచ్చినప్పుడు సులభంగా సముద్రం దాకా ప్రవహించే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడిక ఆ నీటికి ప్రతి అడ్డుకట్ట దగ్గరా విశాలంగా పరుచుకోవడమో, లేదా పక్కన కరకట్టలను కూలదోసి, భవనాల మీదికి లంఘించడమో తప్ప మరొక మార్గం లేదు.
ఆశ్రిత పక్షపాతం..
కాళేశ్వరం ప్రాజెక్టుతో ఆర్థిక, పర్యావరణ సమస్యలున్నాయని ఎనిమిదేండ్లుగా ఎందరో హెచ్చరిస్తున్నప్పటికీ, ప్రభుత్వం ముందుకే వెళ్లింది. అలాగే నివాస కాలనీల నిర్మాణం కూడా సగటు మనిషి చేస్తున్నదేమీ కాదు. సగటు మనిషికి ఒక ఆశ్రయం ఉండాలనే ఆకాంక్ష ఉంటుంది గనుక తన శక్తి మేరకు ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందనుకుంటే అక్కడికి వెళ్తున్నాడు. ఆ ఆశ్రయాలు కల్పిస్తున్నది వ్యాపారులు, అనుమతిస్తున్నది ప్రభుత్వం. ఎకరాల్లో కొని గజాల్లో అమ్ముతూ, కోట్లకు పడగెత్తుతూ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన రియల్ ఎస్టేట్ వ్యాపారం తన భూదాహంతో చెరువులనూ, కుంటలనూ ఆక్రమిస్తున్నది. ఆ అక్రమ ఆక్రమణలను అవినీతి వల్లనో, ఆశ్రిత పక్షపాతం వల్లనో ప్రభుత్వం చూసీ చూడనట్టు వదిలేస్తున్నది. చివరికి సగటు మనిషి ఇల్లు మునిగిపోతున్నది. ఈ వరదలకు, ముంపులకు, బీభత్సానికీ అసలు కారణం ప్రకృతా, మనిషా, వ్యాపారమా, అధికారమా?
సగటు మనిషి ఏం చేశాడు?
కుంటలు, చెరువులు వంటి జలాశయాల కథ మరొకటి. వాటిలో కొన్ని భూతలం మీద సహజంగా ఉన్న గుంటల్లో, లోతు ప్రాంతాల్లో ఏర్పడినవి. మరికొన్ని వందల ఏండ్లుగా మనుషులు చిన్న చిన్న ప్రవాహాలకు అడ్డు కట్టలు కట్టి వ్యవసాయం కోసం నిర్మించుకున్న జలాశయాలు. గ్రామాలు, నగరాలు పెరిగిన కొద్దీ ఈ కుంటల, చెరువుల ఆక్రమణ మొదలై, విపరీతంగా పెరిగిపోయింది. గొలుసు చెరువులకు పేరుపొందిన హైదరాబాద్ వంటి నగరాల్లో వందలాది, వేలాది కుంటలు, చెరువులు ఇవాళ నివాస కాలనీలైపోయాయి. కానీ ఆ కుంటలు, చెరువులు అన్నీ చుట్టూరా ఉన్న సమతలం కన్నా లోతైన ప్రాంతాలు గనుక నీరు పల్లమెరుగు అన్నట్టు సహజంగానే ఏమాత్రం వర్షానికైనా నీళ్లు అక్కడ చేరతాయి. మనుషులు తమ ఇళ్లలోకి నీళ్లు వచ్చాయని అనుకుంటున్నారు గానీ, వాస్తవానికి మనుషులే నీళ్ల సహజ స్థలాలను ఆక్రమించి ఇండ్లు కట్టుకున్నారు. ఒక్క పెద్దవాన పడితే నీళ్లు ఇళ్లను వెతుక్కుంటూ తిరిగి వస్తున్నాయి. ఇది ప్రకృతి వైపరీత్యమవుతుందా, లేక మనుషులు చేసిన విపరీత చర్యలకు ప్రకృతి చేస్తున్న ప్రతిచర్య అవుతుందా? మళ్లీ ఇక్కడ మానవ తప్పిదం, మనుషులు చేసిన విపరీత చర్యలు అనే మాటలకు కూడా మరొక కోణం ఉంది. నదీప్రవాహాలను అడ్డుకుని ఆనకట్టలు కట్టడానికి, చెరువులను కబ్జా చేసి నివాస కాలనీలు నిర్మించడానికి, అటువంటి అనేక పనులకు బాధ్యత సగటు మనిషిదేమీ కాదు. నదుల మీద ఆనకట్టల నిర్ణయాలు తీసుకునేది సగటు మనిషి కాదు, నదీ తీరాలను, జలప్రవాహ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు సాగిస్తున్నది సగటు మనిషి కాదు. విధాన నిర్ణేతలుగా ఉన్న పాలకులు సమాజ అవసరం అనే పేరు చెప్పో, వ్యవసాయాభివృద్ధి అనే పేరు చెప్పో, నదీ ప్రవాహాలకు ఆనకట్టలు కట్టే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయాల్లో ప్రజా ప్రయోజనం కన్న ఎక్కువగా తమ ఆశ్రితులైన కాంట్రాక్టర్ల ప్రయోజనాలో, తమ ముడుపుల ప్రయోజనాలో ఉంటున్నాయి.
- ఎన్ వేణుగోపాల్
ఎడిటర్, వీక్షణం