పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికెపూడి గాంధీ.. హరీశ్ రావు గరంగరం

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికెపూడి గాంధీ.. హరీశ్ రావు గరంగరం

హైదరాబాద్: శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) చైర్మన్గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్టిమేట్స్ కమిటీకి చైర్మన్గా నల్లమద ఉత్తమ్ పద్మావతి, ప్రజా పద్దుల సంఘం చైర్మన్గా షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరయ్యను నియమిస్తూ లెజిస్లేచర్ సెక్రటరీ నరసింహచార్యులు బులిటెన్ విడుదల చేశారు. అయితే.. శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అరికెపూడి గాంధీని నియమించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఖూనీ చేస్తోందని, పీఏసీ చైర్మన్ పదవి ప్రధాన ప్రతిపక్షంకి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్న అరికెపూడి గాంధీకి ఎలా ఇస్తారని, లోక్ సభలో పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్కి ఇవ్వలేదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని పట్టుకుని లోక్ సభలో మాట్లాడతారని, రాహుల్ గాంధీకి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని హరీశ్ రావు విమర్శించారు.

ALSO READ | 4 వారాల్లో ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకోండి : స్పీకర్ ఆఫీస్ కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఎంపికయ్యే అవకాశాలున్నాయని మీడియాలో వార్తలొచ్చాయి. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సభ్యులుగా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ మేరకు కమిటీకి బీఆర్ఎస్ ముగ్గురు ఎమ్మెల్యేల పేర్లు కూడా ఇచ్చింది. హరీశ్ తో పాటు గంగుల కమలాకర్ పేరును, మరో ఎమ్మెల్యే పేరును బీఆర్ఎస్ ఇచ్చింది. కానీ.. ఇలా జరగకపోవడంతో బీఆర్ఎస్ గుర్రుగా ఉంది.