ఎగ్జిట్​ పోల్స్ నిజమైతయా!..పలు సందర్భాల్లో తప్పిన అంచనాలు

ఎగ్జిట్​ పోల్స్ నిజమైతయా!..పలు సందర్భాల్లో తప్పిన అంచనాలు
  •     2004లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న సర్వేలు
  •     భారీ మెజారిటీతో పవర్​లోకి వచ్చిన యూపీఏ కూటమి
  •     2015 బిహార్ ఎన్నికల సర్వే ఫలితాలు రివర్స్
  •     బీజేపీదే అధికారమన్న ఎగ్జిట్ పోల్స్.. పీఠమెక్కిన మహాఘట్ బంధన్​
  •     నిరుడు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్ ఎగ్జిట్ పోల్స్ కూడా రివర్స్​

హైదరాబాద్, వెలుగు : లోక్​సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం రాబోతున్నాయి. ఇప్పటికే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే మూడో సారి అధికారంలోకి వస్తుందని తేల్చేశాయి. దీంతో అధికార బీజేపీ ఎగ్జిట్ పోల్స్​పై సానుకూలంగా స్పందిస్తుంటే.. కాంగ్రెస్ సహా అపోజిషన్ పార్టీలన్నీ వాటిని కొట్టిపారేస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని సందర్భాల్లో నిజం కాకపోవచ్చనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కొన్నిసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన సందర్భాలూ ఉన్నాయి. వివిధ సర్వే సంస్థలు ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసేలా ఉంటున్నాయి. 2004 సార్వత్రిక ఎన్నికలు, 2015, 2020 బిహార్ ఎలక్షన్లు, 2021 వెస్ట్ బెంగాల్, ఢిల్లీ ఎన్నికలు, నిరుడు జరిగిన మధ్యప్రదేశ్, చత్తీస్​గఢ్, రాజస్థాన్ ఎలక్షన్ల విషయంలో ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులయ్యాయి.

2004లో బీజేపీ వస్తుందని చెప్పినా..

2004 సార్వత్రిక ఎన్నికల టైంలో ఎగ్జిట్​పోల్స్ అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి ఎక్కువ సీట్లు వస్తాయని అంచనా వేశాయి. 250 నుంచి 278 వరకు సీట్లు రావొచ్చని పేర్కొన్నాయి. మళ్లీ ఆ పార్టీనే అధికారం చేపడుతుందని చెప్పాయి. అదే సమయంలో యూపీఏకి 174 నుంచి 205 వరకు సీట్లు రావొచ్చని చెప్పాయి. అయితే, చివరకు ఫలితాల్లో మాత్రం యూపీఏనే పై చేయి సాధించింది.

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తారుమారయ్యాయి. ఎన్డీయే కూటమికి 181 సీట్లు రాగా.. యూపీఏకి 218 సీట్లు వచ్చాయి. ఆ తర్వాత పలు పార్టీలూ యూపీఏకి మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ ఎగ్జిట్​పోల్స్​లో ఎన్డీటీవీ మాత్రమే యూపీఏకి 205 సీట్లు ఇవ్వగా.. దానికన్నా 13 సీట్లు ఎక్కువొచ్చాయి.

2015, 2020 బిహార్ ఎన్నికల్లోనూ ఫెయిల్..

బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ రెండు సార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పాయి. 2015లో అన్ని సర్వే సంస్థలు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కనిష్టంగా 64 నుంచి గరిష్టంగా 155 సీట్ల వరకు వస్తాయని లెక్కేశాయి. జేడీయూ, ఆర్జేడీల నేతృత్వంలోని మహాఘట్​బంధన్​కు 132 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి. అయితే, ఆ లెక్కలను తలకిందులు చేస్తూ.. మహాఘట్ బంధన్​కు 151 సీట్లు వచ్చాయి.

ఎన్డీయేకి కేవలం 53 సీట్లే వచ్చాయి. 2020 ఎన్నికల్లోనూ మహాఘట్​బంధన్​కు 180 వరకు.. ఎన్డీయే కూటమికి 135 వరకు రావొచ్చని ఎగ్జిట్​పోల్స్ పేర్కొన్నాయి. చివరకు ఆ ఎన్నికల్లో మహాఘట్​బంధన్​కు 110 సీట్లు వచ్చాయి. జేడీయూ, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 125 స్థానాలు వచ్చాయి. దీంతో ఆ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చింది.

పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అంచనాలూ రివర్స్​

నిరుడు తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్​గఢ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి. అయితే, ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్​పోల్స్ వెల్లడించాయి. ఒక్క తెలంగాణలో మినహా మూడు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తిప్పికొట్టాయి. ఆ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఆ మూడు రాష్ట్రాల్లోనూ కొన్ని సర్వే సంస్థలు బీజేపీకి, ఇంకొన్ని కాంగ్రెస్​కు అనుకూలంగా ఫలితాలివ్వగా.. ఎక్కువ శాతం సంస్థలు హంగ్ అసెంబ్లీ ఏర్పడుతుందని అంచనాకు వచ్చాయి. కానీ, ఆయా రాష్ట్రాల్లో బీజేపీనే అధికారంలోకి వచ్చింది. 

జనాలు కన్ఫ్యూజ్​

ఎగ్జిట్ పోల్స్ అంచనాలు జనాలను కన్ఫ్యూజ్ చేసేలా ఉన్నాయన్న ఆరోపణలూ లేకపోలేదు. ఒక్కో సంస్థ ఒక్కో తీరుగా ఫలితాలను ఇస్తుండడం, కొన్ని సందర్భాల్లో అవి రివర్స్ అవుతుండడంతో ఫైనల్​ ఫలితాల కోసమే పబ్లిక్ వెయిట్ చేస్తున్నారు. ఇటు రాజకీయ నాయకులు కూడా అదే ధోరణితో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నమ్మడం లేదు.

ఎగ్జిట్ పోల్స్ చేసే సర్వే సంస్థలు తీసుకునే శాంపిల్స్​ తక్కువగా ఉంటున్నాయని, జనాలు చాలా వరకు తాము ఎవరికి ఓటేశామన్న విషయాన్ని ట్విస్ట్​ చేసి చెబుతుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కొందరు లీడర్లు ఎగ్జిట్​ పోల్స్​పై పెదవి విరుస్తున్నారు. జనాలు ఇచ్చే రిజల్ట్​నే తాము నమ్ముతామని స్పష్టం చేస్తున్నారు.