క్విక్ కామర్స్ కంపెనీలతో కిరాణాలు ఖతమా?

క్విక్ కామర్స్ కంపెనీలతో కిరాణాలు ఖతమా?
  • షాపులకు తగ్గుతున్న గిరాకీ
  • బిజినెస్‌‌‌‌లను దెబ్బతీస్తున్న జెప్టో, బ్లింకిట్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టామార్ట్‌‌‌‌
  • ఆకట్టుకుంటున్న స్పీడ్‌‌ డెలివరీ, డిస్కౌంట్లు

న్యూఢిల్లీ: గతంలో ఈ–కామర్స్‌‌‌‌ (ఆన్‌‌‌‌లైన్ షాపింగ్‌‌‌‌), ఇప్పుడు క్విక్ కామర్స్‌‌‌‌ (తొందరగా ఇంటికి డెలివరీ చేసే కంపెనీలు)  కిరాణా షాపులకు శాపంగా మారాయి. కూరగాయల నుంచి  పర్సనల్ కేర్ వరకు వివిధ ప్రొడక్ట్‌‌‌‌లను అమ్మి కిరాణా షాపుల నుంచి  బిజినెస్‌‌‌‌ను దొచేస్తున్నాయి. కన్జూమర్లు కూడా ఆర్డర్ పెడితే పది నిమిషాల్లో డెలివరీ చేయగలిగే క్విక్ కామర్స్ కంపెనీల వైపు ఆకర్షితులవుతున్నారు.  బ్లింకిట్‌‌‌‌, ఇన్‌‌‌‌స్టామార్ట్‌‌‌‌, జెప్టో, బీబీ నౌ వంటి ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో షాపింగ్ చేయడం పెంచారు. ముఖ్యంగా కిరాణా షాపులతో పోలిస్తే క్విక్‌‌‌‌ కామర్స్ కంపెనీలు 10–15 శాతం తక్కువ రేటుకే ప్రొడక్ట్‌‌‌‌లను అమ్ముతున్నాయి.

కరోనా సంక్షోభం టైమ్‌‌‌‌లో క్విక్‌‌‌‌ కామర్స్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీల సేల్స్‌‌‌‌లో క్విక్ కామర్స్‌‌‌‌  రూట్‌‌‌‌  కీలకంగా మారింది.  క్విక్ కామర్స్‌‌‌‌తో  కిరాణా షాపులు, ఇంటికి దగ్గరలోని రిటైల్‌‌‌‌ స్టోర్లు ఎక్కువగా నష్టపోతున్నాయని  డెల్హివరీ సీఈఓ సహిల్‌‌‌‌ బారువా అన్నారు. డైరెక్ట్‌‌‌‌ టు కన్జూమర్ (డీ2సీ) సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఈ–కామర్స్ వాటా సుమారు 15  శాతం ఉందని, ఇందులో సగం ఫ్యాషన్ సెగ్మెంట్‌‌‌‌ నుంచే ఉందని పేర్కొన్నారు.

క్విక్‌‌‌‌ కామర్స్ వాటా చాలా తక్కువ ఉందని, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, కొంత ఎలక్ట్రానిక్స్ స్టోర్ల్‌‌‌‌పై దీని ప్రభావం ఉందని వివరించారు. దీనర్థం క్విక్ కామర్స్ ప్రభావం ఈ–కామర్స్‌‌‌‌పై కంటే  కిరాణా షాపులపై ఎక్కువగా ఉందని తెలుస్తోందని  పేర్కొన్నారు. నెస్లే, ఐటీసీ, పార్లే, మారికో, ఇమామి వంటి టాప్ ఎఫ్‌‌‌‌ఎంసీజీ కంపెనీలు తమ ఈ–కామర్స్ సేల్స్‌‌‌‌లో  సగం వాటా క్విక్ కామర్స్ ద్వారానే జరుగుతున్నాయని ఒప్పుకున్నాయి.   5 కేజీలు, 10 కేజీలు వంటి పెద్ద సైజ్ ప్యాకెట్‌‌‌‌ అమ్మకాలు కూడా  క్విక్ కామర్స్ ప్లాట్‌‌‌‌ఫామ్స్‌‌‌‌లో జరుగుతున్నాయి. 

 భారీగానే కిరాణా హోమ్ డెలివరీలు..

దేశం మొత్తం మీద సుమారు 1.2 కోట్ల  కిరాణా షాపులు ఉన్నాయని అంచనా. ఏడాదికి  800 బిలియన్ డాలర్ల వ్యాపారాన్ని ఇవి జరుపుతున్నాయి.  కానీ, మెజారిటీ కిరాణా షాపులు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో సర్వీస్‌‌‌‌లను అందించడం లేదు. ఫోన్ కాల్ లేదా వాట్సాప్‌‌‌‌పై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. హోమ్ డెలివరీ సర్వీస్‌‌‌‌లను కూడా కిరాణా షాపులు అందిస్తున్నాయి. ప్రస్తుతం కిరాణాల ద్వారా 80 బిలియన్ డాలర్ల విలువైన హోమ్‌‌‌‌ డెలివరీ బిజినెస్ జరుగుతోందని అంచనా.

క్విక్ కామర్స్ ద్వారా 4 బిలియన్ డాలర్ల బిజినెస్ మాత్రమే జరుగుతోంది.  క్విక్ కామర్స్ వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇంకా కిరాణాల హోమ్‌‌‌‌ డెలివరీ బిజినెస్‌‌‌‌ను చేరుకోవడానికి చాలా టైమ్ పడుతుందని ఎనలిస్టులు చెబుతున్నారు. కిరాణా షాపులు కూడా ప్రభుత్వం తెచ్చిన ఓపెన్ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఫర్ డిజిటల్  కామర్స్ (ఓఎన్‌‌‌‌డీసీ) లో జాయిన్ అవుతున్నాయి. ఓఎన్‌‌‌‌డీసీలోని కిరాణాలకు  రోజుకి 2,500 ఆర్డర్లు వస్తున్నాయని వీటిని ప్రాసెస్ చేసే కికో లైవ్‌‌‌‌ పేర్కొంది. 

ఈ-కామర్స్ పెరగడంపై ఆందోళన..

దేశంలో అమెజాన్‌‌‌‌, ఫ్లిప్‌‌‌‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు విస్తరించడంపై కేంద్ర కామర్స్ మినిస్టర్ పీయూష్‌‌‌‌ గోయెల్ ఆందోళన వ్యక్తం చేశారు. రిటైల్ సెక్టార్‌‌‌‌‌‌‌‌లో ఉద్యోగాల కోత పెరుగుతుందని పేర్కొన్నారు. అమెజాన్ ఇండియాలో బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తాననడంపై ఆయన మాట్లాడారు. దేశానికి  అమెజాన్ ఎటువంటి సేవ చేయడం లేదని, వారి బ్యాలెన్స్ షీట్‌‌‌‌లోని నష్టాలను పూడ్చుకోవడానికి ఇన్వెస్ట్ చేస్తోందని అన్నారు.

ధరలను బాగా తగ్గించి ప్రొడక్ట్‌‌‌‌లు అమ్మడంతో వచ్చిన నష్టాలను  అమెజాన్ పూడ్చుకుంటోందని చెప్పారు. ప్రొఫెషనల్స్‌‌‌‌కు రూ.1,000 కోట్లు చెల్లించడం ద్వారా నష్టం వచ్చిందని అంటున్నారని, ఈ ప్రొఫెషనల్స్ ఎవరో తనకు తెలియదని కామెంట్ చేశారు. తమపై కేసు ఎవరూ గెలవకుండా ఉండేందుకు టాప్ లాయర్లకు ఇంత మొత్తం చెల్లించి ఉండొచ్చని పేర్కొన్నారు.