ఎనర్జీతో ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా బలాన్నిచ్చే తిండి తినాలి. అలాంటిది పెద్దవాళ్లు ‘నాలుక్కి రుచి తెలియట్లేదు, తినబుద్ధి కావట్లేదు, ఆకలి వేయట్లేదు’ అని సరిగా తినరు. బలవంతం చేస్తే కొంచెం తింటారంతే. పెద్దవాళ్లు తినకపోవడానికి వయసు పెరగడం ఒక్కటే కాదు ఆరోగ్య సమస్యలు, మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా కారణం అంటున్నారు డాక్టర్లు.
తినకున్నా పొట్ట నిండుగా ఉంది అంటారు చాలామంది పెద్దవాళ్లు. అయితే, శారీరక శ్రమ తగ్గిపోవడం, మెటబాలిజం నెమ్మదించడం వల్ల తక్కువ తింటున్నారని అనుకుంటారు చాలామంది. నిజానికి వాళ్లు తిన్నా కూడా అరిగించుకోలేరు. అందుకు కారణాలు ఉన్నాయి..
వయసు పెరగడం
వయసు పెరిగిన కొద్దీ శరీరంలోని ఆర్గాన్స్ పనితీరు తగ్గిపోతుంటుంది. దీన్నే ‘మాలిక్యులర్ ఏజింగ్’ అంటారు. అంటే ఒక్కో కణం వయసు పెరిగి, దాని పనితీరు నెమ్మదిగా తగ్గుతుంది. దాంతో, మెటబాలిజం స్లో అవుతుంది. మామూలుగా అయితే... తిన్నది అరగాలి. రక్తంలో కలిసి, అన్ని ఆర్గాన్స్‌కి శక్తినివ్వాలి. కానీ, పెద్దవాళ్లలో అలా జరగదు. వయసు పెరగడం వల్ల తిన్నది సరిగా అరగదు. పోషకాలు సరిపోను అందవు. జీర్ణాశయంలో వచ్చే మార్పుల వల్ల కూడా పెద్ద వాళ్లు ఇంతకుముందు తిన్నంత తినలేరు.
దీనికి తోడు గ్యాస్ ఎక్కువగా తయారవుతుంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్‌తో పాటు కడుపులో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. దాంతో పొట్ట నిండుగా ఉండి, తినాలనిపించదు.
ఆరోగ్యసమస్యలు కూడా..
పెద్దయ్యాక చాలామందికి చిన్నవో పెద్దవో ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కొందరైతే డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గుండెజబ్బులు, కీళ్ల సమస్యలు వంటివి తగ్గడానికి కొన్నేండ్లుగా టాబ్లెట్లు వాడుతుంటారు. టాబ్లెట్లు ఎక్కువ రోజులు వాడడం వల్ల కొన్నిసార్లు ‘గ్యాస్ట్రైటిస్’ (పొట్టలోని మ్యూకస్ దెబ్బతింటుంది) సమస్య వచ్చి, గ్యాస్ ప్రాబ్లమ్ వస్తుంది.
డయాబెటిస్ ఉన్నవాళ్లలో షుగర్ కంట్రోల్ లేనప్పుడు నరాలు బలహీనం అవుతాయి. జీర్ణాశయానికి సంబంధించిన నరాలు బలహీనమై, వాటి పనితీరు తగ్గిపోతుంది. అంతేకాదు చిన్నపేగు, పెద్దపేగులో కదలికలు తగ్గిపోయి కడుపు ఉబ్బరంగా ఉండి, మోషన్ ఈజీగా కాదు. దాంతో పొట్ట నిండుగా అనిపించి, ఏం తినబుద్దికాదు. గుండె సమస్యలు ఉన్నవాళ్లకి రక్తం పల్చగా ఉండడానికి కొన్ని రకాల టాబ్లెట్లు ఇస్తుంటారు. అవి వాడడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఇమ్యూనిటీ తగ్గడం
పెద్దవాళ్లలో ఇమ్యూనిటీ తక్కువ. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆకలి తగ్గిపోతుంది. ఇన్ఫెక్షన్ తగ్గేంత వరకు ఇలానే ఉంటుంది. అలాగే, జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియా మునుపు ఉన్నంత ఉండదు. యాంటీ బయాటిక్స్ ఇచ్చినప్పుడు గుడ్ బ్యాక్టీరియా ని పెంచే టాబ్లెట్లు కూడా ఇస్తారు. పెరుగుతిన్నా కూడా గుడ్ బ్యాక్టీరియా అందుతుంది. పొట్టలో యాసిడ్స్ రిలీజ్ కాకున్నా, ఆర్గాన్స్ పోషకాల్ని గ్రహించకున్నా కూడా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
పండ్లు గట్టిగ లేకున్నా..
పెద్దవాళ్లలో కొంతమంది పండ్లు స్ట్రాంగ్‌గా ఉండవు. కొందరికి కొన్ని పండ్లు ఊడిపోతాయి. దాంతో సాలిడ్ వంటకాలు ఎక్కువ తినలేరు. కొన్నిసార్లు తినాలని ఉన్నా కూడా ఏదీ తినలేకపోతారు.
ఏం చేయాలంటే
తిండి సరిగా తినకపోతే న్యూట్రియెంట్లు అందవు. ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలా జరగకుండా ఏం చేయాలంటే... వాళ్లకి టాబ్లెట్ లేదా డైట్ రూపంలో న్యూట్రియెంట్లు అందేలా చూడాలి. డయాబెటిస్, బీపి ఉన్నవాళ్లకి పండ్లు, ఎనర్జీ బూస్టర్స్ ఇవ్వొచ్చు. పండ్లు గట్టిగా ఉన్నవాళ్లకి డ్రై ఫ్రూట్స్, ఫ్రూట్స్, చపాతీలు తినిపించొచ్చు. పండ్లు స్ట్రాంగ్‌గా లేనివాళ్లకి వాళ్లు తినగలిగేవి, ద్రాక్ష, పుచ్చకాయల వంటి మెత్తని పండ్లతో పాటు జ్యూస్ లేదా పౌడర్ రూపంలో పోషకాల్ని అందించాలి. పాలు, రాగి జావ వంటి లిక్విడ్ డైట్ కూడా ఇవ్వొచ్చు.
ఎనభై ఏండ్ల వాళ్లలో కొందరు నార్మల్ ఫుడ్ జీర్ణం చేసుకోగలరు. అదే 70 ఏండ్లవాళ్లు జీర్ణం చేసుకోలేకపోవచ్చు. పెద్దవాళ్లు ఇప్పటివరకూ ఏం తినేవాళ్లో ఆ తిండి తినగలరు. కానీ, తిన్న తర్వాత అరగక ఇబ్బంది పడతారు. అలాగని ఫుడ్ తినరని కాదు. కాకపోతే ఒకప్పుడు తిన్నంత తినలేరు. వయసుతో పాటు వచ్చే జీర్ణ సమస్యలు రాకూడదంటే శరీరంలో కొత్త కణాల్ని నింపేయాలి. కానీ, అది సాధ్యం కాదు.
డా.జి.నవోదయ
కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్,
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్
ఈ జాగ్రత్తలు ముఖ్యం
పెద్దవాళ్లు టైంకి ఫుడ్ తినాలి. రాత్రిపూట అయితే 8 గంటల లోపే తినేయాలి. డైట్లో కూరగాయలు, పండ్లు ఎక్కువ ఉండాలి. సలాడ్స్ తింటే ఫైబర్ అందుతుంది. దాంతో కడుపుఉబ్బరం సమస్య తగ్గిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్‌గా తేలికగా అరిగే ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, దోశ వంటివి తినాలి. నూనెలో వేగించినవి, జంక్‌ఫుడ్ ఎక్కువ తినొద్దు. పరగడుపునే టీ, కాఫీ వంటివి తాగితే అసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. పండ్లరసాలు, జావ, అంబలి వంటివి అన్నివిధాలా మంచివి.
- మధురిమ సిన్హా,
చీఫ్ డైటీషియన్, హైదరాబాద్