‘సంక్రాంతికి ఊరెళ్తున్నారా?.. అయితే.. మీ ఇల్లు జాగ్రత్త!’.. ఇలాంటి హెచ్చరికలు చూస్తూనే ఉంటాం. కానీ.. సెలవుల్లో ఊరెళ్లినప్పుడు ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. టూర్‌కి వెళ్తున్నామనే హడావిడిలో ఏది పడితే అది తినడమూ.. కొత్త ప్లేస్‌లకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి టూర్లకు వెళ్లేవాళ్లు.. కాస్త జాగ్రత్త!
సిటీల్లో ఉండేవాళ్లు సంక్రాంతి సెలవుల్లో సొంతూళ్లకు వెళ్తుంటారు. కొందరేమో.. ఫ్యామిలీతో కలిసి టూర్లకు వెళ్తుంటారు. అలాంటి టైంలో రకరకాల అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ముఖ్యంగా జర్నీలో ఉన్నప్పుడు సరిగ్గా నీళ్లు తాగకపోవడం, కలుషిత ఆహారం తినడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. టూర్లకు వెళ్లినప్పుడు వెదర్ మారడం వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అలాంటి వాటికి దూరంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి.
సరిపడా నిద్ర
ట్రావెలింగ్ చేసేటప్పుడు కొత్త ప్రదేశాలు కనిపిస్తుండడం, కొత్త ప్లేస్‌కి వెళ్తున్నామనే ఆనందంలో చాలామంది రాత్రంతా నిద్రపోకుండా ఉండిపోతారు. కానీ.. రాత్రి పూట కనీసం 7–8 గంటలు నిద్రపోవాలి. లేదంటే అది ఒత్తిడికి దారితీస్తుంది.
సాల్టీఫుడ్కి ‘నో’ చెప్పండి
సాధారణంగా జర్నీల్లో బయటి ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు. ముఖ్యంగా ఉప్పగా ఉండే శ్నాక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఆయిల్ ఎక్కువగా ఫుడ్ తింటుంటారు. కానీ.. అది ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తుంది. కొంతమంది అయితే.. ట్రావెలింగ్‌లో ఉన్నప్పుడు ఎక్కువ కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రొటీన్లు తీసుకుంటారు. కానీ.. సమతుల్య ఆహారం తీసుకుంటేనే ఆరోగ్యానికి మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అంతేకాకుండా బయట భోజనం చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు క్వాలిటీని చెక్ చేసుకుని తినాలి.
నీళ్లు తాగాలి
అసలే చలికాలం.. కాబట్టి ఎక్కువగా దాహం వేయదు. దాంతోపాటు కొందరు ట్రావెలింగ్‌లో నీళ్లు తాగితే ఎక్కువ సార్లు మూత్రం వస్తుందని తాగడం తగ్గించేస్తుంటారు. కానీ.. దాహం వేసినా, వేయకున్నా తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. లేదంటే శరీరం డీహైడ్రేట్ అయిపోతుంది. శరీరంలో నీటిశాతం తగ్గితే జీర్ణక్రియ మందగిస్తుంది. ఒంట్లో జీవక్రియల రేటు తగ్గిపోతుంది. దానివల్ల చర్మం పొడిబారడం, కళ్లు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి.
వ్యాయామం
కొందరు కొత్త ప్లేస్‌లకు వెళ్లినప్పుడు ఎక్సర్సైజ్ చేయడం పూర్తిగా మానేస్తారు. కానీ.. ఎంత చలి ఉన్నా తగిన జాగ్రత్తలు తీసుకుని, ఎక్కువ లేయర్లు ఉండే బట్టలు వేసుకుని ఎక్సర్సైజ్ చేయాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. కనీసం ఇండోర్‌లో ఫ్యామిలీ డ్యాన్స్, స్పోర్ట్స్ ఆడడం లాంటివైనా చేయాలి. అలా చేస్తే.. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా యాక్టివ్‌గా ఉంటారు.
గోరు వెచ్చని నీటితో..
గోరువెచ్చని నీటిని నోటిలో పోసుకుని పుక్కిలించడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం కాస్త తగ్గుతుంది. అంతేకాకుండా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు చల్లని నీటికి బదులు గోరు వెచ్చగా ఉండే నీళ్లను తాగాలి. దానివల్ల గొంతులో పేరుకుపోయిన మ్యూకస్ తొలగిపోతుంది. జలుబు, సైనస్ లాంటివి తగ్గుతాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్‌కి వెళ్లినప్పుడు వాతావరణంలో ఉష్ణోగ్రతలు, హ్యుమిడిటీ(గాల్లో తేమ)లో మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు చాలామందికి ముక్కు కారటం, జలుబు, తేలికపాటి జ్వరం, గొంతు నొప్పి, అలెర్జీ లాంటివి తప్పవు. కాబట్టి ప్లేస్ మారినప్పుడు ఆరోగ్యం పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
ఫ్లూ
ఫ్లూ అనేది నోరు, ముక్కు, గొంతు, ఊపిరితిత్తులపై ఎటాక్ చేసే వైరల్ ఇన్ఫెక్షన్. జలుబు లాగే దగ్గినా, తుమ్మినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. లేదంటే కలుషితమైన ఉపరితలాలను తాకినా వస్తుంది. దీనివల్ల అలసట, జ్వరం, బాడీ పెయిన్స్, గొంతు నొప్పి, తుమ్ములు, దగ్గు.. కొన్నిసార్లు అతిసారం కూడా వస్తుంది. ఇలాంటివి వచ్చినప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి.
బ్రాంకైటిస్
జలుబు లేదా ఫ్లూ ఎక్కువైతే.. కొన్నిసార్లు బ్రాంకైటిస్‌కు దారితీయొచ్చు. అంటే.. ఊపిరితిత్తులకు గాలిని తీసుకెళ్లే గొట్టాలకు వాపు వస్తుంది. వాటిలో శ్లేష్మం పేరుకుపోతుంది. పొగ తాగేవాళ్లు, అలెర్జీలు, సైనసైటిస్, టాన్సిలిటిస్ లాంటి సమస్యలు ఉన్నవాళ్లకు ఇది చాలా ప్రమాదం. శ్లేష్మంతో కూడిన దగ్గు, బాడీ పెయిన్స్, తల, గొంతు నొప్పి, చలి, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది.. ఇవీ దీని లక్షణాలు. ఇది సాధారణంగా దానంతట అదే తగ్గిపోతుంది. కానీ.. తగ్గకపోతే నిమోనియాకు దారి తీస్తుంది.
ఇతర వ్యాధులు
చలికాలంలో చల్లని, పొడి గాలి పీల్చుకోవడం వల్ల శ్వాసనాళాలు బిగుతుగా మారతాయి. ఉబ్బసంతో బాధపడుతున్న వాళ్లకు చలికాలంలో తీవ్రత పెరుగుతుంది. ఇలాంటివాళ్లు ఇన్‌హేలర్‌ను వెంట తీసుకెళ్లాలి. లక్షణాలు మరింత పెరిగితే.. వెంటనే డాక్టర్ని కలవాలి. ఇవే కాకుండా చలికాలంలో ప్లేస్ మారినప్పుడు ఆస్తమా, నిమోనియా, కీళ్ల నొప్పులు, చర్మం పొడిబారటం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదమూ ఉంది.
పరిశుభ్రత పాటించాలి
ప్లేస్ మారినప్పుడు ఇంట్లో ఒక్కరికి జలుబు చేసినా.. అది మిగతావాళ్లందరికీ వ్యాపిస్తుంది. కాబట్టి అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించాలి. చేతుల ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు వ్యాపించకుండా ఉండాలంటే.. తరచూ చేతులు కడుక్కోవాలి. పదే పదే నోరు, కళ్ళు, ముక్కును తాకకూడదు. చేతులు కడుక్కోలేని పరిస్థితుల్లో హ్యాండ్ శానిటైజర్ వాడాలి.
200 కంటే ఎక్కువ వైరస్లు
చలికాలంలో కామన్‌గా ఎదురయ్యే సమస్యే జలుబు. ఊరెళ్లగానే ముందుగా ఎటాక్ చేసేది ఇదే. వెళ్లిన మరుసటిరోజే చాలామందికి ముక్కు, గొంతు ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. జలుబుకు కారణమయ్యే 200 కంటే ఎక్కువ వైరస్లు ఉన్నాయి. వాటిలో ఎక్కువగా రైనోవైరస్ ఎటాక్ చేస్తుంటుంది. దీనివల్ల ముక్కు కారటం, గొంతు దురద, జ్వరం, అలసట, బాడీ పెయిన్స్, తుమ్ములు, దగ్గు లాంటి సమస్యలు వస్తాయి. కానీ.. పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణ యాంటీ అలెర్జీ మందులు, దగ్గు సిరప్‌లు వల్ల ఇది తగ్గిపోతుంది. రెండు మూడు రోజుల పాటు ఈ లక్షణాలు తగ్గకపోతే కచ్చితంగా దగ్గర్లోని డాక్టర్‌కి చూపించుకోవాలి.