నిరసనలు తెలిపితే నిర్భంధమా?

‘అదేందిరో, 400 సీట్లు వస్తే మాత్రం, గాలి కూడా వాడు అనుమతిస్తేనే మనం పీల్చుకోవాలట్రా?’ అంటారు ప్రజాకవి కాళోజీ నారాయణరావు, నలభై ఏండ్ల కింద రాజీవ్‌‌‌‌గాంధీ ఘనవిజయం ప్రస్తావనకొచ్చిన ఒక సందర్భంలో మాట్లాడుతూ! అంతటి ప్రజాస్వామ్య చేతన కలిగింది తెలుగు సమాజం. అలాంటి ప్రజాస్వామిక, స్వేచ్ఛా వాతావరణం ఉంది కాబట్టే, పుష్కరకాలం సాగిన మలిదశ ఉద్యమం శాంతియుతంగా సాధ్యపడింది. సర్కార్ల నిర్బంధ యత్నాల్ని ఉద్యమం సమర్థంగా అడ్డుకోవడం ద్వారానే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. నేతల ప్రతిజ్ఞలకు తగ్గట్టుగానే, చుక్క నెత్తురు చిందనీయకుండా రాష్ట్ర సాధన సాకారమైంది. ఇంకెవరికన్నా కూడా... ఈ విషయం, నాటి ఉద్యమానికి కేంద్రకంగా ఉన్న టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌, నేటి బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ పార్టీ నేతలకు, శ్రేణులకు, సానుభూతిపరులకు తెలియాలి. కానీ, దురదృష్టవశాత్తు పరిస్థితి తలకిందులవుతోంది. పౌర స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడితే ఇవాళ ఒక పరిహాసం కింద చూస్తున్నారు. నవ్వులాటగా ఉన్నది. పాలకుల అసహనం తారాస్థాయికి చేరుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి! వికారాల్ని ప్రశ్నిస్తే, అధికార వ్యవస్థ తప్పుల్ని ఎండగడితే, తమకెదురయ్యే అసౌకర్యాల్ని పౌరులు ఎత్తిచూపితే.. సహించలేకపోతున్నారు. అన్ని స్థాయిల్లో తీవ్ర నిర్బంధం అమలవుతోంది. అణచివేత నిత్యకృత్యమైంది. పోలీసు దాష్టీకాలకు అడ్డులేకుండా పోయింది. అధికారపక్షం పాలకపక్షీయులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న ఘటనలెన్నో! విమర్శించే, వ్యతిరేకించేవారిపై చివరకు భౌతిక దాడులకూ దిగుతున్నారు. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు.. ఇలా ఎవరినీ లెక్కచేయట్లేదు. నిరసన తెలుపడానికి ఉన్న అన్ని దారులూ ఒకటొకటిగా మూసేస్తున్నారు. అధికారం అన్నీ ఇవ్వదని గ్రహించడం లేదు. జనం మెచ్చని నిర్బంధంతో, ఉద్యమభూమికను ఒకరకంగా తామే బలోపేతం చేస్తున్నామన్న సూక్ష్మాన్ని పాలకులు మరచిపోతున్నారు. తెలంగాణలో విపక్షాలకు చెందిన నాయకుల పాదయాత్రలకు అడ్డంకులు సృష్టిస్తున్న ఘటనలైనా, ఏపీలో మొన్న అనపర్తిలో నిన్న గన్నవరంలో చోటుచేసుకున్న పరిణామాలైనా ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పోలీసు, ఇతర అధికార వ్యవస్థలు కూడా చట్టానికి లోబడటం కాకుండా, అధికార పక్షం చెప్పు చేతల్లో, ‘కీ’ ఇస్తే పనిచేసే కీలుబొమ్మల్లా వ్యవహరించడాన్ని జనం జీర్ణించుకోలేకపోతున్నారు.

నిత్య నిర్బంధమో నరకం!

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ ఆరంభ దినాల నుంచీ పోలీసు, అధికార వ్యవస్థల్ని పాలకులు నియంత్రణలో ఉంచుకోవడం మొదలైంది. రానురాను అది మరింత బలోపేతం కావడం, పాలకుల నేటి నిర్బంధకాండకు ఉపకరిస్తోంది. అధికారం పంచన అల్లరి మూకల భౌతికదాడులకు దారులు పరుస్తోంది. కోరుకున్నట్టు బదిలీలు, ఫోకల్‌‌‌‌ స్థానాల్లోకి పోస్టింగులు, తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం, స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడం వంటి అవసరాలతో మెజారిటీ అధికారులూ పాలకుల అడుగులకు మడుగులొత్తడం రివాజయింది. పాలకులు లొంగదీసుకోవడమో, పరస్పరం ఆధారపడే స్వార్థం వల్లో మొత్తం వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోంది. ముఖ్యమంత్రో, ఇతర మంత్రులో ఓ జిల్లా పర్యటనకు వెళ్తున్నారంటే చాలు, మొత్తం పోలీసు యంత్రాంగం అప్రమత్తమైపోతుంది. అంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఫలానా వాళ్లు నిరసనో, ఆందోళనో చేస్తారని పోలీసులు అనుమానిస్తే చాలు, ఇక వారి జీవితం నరకమే! ముందు రోజు సాయంత్రం నుంచే నిర్బంధంలోకి తీసుకుంటారు. పాలకుల పర్యటన ముగిశాకే వదిలేస్తారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ‘నిరసన తెలుపుకోనీవరా?’ అని గొంతెత్తి అరిస్తేనే కదా, నిర్బంధాన్ని వేనోళ్ల నిరసిస్తేనే కదా ఉద్యమం పలురెట్లు పెరిగి అట్టడుగు స్థాయి వరకు విస్తరించింది. అమరవీరుల స్థూపం వద్దకు రానీయరా? నిరాహార దీక్ష చేస్తానంటే కేసీఆర్‌‌‌‌కే ఈ గతి పట్టిస్తారా? అని రాష్ట్రం యావత్తు ఒంటికాలుపై లేస్తేనే కదా, తెలంగాణకు అనుకూలంగా డిసెంబర్‌‌‌‌ 9 ప్రకటన వచ్చింది. ఎంతో కొంత నాటి పాలకుల ప్రజాస్వామిక దృక్పథం వల్లే కదా! ఉద్యమ కాలంలో రాస్తారోకోలు, ధర్నాలు, రోడ్ల మీద వంటా–వార్పులు, దూమ్‌‌‌‌దామ్‌‌‌‌లు, మిలియన్‌‌‌‌ మార్చ్‌‌‌‌లు సాధ్యపడింది! అవన్నీ ముప్పిరిగొంటేనే కదా తెలంగాణ సాకారమైంది? కానీ, తర్వాత ఏమైంది? ప్రత్యామ్నాయ రాజకీయవేదిక ఏర్పాటు చేసుకుంటామంటే, సూర్యోదయానికి ముందే నాయకులందర్నీ సర్కారు అరెస్టు చేసి అడ్డుకున్న చరిత్ర నమోదైంది. తెలంగాణ ఉద్యమంలో జేఏసీకి నేతృత్వం వహించిన ప్రొఫెసర్​ కోదండరామ్ ఇంటి తలుపులు బద్దలు కొట్టి అర్ధరాత్రి అరెస్ట్​చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ధర్నా చౌక్‌‌‌‌ను ఎత్తేస్తే న్యాయపోరాటం ద్వారా మళ్లీ సాధించుకున్న దురవస్థ తప్పలేదిక్కడ! నిరసనకారులు రావడం సంగతలా ఉంచి, కనీసం వినతి చేసుకునే ఓ ప్రతినిధి బృందానికీ ప్రవేశం లభించనంత దుర్బేధ్యపు రక్షణ వలయంలోకి అసెంబ్లీ, సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం జారిపోయాయి నెమ్మదిగా.

సమయమొచ్చినపుడు స్పందిస్తారు

ప్రపంచీకరణ, ఆర్థిక సరళీకరణల తర్వాత.. ప్రజలు ప్రతిదానికీ వీధుల్లోకి వచ్చి, చొక్కాలు చించుకొని నానా యాగీ చేయటం లేదు. అన్నీ గమనిస్తుంటారు, సమయం వచ్చినపుడు మాత్రమే స్పందిస్తారు. అంగన్‌‌‌‌వాడీలను గుర్రపు గిట్టలతో తొక్కించిన వారికి, విద్యుత్‌‌‌‌ చార్జీల భారం ఇంతా? అన్నందుకు, బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌లో కాల్పులు జరిపి ప్రాణాలు తీసిన వారికీ... పాఠమే చెప్పారు. వెంటనే ఏమనలేదు, సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టారు. అధికారంలో ఉన్నవాళ్లు గంతలు కట్టుకున్నా జనం గమనిస్తుంటారు. అలాంటి ప్రజల్ని గమనిస్తూ, వారి అవసరాలు తీరుస్తూ, రాజ్యాంగానికి లోబడి పాలనను అందించడమే ప్రజాస్వామ్యం.

దాడులెంత దారుణం?

అధికారం అండచూసుకొని పాలకపక్షీయులు విపక్ష నాయకులపైన, కార్యకర్తలపైన భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారు. బీజేపీ రాష్ట్ర నేత బండి సంజయ్‌‌‌‌, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌‌‌ రెడ్డి, ప్రజాశాంతి పార్టీ నాయకుడు కె.ఎ.పాల్‌‌‌‌.. ఇలా పలువురిపై పాలకపక్షానికి చెందిన వారు దాడులకు తలపడటాన్ని ఎలా చూడాలి? కింది స్థాయిలో ఇంకా చాలా దాష్టీకాలు జరుగుతున్నాయి. పోలీసుల ప్రేక్షక పాత్రను ఎలా అర్థం చేసుకోవాలి? ‘మీరు విమర్శలు చేస్తే మా వారు ఊరుకుంటారా?’ అని కార్యకర్తల దుందుడుకు, చట్టవ్యతిరేక చర్యల్ని పాలకులు సమర్థించుకుంటున్నారు. విమర్శిస్తే కొడతారా? ఆరోపణలు చేస్తే.. ఇళ్లపై దాడికి వెళతారా? ఇదేం ప్రజాస్వామ్యం? అన్న ప్రశ్న సహజం. దెబ్బతిన్న బాధితులకు రక్షణ కల్పించి, వారి పక్షాన నిలవాల్సిన పోలీసులు వారిపైనే కేసులు నమోదు చేసి, దాడి చేసిన వారికి రక్షణ కల్పిస్తే.. ఇక ఆ పరిస్థితిని ఏమనాలి? రాజకీయ పక్షాల వాళ్లు కూడా ఆలోచించాల్సిన సమయమిది. ఒకే విషయమై విపక్షంలో ఉన్నపుడు ఒక గొంతు, అధికార పీఠమెక్కి మరో గొంతుతో మాట్లాడటం ఎంతవరకు సమంజసం? తెలంగాణ ఉద్యమకాలంలో ఆర్టీసీ ఉద్యోగుల సమ్మెకి, ప్రజాస్వామ్య తెలంగాణలో జరిగిన ఆర్టీసీ సమ్మెకు మధ్య ఎంత తేడా? ఎప్పుడు తమ సమస్యల్ని వారు ఎక్కువగా పరిష్కరించుకోగలిగారు, ఎప్పుడు ఎక్కువ మంది ఆర్టీసీ ఉద్యోగులు మరణించారు? కడకు ఆర్టీసీకి ఏ గతి పట్టింది? సమీక్షించుకుంటే వాస్తవాలు తేటతెల్లమౌతాయి. ట్రేడ్‌‌‌‌ యూనియన్లే ఉండకూడదనడం ఏ ప్రజాస్వామ్యానికి ప్రతీక! ఎస్‌‌‌‌ఐ, కానిస్టేబుల్‌‌‌‌ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లపైన, ప్రక్రియపైన అభ్యంతరాలతో న్యాయపోరాటం చేసేవారిని లక్ష్యం చేసుకొని పాలకులు ఎటువంటి చర్యలకు పాల్పడుతున్నారో సమాజం చూస్తూనే ఉంది. పోరాడి హైకోర్టులో అనుకూల తీర్పులు పొందిన వారిని, సుప్రీంకోర్టుకు వెళ్లనీయకుండా కూడా నిర్బంధాన్నే అమలు చేస్తే ఇక ప్రజాస్వామ్యం చిరునామా ఎక్కడ దొరుకుతుంది? అన్నది ఓ పెద్ద ప్రశ్న!
- ఆర్‌‌‌‌. దిలీప్‌‌‌‌ రెడ్డి,
 పొలిటికల్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌,
పీపుల్స్‌‌‌‌ పల్స్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సంస్థ