కరీంనగర్, వెలుగు: మానకొండూరు మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కారు దిగి హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. 2019లో లోక్ సభ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ చేరిన ఆయన ఈ సారి మానకొండూరు నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డారు. దీంతో 15 రోజులుగా మానకొండూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ తన అనుచరుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. రెండు రోజులుగా కరీంనగర్లోని తన నివాసంలో కార్యకర్తలతో చర్చించారు.
టికెట్ సంగతి ఎలా ఉన్నా మళ్లీ కాంగ్రెస్ లో చేరాలని మెజార్టీ కార్యకర్తలు ఆరేపల్లికి సూచించడంతో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో పలుమార్లు సంప్రదింపులు కూడా జరిపినట్లు సమాచారం. గురువారం మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించనున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు ఓడించిన మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ టార్గెట్గా ఆరేపల్లి మోహన్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.