అగ్రి చట్టాలపై జరుగుతున్న ఆందోళనలు రైతుల మీద ప్రేమతో చేస్తున్నవా? లేక ఈ చట్టాల ద్వారా రైతులందరూ ప్రధాని మోడీకి మద్దతుగా ఉంటారన్న భయంతో చేస్తున్నవా? అనే అనుమానం కలుగుతోంది. దేశంలో రైతులు సరైన ఆదాయం పొందడం లేదని, రైతులు బాగుపడితేనే దేశాభివృద్ధి చెందుతుందని ప్రధాని మోడీ నమ్ముతున్నారు. తన పార్టీ సిద్ధాంతాలు, ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రజలకు అవసరమైన చట్టాలను చేస్తూ వస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా వ్యవసాయ రంగాన్ని పట్టిపీడిస్తున్న విషయాల్లో రైతులకు కనీస మద్దతు ధర లభించకపోవడం ఒకటి. దీని వల్ల ఎంతో మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇది గ్రహించిన మోడీ రైతుల ఆదాయం రెండింతలు చేయాలనే ఉద్దేశంతో ఈ ఆరేండ్లలో వివిధ రకాల పంటలకు ముఖ్యంగా వరి, గోధుమ, ఆయిల్ సీడ్స్, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వంటి పంటలకు 50 నుంచి 60 శాతం కనీస మద్దతు ధరను పెంచారు.
కనీస మద్దతు ధర పెంచినా రైతుల ఆర్థిక స్థితిగతుల్లో ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని గ్రహించిన ప్రధాని మోడీ.. రైతు సంఘాల నాయకులు, విద్యావంతులతో చర్చించి రైతులకు మేలు చేకూర్చేలా కొత్త చట్టాలను తీసుకొచ్చారు. ఈ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు సమర్థించిన పార్టీలు కూడా ఇప్పుడు ఢిల్లీ శివార్లలో కాంగ్రెస్, అకాలీదళ్, ఆమ్ ఆద్మీ తదితర పార్టీల ప్రోద్బలం, అసత్య ప్రచారాలతో పంజాబ్, హర్యానా రైతులు చేస్తున్న ఆందోళనకు సపోర్ట్ చేయడం హాస్యాస్పదం. ప్రధాని మోడీ తన సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలతో దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రతి సమస్యను శాంతి మార్గంలో పరిష్కరిస్తూ ప్రతిపక్షాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ, ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఆదర్శ నాయకుడిగా నిలిచారు. మోడీని నిలువరించకపోతే తమకు రాజకీయ భవిష్యత్ ఉండదని కేంద్రం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లు, చట్టాలను పార్లమెంట్ లోపల, బయట వ్యతిరేకించడం కొన్ని పార్టీలు చేస్తున్న కుట్రగా కనిపిస్తోంది. మోడీ సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు, కాశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పుడు ఇలాంటి చర్యలకే పాల్పడ్డారు. అయినా మోడీ చరిష్మా ప్రజల్లో ఇంకా పెరిగింది కానీ తగ్గలేదు. బీజేపీతో 20 ఏండ్లుగా సన్నిహితంగా ఉన్న అకాలీదళ్.. ఎన్టీఏ నుంచి రైతు బిల్లులను సాకుగా చూపి వైదొలిగింది. ఇది నిజంగా రైతుల మీద ప్రేమతో చేసిందా? లేదా వారి రాజకీయ స్వార్థం కోసం చేసిందా? అనేది మనం గమనించాలి.
పాత చట్టాలకు కొనసాగింపుగానే కొత్తవి
రైతులకు కనీస మద్దతు ధర లభించదని, రైతుల భూములను పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు, సంస్థలు లాగేసుకుంటాయని, అదానీ, అంబానీలకు మేలు చేయడానికే ఈ చట్టాలు తెచ్చారని, మార్కెట్ మండీలను తీసేస్తారంటూ రైతుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారు. కానీ ఈ చట్టాల్లో ఏముందో తెలుసుకుంటే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. భూమిలేని పేదలకు భూముల పంపిణీ, ఉమ్మడి కుటుంబాలు విచ్చిన్నం కావడంతో దేశంలో చిన్న కమతాల సంఖ్య పెరిగింది. 1966లో హరిత విప్లవం తర్వాత చిన్న, సన్నకారు రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ కల్పించడానికి తెచ్చిన ఏపీఎంసీ చట్టం రైతులు తమ ఉత్పత్తులని అమ్ముకోవడానికి మండీ పద్ధతి తీసుకొచ్చారు. ఈ పద్ధతిలో మధ్యవర్తులు బహిరంగ మార్కెట్లో వేలం ద్వారా కాంట్రాక్టు పొంది రైతుల నుంచి తక్కువ ధరకు పంటలను కొని ఎక్కువ ధరకు వ్యాపారులకు విక్రయిస్తూ.. రైతులను, వినియోగదారులను దోచుకుంటున్నారు. దేశంలో ప్రతి ఉత్పత్తిదారుడు తమ ఉత్పత్తికి తామే ధరను నిర్ణయించుకుంటున్నాడు. అలాగే రైతులు కూడా తమ పంటలను ఎందుకు అమ్ముకోకూడదు. ఇదే ఉద్దేశంతో ప్రధాని మోడీ.. రైతుల ఆదాయాన్ని పెంచడానికి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని పాత చట్టాలకు కొనసాగింపుగా కొత్తవి తెచ్చారు. పాతవి రద్దు చేస్తున్నామని ఎక్కడా, ఎప్పుడూ చెప్పలేదు.
ఎక్కడైనా పంటను అమ్ముకునే అవకాశం
దేశ జనాభాలో 58 శాతం మందికి ఉపాధి కల్పిస్తున్నది వ్యవసాయ రంగమే. కొత్త చట్టాల ద్వారా దేశ వ్యవసాయ రంగాన్ని మోడీ ప్రభుత్వం సరళీకరించింది. మధ్యవర్తులను తొలగించడమే గాక మంచి ధరకు రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించింది. రైతుల సామాజిక అభివృద్ధికి పెట్టుబడులను ఆకర్షించనుంది. ఎలక్ట్రానిక్ ట్రేడింగ్, ఈకామర్స్ ట్రేడింగ్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఇతర రాష్ట్రాల్లో రైతులు పంట అమ్ముకుంటే విధించే సెస్ లు, టోల్ టాక్స్ లు రద్దు చేసింది. రైతులు తాము పండించబోయే పంటకు ముందుగానే ధర నిర్ణయించుకుని కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం కల్పించింది. కంపెనీలు ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే చట్టబద్ధంగా వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం ఇచ్చింది. కంపెనీలు పంట తీసుకున్న మూడు రోజుల్లోపే రైతులకు మొత్తం పంట విలువను చెల్లించాలి. పంటలను కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనకూడదు. ఉల్లి, నూనె గింజలు, వంటనూనెలు, పప్పు ధాన్యాలు మొదలైన వాటిని నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించింది. వీటి నిల్వలపై నియంత్రణ తీసేసింది. అత్యవసర సమయాల్లో పండ్లు, కూరగాయల ధరలు 100% పెరిగితే, ఆహార ఉత్పత్తుల ధరలు 5 శాతం పెరిగితే ప్రభుత్వం నియంత్రణ విధిస్తుంది. ఈ చట్టాలను కేంద్రం డిమాండ్, సప్లై ఆధారంగా తీసుకొచ్చింది. ఈ చట్టాల ద్వారా రైతులకు పూర్తి స్వేచ్ఛ వస్తుంది.
ఈరోజు జరుగుతున్న రైతు ఉద్యమాలు కొన్ని పార్టీల స్వార్థంతో రెండు, మూడు రాష్ట్రాల రైతులను రెచ్చగొట్టి చేస్తున్నవే. ఇతర రాష్ట్రాల్లో ఈ చట్టాలపై ఎలాంటి ఆందోళనలు లేదు. అంటే పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ల్లో కొన్ని వర్గాల రైతులు చేస్తున్న ఉద్యమాలు చేయడం వెనక అక్కడి రాజకీయ పార్టీల కుట్రలు, నాయకుల స్వార్థం ఉన్నాయని చెప్పవచ్చు. ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు రైతులకు మేలు చేసేలా ఉన్నాయే కానీ నష్టం కలిగించేవిగా ఏ మాత్రం లేవని స్పష్టంగా చెప్పవచ్చు.
ఈ సాకుతో రాజీనామా
పంజాబ్ కు చెందిన పార్టీ అకాలీదళ్. ఆ పార్టీ ముఖ్య నాయకుడు ప్రకాశ్ సింగ్ బాదల్. 2007 నుంచి 2017 వరకూ పంజాబ్ సీఎం. ఆయన కొడుకు సుఖ్బీర్ సింగ్ బాదల్ 2012 నుంచి 2017 వరకు డిప్యూటీ సీఎం. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లిక్కర్, స్టోన్ క్రషింగ్, ట్రాన్స్పోర్ట్, ఏవియేషన్, యానిమల్ బ్రీడర్స్, కేబుల్ డిస్ట్రిబ్యూషన్ మొదలైన వ్యాపారాల్లో సుఖ్బీర్ బంధువుల ఆధిపత్యం కొనసాగుతోంది. 2017 జనరల్ ఎలక్షన్లలో అకాలీదళ్ ఓడిపోవడమే కాక మూడో స్థానానికి పడిపోయింది. బీజేపీకి దేశంలో పెరుగుతున్న ఫాలోయింగ్ గ్రహించి వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో సగానికిపైగా సీట్లు ఇవ్వాల్సి వస్తుందని, సీఎం సీటును కూడా కోల్పోవాల్సి వస్తుందనే భయంతో తన భార్య, కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్ తో అగ్రి బిల్లుల సాకుతో రాజీనామా చేయించారు. కొత్త అగ్రి చట్టాలు రైతులకు వ్యతిరేకమని ఉద్యమాలకు తెరలేపారు. ఇదే అదునుగా పంజాబ్లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ఆమ్ ఆద్మీ తమ ఉనికిని కాపాడుకోవడానికి రైతుల్లో భయాందోళనలు పుట్టించాయి.– డాక్టర్ కర్నాటి కిరణ్ కుమార్, పొలిటికల్ ఎనలిస్ట్
వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయా..?
- వెలుగు ఓపెన్ పేజ్
- January 1, 2021
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?