టీచర్లు సర్కార్ ఉద్యోగులు కాదా?

‘టీచర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారికి ప్రభుత్వం వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదు’ గత కొద్దికాలంగా ప్రచారమవుతున్న వార్త ఇది. దీని ద్వారా ఉద్యోగులు, టీచర్లకు మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాస్తవానికి ఉపాధ్యాయులంతా ఒక్కటేనని, వారు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమేనని చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. సర్వీస్ రూల్స్‌‌‌‌ను రెండు పేజీల్లో రాసుకుందామని అధికారంలోకి వచ్చిన కొత్తలో సీఎం కేసీఆర్‌‌‌‌ కూడా హామీ ఇచ్చారు. కానీ, ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదు. పైగా ఇప్పుడు టీచర్లు, ఉద్యోగులకు మధ్య అగాధం సృష్టించే ప్రయత్నం జరుగుతోంది.

తెలంగాణ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలో కొనసాగిన కాలంలో బడులన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. టీచర్ల వేతనాలను, నిర్దిష్ట వేతన స్కేళ్లతో జీతాలను ప్రభుత్వమే చెల్లించేది. టీచర్లకు ఉద్యోగ భద్రత, పెన్షన్ సౌకర్యం ఉండేది. ఆంధ్ర ప్రాంతంలో తక్కువ సంఖ్యలో ప్రభుత్వ బడులు ఉండేవి. మెజారిటీ స్కూళ్లు జిల్లా బోర్డుల ఆధ్వర్యంలోనే నడిచేవి. బోర్డు స్కూళ్లకు ప్రభుత్వం గ్రాంట్ రూపంలో ఆర్థిక సాయం చేసేది. స్థానిక బోర్డుల దయాదాక్షిణ్యాల మేరకు టీచర్ల సర్వీస్ పరిస్థితులు ఉండేవి. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలను ఏర్పాటు చేస్తూ విద్యను వాటికి అప్పగించారు. ఈ క్రమంలో తెలంగాణలోని ప్రభుత్వ బడులు, ఆంధ్రాలోని ప్రభుత్వ, బోర్డు స్కూళ్లు స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్/మున్సిపల్(ఆంధ్ర ప్రాంతంలో మాత్రమే) యాజమాన్యాల అధీనంలోకి వచ్చాయి .1956కు ముందు నియమితులైన ప్రభుత్వ టీచర్లు స్థానిక సంస్థల ఆధ్వర్యంలో పనిచేశారు. తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ బడులు అట్లే కొనసాగాయి. మున్సిపల్ సంస్థలకు వాటిని బదిలీ చేయలేదు. స్థానిక సంస్థలకే టీచర్ల నియామక అధికారాలు ఇచ్చారు. ప్రభుత్వ బడుల్లో నియామకాలు మాత్రం ప్రభుత్వమే జరిపేది. నియామక విధానాల్లో తేడాతో ప్రభుత్వ టీచర్లతో సమానంగా స్థానిక సంస్థల టీచర్లకు సర్వీస్‌‌‌‌ నిబంధనలు అమలు కాలేదు. వేతనాల చెల్లింపు, సెలవులు, ఇతర సౌకర్యాల వర్తింపులో వివక్ష కొనసాగింది.

ఎన్నో ఆందోళనలు

టీచర్ల ఆందోళనల ఫలితంగా స్థానిక సంస్థల టీచర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రకటించారు. 1981లో అసెంబ్లీలో చేసిన చట్టం ద్వారా పంచాయతీరాజ్ శాఖలోని ఇతర ఉద్యోగులతోపాటు టీచర్లను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రావిన్షియలైజేషన్ జరిగింది. అప్పటి నుంచి వీరికి ఇతర ఉద్యోగులకు వర్తించే రాజ్యాంగ నిబంధనలు, క్రమశిక్షణా నియమావళి(సీసీఏ నిబంధనలు), సెలవు నిబంధనలు, పెన్షన్ రూల్స్ వర్తింపజేశారు. అలాగే ప్రభుత్వ టీచర్లకు వర్తించే జీవో 78లోని నిబంధనలను కూడా జివో 278 ద్వారా వర్తింపజేశారు. రాజ్యాంగంలోని 309 అధికరణాన్ని అనుసరించి జిల్లా ఎంపిక కమిటీ(డీఎస్‌‌‌‌సీ)ల ద్వారా టీచర్ల నియామకాలను చేపట్టారు.1992లో జీవో 40 ద్వారా పంచాయతీరాజ్, ప్రభుత్వ బడుల్లో పనిచేస్తున్న టీచర్ల సర్వీసులను ఏకీకృతం చేశారు. కోర్టులో ఈ ఉత్తర్వులను సవాల్‌‌‌‌ చేసినప్పుడు ప్రభుత్వం వాటిని ఉపసంహరించుకుంది.

పదోన్నతుల విషయంలో లొల్లి

విద్యా శాఖలోని పర్యవేక్షణ/పాలనా సంబంధమైన పోస్టుల పదోన్నతుల విషయంలో బోధనతో ప్రత్యక్ష సంబంధం ఉండే టీచర్లకు అర్హత కల్పించాలని, కార్యాలయ సంబంధమైన పాలనా పోస్టులకు బోధనేతర సిబ్బందికి అవకాశం కల్పించాలని 90వ దశకంలో సుందరేశన్ కమిటీ సిఫార్సులు చేసింది. ఆరేండ్ల పోరాటాల ఫలితంగా బోధనలో ప్రత్యక్ష సంబంధం ఉండే టీచర్లకు కూడా ఎంఈవో, డీఈవో, డైట్ కాలేజ్‌‌‌‌ లెక్చరర్లు, కాలేజ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ లెక్చరర్లుగా అర్హత కల్పించారు. ఉన్నత పాలనా పోస్టులకు టీచర్లు, మినిస్టీరియల్ సిబ్బందిని ఉమ్మడిగా అర్హులుగా గుర్తిస్తూ 1998లో 505, 535 జీవోల ద్వారా కామన్ సర్వీస్ రూల్‌‌‌‌ విడుదల చేసి విద్యా శాఖలోని బోధనా సిబ్బంది సర్వీసులను ఏకీకృతం చేశారు. కొద్ది కాలం పాటు ఉమ్మడి సర్వీస్‌‌‌‌ రూల్స్‌‌‌‌ ప్రకారం టీచర్లు ప్రయోజనాలు పొందారు. అయితే న్యాయ వివాదాల కారణంగా 2005లో జీవో 95, 96 ద్వారా మరోసారి టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్‌‌‌‌ అమలులోకి వచ్చి కామన్ సీనియారిటీ ప్రాతిపదికన ప్రభుత్వ, పంచాయతీరాజ్ స్కూళ్లలో పనిచేసే టీచర్లు పదోన్నతులు పొందారు. ఈ జీవోలు కూడా లోకల్ కేడర్ అంశంపై కోర్టులో నిలువలేదు.

సమస్య పరిష్కారం కాలేదు

న్యాయ సంబంధమైన వివాదాలతో ప్రభుత్వాలు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతో దశాబ్దాలుగా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. 2015లో సుప్రీంకోర్టు టీచర్ల ఏకీకృత సర్వీస్ రూల్స్‌‌‌‌పై తీర్పునిస్తూ ‘ఇప్పటికే లోకల్ కేడర్‌‌‌‌గా ఆర్గనైజ్ చేయబడిన పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ టీచర్లు కూడా ప్రభుత్వ టీచర్లు అయినందున ఏకీకృతం చేయడానికి రాష్ట్రపతి ఆమోదం కోసం ప్రతిపాదనలు పంపడానికి రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛ కలిగి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పంపే ప్రతిపాదనలను వెంటనే కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి’ అని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్, ప్రభుత్వ బడుల్లో పనిచేసే టీచర్ల సర్వీసులను ఏకీకృతం చేయడానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీని ప్రకారం 2017లో రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు జరిగాయి. అయితే ఈ సవరణలను 2018లో హైకోర్టు కొట్టేస్తూ.. రాష్ట్రపతికి లోకల్ కేడర్‌‌‌‌గా ఆర్గనైజ్‌‌‌‌ చేసే అధికారమే ఉందని, ఏకీకృతం చేసే అధికారం లేదని ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలకు సంబంధించి తదుపరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొదట మండల, జిల్లా పరిషత్‌‌‌‌ టీచర్ల పోస్టులను లోకల్ కేడర్‌‌‌‌గా ఆర్గనైజ్ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రపతి అనుమతి పొందాలి. ఆ తర్వాత ఆర్టికల్ 309 ప్రకారం టీచర్ల సర్వీసు నిబంధనలను జారీ చేస్తూ వారి సేవలను ఏకీకృతం చేస్తూ టీచర్ల మధ్య వివక్ష పోయేలా చర్యలు తీసుకోవాలి.