ఆ పోస్టులకు  తెలుగు పండిట్​లు అర్హులు కాదా?

తెలుగులో డిగ్రీ, పీజీతోపాటు తెలుగు పండిట్ చేసిన విద్యార్థులు తెలుగు లెక్చరర్ పరీక్షలు రాయడానికి అర్హులు కాదట. మొదట పరీక్ష రాయడానికి రమ్మని చెప్పిన వ్యక్తులే, ఆ తర్వాత పరీక్షకు అర్హులు కాదని చెబుతున్నారు. ఏ పరీక్షకు ఏ సర్టిఫికెట్లు అవసరమనే కనీస అవగాహన లేకుండా సొసైటీలు పరీక్షలను నిర్వహిస్తున్నాయి. రాష్ట్రంలోని 111 గురుకుల మైనారిటీ కాలేజీల్లో ఔట్​సోర్సింగ్​ కింద 840 జూనియర్ లెక్చరర్ పోస్టులను భర్తీ చేసేందుకు సొసైటీ జులై 29న ప్రకటన ఇచ్చింది. ఈ నెల 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తెలుగు డిగ్రీ, పీజీతోపాటు తెలుగు పండిట్ చేసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సర్టిఫికెట్లను వెరిఫై చేసి అర్హుల లిస్టును తయారు చేశారు. ఈ నెల 23న పరీక్ష రాయాలని అందరు అభ్యర్థులతోపాటుగా తెలుగు అభ్యర్థులకు ఫోన్ ద్వారా తొలుత సమాచారం ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలుగు పండితులు.. తెలుగు లెక్చరర్ పోస్టులకు అనర్హులుగా ప్రకటిస్తూ పరీక్షకు హాజరు కావద్దని ప్రకటించారు. తెలుగు డిగ్రీ, పీజీతోపాటుగా బీఈడీ ఉంటేనే లెక్చరర్ పరీక్ష రాయాలని నిబంధన పెట్టారు. గతంలో ప్రభుత్వం నిర్వహించిన లెక్చరర్ పరీక్షలు రాసిన తాము ఇప్పుడు ఎందుకు అర్హులం కాకుండాపోయామని తెలుగు పండిట్​ విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో కూడా ఈ సర్టిఫికెట్లు పనికిరావేమోనని ఆందోళన చెందుతున్నారు. సొసైటీలు అవగాహనా రాహిత్యంతో సొంత నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సొసైటీ స్పందించి తెలుగు పండిట్ లకు.. తెలుగు లెక్చరర్ పరీక్ష రాయడానికి అవకాశం కల్పించాలి.
- రావుల రాజేశం, కరీంనగర్