- మాగనూర్ హైస్కూల్లో ఫుడ్‌పాయిజన్‌పై రిపోర్ట్ ఇవ్వండి
- విద్యార్థుల ప్రాణాలు పోయేదాకా స్పందించరా? అని ఫైర్
- -తమకు అధికారమిస్తే డీఈవోను సస్పెండ్ చేస్తామని కామెంట్
- విచారణ వచ్చే నెల 2వ తేదీకి వాయిదా
హైదరాబాద్, వెలుగు:నారాయణపేట జిల్లా మాగనూర్ జడ్పీ హైస్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒకే స్కూల్లో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా? అని ఫైర్ అయింది. స్కూల్లో ఫుడ్‌పాయిజన్ తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో నాణ్యత పాటించడం లేదని, ప్రైవేట్ స్కూల్స్‌లో ఫీజు నియంత్రణకు కమిటీని నియమించాలనే నిబంధనను ప్రభుత్వం అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన ‘హెల్ప్ ది పీపుల్ చారిటబుల్ ట్రస్ట్’ అధ్యక్షుడు కీతినీడి అఖిల్ శ్రీ గురు తేజ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది.
పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ మధ్యాహ్న భోజనం వికటిస్తున్నదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో ఈ నెల 20న 50 మంది, 24న 70, 26న 27 మంది చొప్పున అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. కరీంగనర్ జిల్లా గంగాధరలో కూడా 24న 20 మంది స్టూడెంట్స్
ఆస్పత్రి పాలయ్యారని వివరించారు.జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషకాహార ప్రమాణాలు పాటించి, మధ్యాహ్న భోజనం ఇచ్చేలా రాష్ట్ర సర్కారుకు ఆదేశాలు జారీ చేయాలని కోర్టును కోరారు.
చర్యలపై రిపోర్ట్ ఇవ్వండి
ఏజీ వచ్చి వివరణ ఇవ్వాలంటూ విచారణను కోర్టు 10 నిమిషాలపాటు వాయిదా వేసింది. అడిషనల్ అడ్వొకేట్ జనరల్ మహ్మద్ ఇమ్రాన్‌ఖాన్ విచారణకు వచ్చి లంచ్ బ్రేక్ తర్వాత వివరాలు ఇస్తామని చెప్పడంతో డివిజన్ బెంచ్ అంగీకరించింది. లంచ్ బ్రేక్ తర్వాత ఏఏజీ ఖాన్ వాదనలు వినిపించారు. ‘‘చిన్నారులే రాష్ట్ర భవిష్యత్తు. వాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఈ నెల 20న ఉప్మా తిన్న కారణంగా స్టూడెంట్స్ అనారోగ్యానికి గురయ్యారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సీరియస్ చర్యలు తీసుకుంటాం. హెచ్‌ఎం సహా బాధ్యులపై సస్పెన్షన్‌కు వెనుకాడం.
Also Read:-గురుకులాలు, పాఠశాలల్లో ఫుడ్ క్వాలిటీపై స్పెషల్ డ్రైవ్
విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వబోం” అని తెలిపారు. ఫుడ్ పాయిజన్ ఘటనలపై సమగ్ర వివరాలతో కౌంటర్ వేస్తామని చెప్పారు. ఇందుకు రెండు రోజుల సమయం కావాలని కోరారు. వాదనల తర్వాత హైకోర్టు.. ప్రతీ జిల్లాకు ఓ శాంపిల్ చొప్పున సేకరించి ల్యాబ్ టెస్టింగ్‌కు పంపాలని మహిళా అభివృద్ధి ,శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ డైరెక్టర్‌ను ఆదేశించింది. షెడ్యూల్ 2 ప్రకారం నాణ్యత, పోషక విలువను పరిశీలించాలని, ఫుడ్ పాయిజన్ ఘటనలపై తీసుకున్న చర్యలు వివరించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశించింది. విచారణను వచ్చే నెల 2వ తేదీకి వాయిదా వేసింది.
వారంలో రిపోర్ట్ ఇవ్వండి
పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా? అని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా లేనట్టు అనిపిస్తున్నదని వ్యాఖ్యానించింది. ‘‘ఫుడ్ పాయిజన్‌తో ఎంత మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు? అధికారులు ఏం చేశారు? బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు?’’ అనే పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇందుకు వారం సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరగా, కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
జిల్లా కేంద్రంలో ఉండే అధికారిని సంప్రదించి వివరాలు సేకరించడానికి వారం వ్యవధి ఎందుకని ప్రశ్నించింది. ‘‘మాగనూర్ ఏమన్నా రిమోట్ ప్రాంతమా? డీఈవోకు సెల్‌ఫోన్ లేదా?” అని మండిపడింది. పిల్లలకు ఇచ్చే భోజనం విషాహారంగా మారుతుంటే మనుషులుగానైనా స్పందించాలి కదా? అని వ్యాఖ్యానించింది. ‘‘హైకోర్టు ఆదేశాలు ఇస్తేనే అధికారులు పనిచేస్తారా? వారికి కూడా పిల్లలున్నారు కదా! మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తే 5 నిమిషాల్లో హాజరవుతారు’’ అని సీరియస్ అయింది. తమకే అధికారం ఇస్తే డీఈవోను సస్పెండ్ చేస్తామంది.