ముషీరాబాద్,వెలుగు: సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణను అమలు చేయాలని మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆరెపల్లి రాజేందర్ హాజరై ఎస్సీ కులాల్లోని 59 కులాలకు వారి జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కే విధంగా సామాజిక న్యాయం చేయాలన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా మద్దతు ప్రకటించారని దానిని అమలుకు కావలసిన చర్యలు వెంటనే ప్రారంభించాలని కోరారు. సమావేశంలో పల్లెల వీరస్వామి, డాక్టర్ చీమ శ్రీనివాస్, కిరణ్, టి ఈశ్వర్, ఏ సాయిబాబా, జె నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.