చిన్నప్పుడు మా తాత మస్తు కథలు చెప్తుండె. అవి వినడానికే నేను మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళుతుండె. నాకు చరిత్ర అంటే చాలా ఇష్టం. ఈసారి తాత దగ్గరికి పోయినప్పుడు నిజాం కాలంల ఎట్ల అని అడుగుత.
'అమ్మానాయినలతో విడిపోవాలె. వాళ్లకు దూరంగా ఒంటరిగా బతకాలె' అని ఏ బిడ్డకీ ఉండదు. 'భార్యాభర్తలం... ఇద్దరు పిల్లలం మంచిగుంటే చాలు ఎవరేమైపోతే మాకేంది" అని కూడా ఎవరూ స్వార్థంగా ఆలోచించారు. పేగు పంచుకున్నప్పుడు పుట్టిన ఆప్రేమ చచ్చేవరకు బతికే ఉంటది. కానీ ఎందుకు తల్లిదండ్రులని దూరంగా పెట్టి పట్నంల ఉంటరు? ఎందుకు దేశాలు దాటి పోతడు? అట్ల దూరంగా పోయి బతుకుతున్నందుకు వాళ్లకు మాత్రం బాధ ఉండదా? అంటే ఉంటది. కానీ...'ఈ ఇరుకు ఇండ్లళ్ల ఆళ్లు ఎట్ల ఉంటారు? అల్లొచ్చి గీ బాధలెందుకు పడుడు.
అందుకే ఊళ్లనే ఉండనీ... ఆళ్లకు చేతగాని నాడు తీసుకొద్దం' అని అనుకునేవాళ్లే చాలామంది ఉన్నరు. ఆధునిక ప్రపంచం మనిషి జీవనశైలిని గందరగోళంగా డిజైన్ చేసింది. మనిషిని.. మనిషికి దూరం చేసింది. ఇంట్లో ఇద్దరూ కష్టపడితే తప్ప.. కడుపు నిందని, కలలు పండని పరిస్థితి తీసుకొచ్చింది. దీంతో ఒకటి పొందాలంటే ఇంకోటి కోల్పోక తప్పడం లేదు.
బుజ్జిబుర్రకు ఎన్ని డౌట్లో
పొద్దున లేసుడు.. లేసుడే ఆఫీసులకు పరుగెత్తుదాయే. ఆ పరుగు హెల్దీ ఎక్సర్ సైజ్ కూడా కాదాయే! అమ్మ వంట చేస్తుంటే పిలగాడో... పిల్లో 'గదేంది?.. గదే ఎందుకు వెయ్యాలె కూరలో" అని అడుగుతరు సహజంగనే. ఆ బుజ్జి బుజ్జి దౌట్లని తీర్చాలనే ఉంటదామెకు. కానీ గడియారాన్ని చూసి భయపడ్డది. లేటయితుందని నీకేం పనిలేదా.. బుక్ పట్టుకోపో" అని అరుస్తుంది. ఇగ ఆ పిలగాడు ఎటు పోవాలె. నాన్న దగ్గరికి పోయినా గిట్టాంటి మాటే అంటరు. కంప్యూటర్ పని చేసే ఆయన కూడా ఆ గడియారానికి అదురుతడు!
మరి అదే ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ ఉంటే.. వాళ్లు ఆఫీసు పోయిన పిలగాళ్లు బాధపడరు. ఆ లిటిల్ బ్రెయిన్టి ఏ డౌటొచ్చినా నానమ్మనో, అమ్మమ్మనో, తాతనో క్లియర్ చేస్తరు. నానమ్మ కూరలో వేసే ప్రతి దినుసు పేరు చెప్తుంది. అదే ఊళ్లో అయితే రోట్లో పచ్చడి నూరుతుంటే వాళ్ల చేతికి రోకలి ఇస్తది. నాలుగు చేతులు పచ్చడి నూరతయ్! అప్పుడు ఆ పిలగాడు లేదా పిల్ల కళ్లలో ఉండే సంతోషం.. ఆఅవ్వ నవ్వులో ఉండే సంతోషాన్ని తరాజుతో జోకితే సమానంగా ఉంటాయ్! నాన్న బాగా బిజీగా ఉంటడు. కాబట్టి... పిలగాన్ని పార్క్ కి తీసుకుపోయినా.. ఎక్కువసేపు ఉంచడు. ఆ పిలగానికేమో అక్కడి నుంచి రాబుద్ధి కాదాయే. అసంతృప్తిగానే వాళ్ల నాన్నతో ఇంటికి అడుగులు వేస్తడు.
అదే తాతతో పార్క్ కి పోతే... చెయ్యిపట్టుకుని చూపుడు వేలితో పక్షిపేరు, కొమ్మపేరు వివరంగా చెప్తాడు. అదే తాత ఊళ్లోఉంటే పొలం గట్ల పొంటి తిప్పుతూ... పొద్దుపోయేదాక ముచ్చట్ల చెప్తడు. పిల్లలు అడిగే సందేహాలకు తల్లిదండ్రులు చిరాకు పడ్డరు కానీ పెద్దోళ్లు మాత్రం నవ్వుతూ.. ' మా నాయనే..మా అమ్మే'అని ప్రేమని కురిపిస్తూ సందేహాలు తీరుస్తారు. ఇట్ల అవ్వతాతలతో గడపిన పిల్లలే ఈ మట్టి వారసత్వం.. సంస్కృతి, భాషని పట్టుకుంటరు. ముందు తరాలకు ఆ ఫలాలను అందిస్తారు!
ఎందుకు వాళ్లతో ఉండాలె?
తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మల దగ్గర పెరిగినోళ్లు అదృష్టవంతులు. ఈ విషయం వాళ్ల దగ్గర పెరిగినోళ్లకే అర్థమైతది. వాళ్లు ఎంతో ప్రేమగా ఉంటరు. సాయానికి వెనకాడరు, వాళ్లతో గడపడమంటే పిల్లలకు పెద్ద గిఫ్ట్ అన్నమాట.
* పెద్దవాళ్లు ఎన్ని ఒడిదుడుకులు, సాదకబాధకాలు దాటుకుని ఒక స్థాయికి చేరుకున్నారో తెలుస్తుంది. అది తెలియడం వల్ల భవిష్యత్తులో ఏ కష్టాలు వచ్చినా పెద్దవాళ్లు ఆ సందర్భంలో ఎలా ఎదుర్కొన్నారో పోల్చుకుని ఈజీగా బయటపడ్తారు.
* పెద్దయ్యాక సమస్యలు ఎదురైతే వెంటనే కుంగిపోకుండా దాన్నుంచి ఎలా బయటపడాలో చిన్నప్పుడే వాళ్ల మెదళ్లలో బలంగా ముద్రపడుతుంది. ఇది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు అధ్యయనం చేసి మరీ చెప్పిన మాట. పిల్లలకు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. దీనికి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలను
మించిన గురువులు లేరు.
* పిల్లలు వాళ్లకి ఏదైనా సమస్య వస్తే ముందు అమ్మానాన్నలకు కాకుండా అమ్మమ్మ, నాన్నమ్మలకే చెప్పాలని చూస్తరు. ఎందుకంటే వాళ్లయితేనే సానుభూతితో వింటరని నమ్మకం. నికై జీవితపు చివరి దశలో ప్రతి ఒక్కరూ ముసలివాళ్లు కాక తప్పదు. పిల్లలు కూడా ముసలివాళ్లు అయిపోతదు అంటే భయ పడ్డారు. అదే చిన్నప్పటి నుంచి వాళ్లతో పెరగడం వల్ల అలాంటి భయాలు లేకుండా పెరుగుతరు.
* టీచర్లు, తల్లిదండ్రుల వద్ద చెప్పుకోలేని ఎన్నో విషయాలు, రహస్యాలు కూడా పిల్లలు గ్రాండ్ పేరెంట్స్ చెవిలో ఊదుతరు. దీని వల్ల వాళ్లలో ఒంటరితనం తాలుకు భయాలు పోతయ్. పెద్దవాళ్లతో గడపడం వల్ల పిల్లల ఆయుష్షు ఐదేళ్లు పెరుగుతుందని బోస్టన్ యూనివర్సిటీ చేపట్టిన స్టడీలో తేలింది.
* వాళ్లతో ఏర్పరుచుకున్న అనుబంధం, స్నేహం వల్ల మానసికంగా దగ్గరవుతారు. పెద్దవాళ్ల అనుభవాలు పిల్లలకు జీవితంలో అడుగడుగునా ఉపయోగపడ్తాయ్. ఆ అనుభవాలు ఉన్న వాళ్లకి డిప్రెషన్ లాంటివి దరిచేరవు.
* ఈ రోజుల్లో ఉద్యోగాలు చేస్తున్న తల్లిదండ్రులే ఎక్కువ. దానివల్ల వాళ్లతో కనెక్ట్ కావడం పిల్లలకు కష్టమైతది. ఆ వెలితిని పూర్చగలిగేది పెద్దవాళ్లే.
* పిల్లలు చిన్నబుచ్చుకున్నప్పుడు గమనించి వారికి సాయం చేసేది కూడా గ్రాండ్ పేరెంట్సే. ఇంక విడాకులు తీసుకున్న భార్యాభర్తల పిల్లల బాధ్యతని తీసుకుని... వాళ్ల భవిష్యత్తు అస్తవ్యస్తం కాకుండా కాపాడేది కూడా వీల్లే.
* ఒక తల్లి లేదా తండ్రి పిల్లలకు స్నేహితునిగా మారడమనేది చాలా కష్టం. ఈ విషయంలో గ్రాండ్ పేరెంట్స్ మాత్రం పిల్లలకు గొప్ప స్నేహితులుగా మారుతరు. పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులకున్న అంచనాల గ్రాండ్ పేరెంట్స్ లో ఉండవు కాబట్టి... వాళ్లు పిల్లలకు ఏ సమస్య వచ్చినా ఒత్తిడి లేకుండా పరిష్కారం చెప్తారు.
* వీటిన్నింటికన్న ముఖ్యమైనవి విలువలు. అవే జీవితాన్ని గెలుపు వైపు నడిపించే పిల్లర్లు. పిల్లల్లో విలువలు పెంపొందించడంలో గ్రాండ్ పేరెంట్స్ కీలక పాత్ర. వాళ్లు పాఠాలు, నీతి కథలు చెప్తారు. జీవితం ఎట్లు ఉంటదో అనుభవ పూర్వకంగా వివరిస్తరు.
మరి ఎట్ల?
గ్రాండ్ పేరెంట్స్ ని పట్నం తీసుకొస్తే వాళ్లకు కూడా అక్కడ ఇమడడం కష్టమే. కానీ, ఒక్కటి మాత్రం నిజం పిల్లల మనసు అవ్వతాతల మీదికి.. అవ్వ, తాతల మనసు మనవలు.. మనవరాండ్లపైకి ఎప్పుడూ గుంజుతనే ఉంటది. పిల్లలు అవ్వ, తాతలతో ఉంటే ఎన్నో లాభాలున్నయ్ అని అధ్యయనాలు చెబుతున్నయి.
అందుకు మన ముందున్నది ఒక్కటే సొల్యూషన్. వీలైనోళ్లు అవ్వ, తాతలతో కలిసి ఉండాలె. వీలుగానోళ్లు కనీసం పిల్లల్ని ఎండకాలం సెలవులతో పాటు ప్రతి పండుగ సెలవులకు వాళ్ల దగ్గరికి పంపాలె.
దీంతో అటు పెద్దోళ్లు మళ్ల చిన్న పిల్లలయితరు. ఇటు చిన్న పిల్లలు పెద్ద పెద్ద విషయాలు తెలుసుకుంటరు! గూగుల్, ఫేస్ బుక్, టెక్స్ట్ బుక్లో దొరకని మంచి విషయాలు నేర్చుకుంటరు. భాష, సంస్కృతిని ముందు తరాలకు అందించే భావి పౌరులుగా మారుతారు. బహుశా అందుకే కాబోలు 'ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు" అనే ఉద్దేశంతో అమెరికాలోని కాలిఫోర్నియాలో లక్షలాది మంది పిల్లలు వాళ్ల గ్రాండ్ పేరెంట్స్ దగ్గరే ఉంటున్నరు.