ముస్లింలు ఇక ప్రాంతీయ పార్టీల వైపేనా?

ఒకప్పుడు బీజేపీయేతర జాతీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ ముస్లిం రాజకీయాలకు ప్రధాన వేదికగా ఉండేవి. ఒకవిధంగా దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ముస్లిం లీగ్ రాజకీయాలను కాంగ్రెస్ అనుసరిస్తూ వస్తున్నది. దీని కారణంగా చాలాకాలం ముస్లింలు కాంగ్రెస్ కు ఓటు బ్యాంకుగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభావం తగ్గడం, జాతీయ స్థాయిలో మరే పార్టీ మనుగడలో లేకపోవడంతో ముస్లింలు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను ఆశ్రయిస్తున్నట్లు స్పష్టమవుతున్నది. ఇటీవల 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 13 శాతానికి పైగా సీట్లలో ముస్లింలు గెలుపొందడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది.

హిందూ ఓట్లపైనే బీజేపీ ఫోకస్

మరోవైపు ముస్లింలకు ప్రాతినిధ్యం ఇవ్వడం పట్ల బీజేపీ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అస్సాంలో ఆ పార్టీ మైనారిటీ సెల్ అవసరం లేదని రద్దు చేయడం ఇక్కడ గమనించాలి. నందిగ్రామ్​లో తృణమూల్​ చీఫ్ మమతా బెనర్జీని ఓడించిన సువేందు అధికారి.. ఆ నియోజకవర్గంలో గల సుమారు 30 శాతం ముస్లిం ఓట్లు తనకు అవసరం లేదన్నట్లు మాట్లాడారు. ఆయన పూర్తిగా హిందువుల ఓట్లపైనే దృష్టి కేంద్రీకరించారు. అస్సాంలో బీజేపీ ఎనిమిది మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టినా ఒక్కరు కూడా గెలుపొందలేదు. ఇక లెఫ్ట్​ పార్టీల్లో ప్రస్తుతం బలమైన ఉనికి సీపీఎంకు మాత్రమే ఉంది. అయితే ఆ పార్టీ కూడా కేరళకే పరిమితమై ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ వస్తున్నది. దీంతో ఆ పార్టీ జాతీయ స్థాయిలో ముస్లిం రాజకీయాలకు వేదిక కాలేకపోతోంది.

112 సీట్లలో గెలుపొందిన ముస్లిం అభ్యర్థులు

4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో మొత్తం 827 ఎమ్మెల్యే సీట్లకు ఎన్నికలు జరిగితే.. 112 చోట్ల ముస్లిం అభ్యర్థులు గెలిచారు. ఇది ఇటీవల ఎన్నికలు జరిగిన మొత్తం సీట్లలో 13 శాతంకుపైనే. బీహార్, ఉత్తర ప్రదేశ్‌‌లో ఆర్జేడీ, ఎస్పీ వంటి పార్టీలు వారికి ఎప్పుడూ వేదికను అందిస్తున్నాయి. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ముస్లింలకు తామే పెద్ద దిక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 

బెంగాల్​లో తగ్గిన్రు.. అస్సాంలో పెరిగిన్రు

బెంగాల్‌‌లో కొత్తగా ఎన్నికైన సభ్యుల్లో 42 మంది ముస్లింలే ఉన్నారు. వీరిలో 41 మంది టీఎంసీకి చెందినవారే. టీఎంసీయేతర ముస్లిం ఎమ్మెల్యేగా ఎన్నికైన మొహమ్మద్ నస్వాద్ సిద్దిక్ రాష్ట్రీయ సెక్యులర్ మజ్లిస్ పార్టీ(ఆర్‌‌ఎస్‌‌ఎంపీ) టికెట్‌‌పై గెలిచారు. అయితే, బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికైన ముస్లింల సంఖ్య ఈసారి తగ్గుముఖం పట్టింది. 2016లో 56 మంది ఎన్నిక కాగా, 2011లో 59 మంది ఎన్నికయ్యారు. ఇదే టైంలో అస్సాంలో ముస్లిం అభ్యర్థుల సంఖ్య 31కు పెరిగింది. 2016లో 29 మంది, 2011లో 28 మంది అస్సాంలో గెలుపొందారు. అస్సాంలో తీవ్రస్థాయి ఆందోళనల తర్వాత జరిగిన 1983 ఎన్నికల్లో 33 మంది ముస్లింలు గెలుపొందారు. ఈసారి 31 మంది గెలవడం రికార్డే. వీరిలో 16 మంది కాంగ్రెస్ నుంచి, 15 మంది ఏఐయూడీఎఫ్ నుంచి గెలిచారు. అక్రమ శరణార్థులు దేశంలో మరెక్కడా లేని విధంగా ప్రధాన సమస్యగా ఉన్న అస్సాంలో మతపర సమీకరణాలు నెలకొన్నాయి. ముస్లిం ఎమ్మెల్యేలందరూ ప్రతిపక్షాల్లోనే ఉండగా, ముస్లిమేతరులు, గిరిజనులతో పాటు అందరూ బీజేపీ, దాని 
మిత్రపక్షాలతో ఉన్నారు. 

ఒవైసీ ప్రయత్నాలు వర్కవుట్​ కావట్లే

హైదరాబాద్ కు చెందిన ఆలిండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేషనల్​ లెవెల్​లో ముస్లింలకు రాజకీయ వేదికగా విస్తరించే ప్రయత్నం చేస్తున్నా అది అంతగా వర్కవుట్​ కావడం లేదు. మహారాష్ట్ర, బీహార్ లో కొద్దిపాటి విజయాలు తప్ప పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఒవైసీ బెంగాల్​లో 7, తమిళనాడులో 3 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలుపొందలేకపోయారు. బెంగాల్ లో ఒంటరిగా పోటీ చేయగా, తమిళనాడులో టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకేతో చేతులు కలిపినా ప్రయోజనం లేకపోయింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ పార్టీలతో అక్కడి ముస్లింలు కలవడమే దీనికి ప్రధాన కారణం. బెంగాల్ లో టీఎంసీ, అస్సాంలో ఏఐయూడీఎఫ్, కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్) నుంచి మాత్రమే ముస్లిం అభ్యర్థులు విజేతలుగా నిలిచారు. తమిళనాడులో డీఎంకే, చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలు కూడా వారికి ప్రాతినిధ్యం కల్పించాయి. అస్సాం, కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ టిక్కెట్లపై కూడా ముస్లిం అభ్యర్థులు గెలిచారు.

తమిళనాడులో పెద్దగా మార్పులేదు

కేరళలో కూడా ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. కొత్తగా ఎన్నికైన వారిలో 32 మంది ముస్లిం ఎమ్మెల్యేలే. వారిలో 15 మంది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కు చెందినవారు. మిగిలిన వారిలో కాంగ్రెస్‌‌ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి తొమ్మిది మంది, ఇండియన్ నేషనల్ లీగ్, నేషనల్ సెక్యులర్ కాన్ఫరెన్స్ నుంచి ఒక్కొక్కరు, మరో ముగ్గురు ఇండిపెండెంట్లు. 2016లో 29 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 32కు పెరిగింది. తమిళనాడు, పుదుచ్చేరిలో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్యలో పెద్దగా మార్పులేదు. 2016లో మాదిరిగానే తమిళనాడు నుంచి ఆరుగురు, పుదుచ్చేరి నుంచి ఒకరు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తమిళనాడులో ఆరుగురు డీఎంకే, అన్నాడీఎంకే, వీసీకే నుంచి విజయం సాధించగా.. పుదుచ్చేరిలో ఒక్క అభ్యర్థి డీఎంకే నుంచి గెలుపొందారు.
- చలసాని నరేంద్ర,
పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌