- నిర్లక్ష్యంగా స్కూల్ బస్సుల ఫిట్నెస్ చెకప్.!
- ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి
- ఫిట్నెస్ లేకుంటే రోడ్డెక్కవద్దంటున్న రవాణాశాఖ ఆఫీసర్లు
మహబూబాబాద్, వెలుగు : స్కూల్ బస్సుల్లో మన పిల్లలు భద్రంగానే వెళ్తున్నారా? బడి బస్సులు ఫిట్నెస్తోనే నడుపుతున్నారా అనే అంశాలపై అధికారులు స్కూల్స్ప్రారంభించక ముందే పరీక్షలు చేయాలి. కొత్త చదువుల ఏడాదికి 11 రోజుల గడువే మిగిలింది. ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. కానీ, జిల్లాలో ఇప్పటికీ ఫిట్నెస్ పరీక్షలు ప్రారంభించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులు సకాలంలో ఫిట్నెస్టెస్ట్లు చేయకపోవడంతో స్కూల్ బస్సులు డైరెక్ట్‌గానే రోడ్డు ఎక్కుతున్నాయి. రవాణా శాఖలో కొంతమంది ఆఫీసర్ల నిర్లక్ష్యం, అవినీతి కారణంగా ప్రైవేట్‌స్కూల్ యజమాన్యాలు కాలం చెల్లిన బస్సులను నడుపుతున్నాయి.
ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి..
ప్రైవేట్ స్కూల్ బస్సులు అదుపుతప్పి ప్రమాదాలు జరిగిన సమయంలోనే విద్యార్థుల తల్లిదండ్రులు, రవాణా శాఖ ఆఫీసర్లు హడావుడి చేస్తున్నారు. గతేడాది మహబూబాబాద్జిల్లాలో ర్యాష్ డ్రైవింగ్ కారణంగా 5 చోట్ల ప్రమాదాలు జరిగాయి. ప్రమాదాలు జరగకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై సరైన దృష్టి సారించడం లేదు.
తల్లిదండ్రులు నెలకొకసారి స్కూల్ బస్సులో ప్రయాణించి బస్ కండిషన్, విద్యార్థుల తరలింపు వివరాలు తెలుసుకోవాలి. ప్రతి స్కూల్ బస్సుకు డ్రైవరు, క్లీనర్, అటెండర్ ఉన్నారా, లేరా నిర్ధారించుకోవాలి. ప్రభుత్వ రవాణా శాఖ అనుమతి, ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను పంపించకుండా తల్లిదండ్రులు ముందస్తు జాగ్రత్త వహించాలి.
ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సుల వివరాలు..
గత విద్యాసంవత్సరంలో హనుమకొండ జిల్లాలో 973, వరంగల్లు 443, భూపాలపల్లి_ములుగు 225, జనగామ 163, మహబూబాబాద్ 160 స్కూలు బస్సులు ఉన్నాయి. ఈ ఏడాదిలో ప్రైవేట్ స్కూల్ బస్సుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశమున్నది.
నిబంధనలు పాటించాలి..
స్కూల్ బస్సు డ్రైవర్లు కచ్చితంగా యూనిఫాం ధరించాలి. స్కూల్ బస్సులో పరిమితికి నుంచి విద్యార్థులను తీసుకెళ్లవద్దు. హెవీ మోటారు వెహికల్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. డ్రైవింగ్ సమయంలో సెల్ ఫోన్ వాడవద్దు, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. 60 ఏళ్లు దాటిన వారిని డ్రైవర్లుగా కొనసాగించవద్దు.
ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి
ప్రైవేట్ స్కూల్ బస్సుల యాజమాన్యాలు ఖచ్చితంగా విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందే స్కూల్ బస్సు ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఇప్పటి వరకు ఒక్క బస్సును కూడా చెకప్‌కి తీసుకురాలేదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
- గౌస్ పాష, జిల్లా రవాణా శాఖ ఆఫీసర్, మహబూబాబాద్ జిల్లా