ఇంటీరియర్
ఇంటి డెకరేషన్‌లో నియాన్ కలర్స్ వాడడం రీసెంట్ ఇంటీరియర్ ట్రెండ్. వీటి కాంబినేషన్స్.. మామూలు రంగులతో పోలిస్తే కాస్త వేరుగా ఉంటాయి. ఇందులో బ్రైట్ పింక్, ఎలక్ట్రిక్ ఆరెంజ్, ఎలక్ట్రిక్ బ్లూ, యూఎఫ్ఓ గ్రీన్ లాంటి కొత్తరకం రంగులుంటాయి. ఈ నియాన్ రంగులతో ఇంటిని ఎలా డిజైన్ చేయొచ్చంటే..
ఇంటికి నియాన్ వెలుగులు
ఇంటీరియర్ డిజైన్‌లో రంగులు కీ రోల్ పోషిస్తాయి. అయితే ఎప్పుడూ ఒకేరకమైన రంగులు చూసి బోర్ కొడితే కొత్తగా నియాన్ కలర్స్ ట్రై చేయొచ్చు. నియాన్ రంగులు.. ఇంటిని తళుక్కుమనిపించడమే కాకుండా ఇంటికొచ్చిన అతిథుల చూపు తిప్పుకోకుండా చేస్తాయి.
నియాన్ లైట్స్
ఇంటికి నియాన్ లుక్ ఇవ్వడానికి నియాన్ లైట్స్ బాగా పనికొస్తాయి. పింక్, బ్లూ, గ్రీన్ కలర్స్‌లో దొరికే నియాన్ లైట్స్ ఎక్కువ బ్రైట్‌నెస్‌తో ఇంటి మూడ్ మార్చేస్తాయి.
నియాన్ లైట్స్‌తో ఇల్లంతా ఒకేరంగుతో వెలిగిపోతుంది. కావాలనుకుంటే వీటిలో రకరకాల కాంబినేషన్స్ కూడా ట్రై చేయొచ్చు.
నియాన్ డెకార్
ఇంటి డెకరేషన్ కోసం వాడే వస్తువుల్లో కూడా నియాన్ రంగుల్ని మిక్స్ చేయొచ్చు. టేబుళ్లు, కుర్చీలు, సోఫాలు వాటిపై ఉండే దిండ్లను కాంట్రాస్ట్ రంగుల్లో అమర్చాలి. వీటికోసం ఎలక్ట్రిక్ గ్రీన్, పింక్, ఎలక్ట్రిక్ బ్లూ లాంటి కాంబినేషన్స్ వాడాలి. ఈ రంగులతో ఇంటి లుక్ పూర్తిగా మారిపోతుంది.
నియాన్ సైన్ బోర్డ్స్
గోడలపై టెక్స్ట్ డిజైన్స్ ఇష్టపడేవాళ్లు నియాన్ సైన్ బోర్డ్స్ తప్పకుండా ట్రై చేయాలి. నియాన్ లైట్లతో తయారయ్యే ఈ సైన్ బోర్డ్‌లు తళుక్కుమంటూ మెరవడమే కాకుండా గోడలకు కలర్ ఫుల్ లుక్‌ను తీసుకొస్తాయి.
నియాన్ వాల్స్
గోడంతా ఒకే రంగు నచ్చకపోతే.. వాటికి నియాన్ కలర్స్ అద్దొచ్చు. గోడకు రెండు వైపులా నియాన్ లైట్లను అమర్చడం ద్వారా గోడపై కలర్ గ్రేడియెంట్స్ ఏర్పడతాయి. ఇలా కుదరకపోతే గోడలకు పూర్తిగా నియాన్ పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు.
పాప్ ఆర్ట్స్
నియాన్ కలర్స్‌తో వేసే పాప్ ఆర్ట్‌ను గోడలకు తగిలించడం ద్వారా ఇంటికి ఇన్‌స్టంట్ నియాన్ లుక్ వచ్చేస్తుంది. నియాన్ వాల్ ఆర్ట్స్ రకరకాల సైజుల్లో దొరుకుతాయి. గదిని బట్టి సైజును ఎంచుకోవాలి.