బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. కరీంనగర్ జిల్లాలో కీలక నేత ఆ పార్టీకి రాజీనామా చేశారు. మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఈ మేరకు అధినేత కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపారు.
బీఆర్ఎస్ తరపున మానకొండూరు ఎమ్మెల్యే టికెట్ ఆశించారు ఆరెపల్లి మోహన్. కానీ సీఎం కేసీఆర్ మానకొండూరు ఎమ్మెల్యే టికెట్ ను సిట్టింగ్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు కేటాయించారు. దీంతో కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న ఆరెపల్లి మోహన్..బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని ఆరెపల్లి మోహన్ తెలిపారు.
Also Read :- ఈడీ కాదు.. మోదీ నోటీస్ వచ్చింది : ఎమ్మెల్సీ కవిత
కరీంనగర్ జిల్లా మానకొండూరు జడ్పీటీసీగా ఆ తర్వాత జెడ్పీఛైర్మైన్ గా ,కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేసిన ఆరెపల్లి మోహన్ ..గతంలో ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడిగా పేరొందిన ఆరెపల్లికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత న్యాయం జరగలేదు. ఆయనకు ఎలాంటి పదవులు కట్టబెట్టలేదు. బీఆర్ఎస్ నుంచి మానకొండూరు లేదా చొప్పదండి నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి టికెట్ లభిస్తుందని అనుకున్నారు. కానీ ఆరెపల్లికి నిరాశే ఎదురైంది.