Copa America 2024: అర్జెంటీనాదే కోపా అమెరికా కప్.. కంటతడి పెట్టుకున్న మెస్సీ

మేజర్ టోర్నీలో అర్జెంటీనా మరోసారి సత్తా చాటింది. ప్రతిష్టాత్మక కోపా అమెరికా కప్ విజేతగా నిలిచింది. ఆదివారం (జూలై 14) అర్దరాత్రి కొలంబియాతో జరిగిన ఫైనల్లో 1-0 తేడాతో అర్జెంటీనా గెలిచి వరుసగా రెండోసారి కోపా కప్ ను తమ ఖాతాలో వేసుకుంది. దీంతో అర్జెంటీనా వరుసగా మూడో మేజర్ టైటిల్ ను గెలిచిన జట్టుగా నిలిచింది. 2021లో కోపా అమెరికా కప్ నెగ్గిన మెస్సీ బృందం.. 2022 లో ఫిఫా వరల్డ్ కప్ గెలుచుకుంది. తాజాగా 2024 కోపా అమెరికా కప్ ఛాంపియన్ గా అవతరించడంతో మూడేళ్ళలో మూడు మేజర్ టైటిల్స్ నెగ్గి చరిత్ర సృష్టించింది.

ఓవరాల్ గా అర్జెంటీనాకు ఇది 16 వ కోపా అమెరికా కప్ కావడం విశేషం. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన అర్జెంటీనా స్థాయికి తగ్గ ఆటతీరును ప్రదర్శించి ఫైనల్ కు చేరుకుంది. అయితే ఫైనల్లో కొలంబియా నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పలేదు. ఇరు జట్లు పోటాపోటీగా ఆడడంతో నిర్ణీత 90 నిమిషాల్లో ఏ జట్టు గోల్ చేయలేకపోయింది. ఆట 38 వ నిమిషంలో అర్జెంటీనా కెప్టెన్ మెస్సీకు గాయమవ్వడం ఆ జట్టుపై తీవ్ర ప్రభావం చూపించింది. 

15 నుంచి 20 నిమిషాల పాటు మైదానంలో ఇబ్బందిగా కదిలిన మెస్సీ ఆట 64వ నిమిషంలో అతని స్థానంలో  సబ్ స్టిట్యూట్ వచ్చాడు. ఈ సమయంలో మెస్సీ డగౌట్ లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. నిర్ణీత సమయం 90 నిమిషాలు ముగిసేసరికి ఏ జట్టు గోల్ చేయకపోవడంతో మ్యాచ్ పై ఆసక్తి పెరిగింది. అయితే అదనపు సమయంలో 112వ నిమిషంలో లౌటారో మార్టినెజ్ గోల్ కొట్టి అర్జెంటీనాకు టైటిల్ అందించాడు.