- 16వ సారి కోపా అమెరికా విజేతగా అర్జెంటీనా
- ఫైనల్లో 1-0తో కొలంబియాపై విక్టరీ
మియామి గార్డెన్స్ : వరల్డ్ ఫుట్‌బాల్ చాంపియన్ అర్జెంటీనా కోపా అమెరికా కప్‌లో కేక పుట్టించింది. సాకర్ లెజెండ్ లియోనల్ మెస్సీ కెప్టెన్సీలోని ఆ జట్టు రికార్డు స్థాయిలో 16వ సారి విజేతగా నిలిచింది. ఇండియా టైమ్ ప్రకారం సోమవారం ఉదయం జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్లో 1–0తో కొలంబియాపై విజయం సాధించి టైటిల్ నిలబెట్టుకుంది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో నిర్ణీత 90 నిమిషాల్లో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయాయి. అయితే, ఎక్స్‌ట్రా టైమ్‌లో అర్జెంటీనా అదరగొట్టింది. 112వ నిమిషంలో మార్టినెజ్ చేసిన గోల్‌తో ఆ జట్టు టైటిల్ ఖాతాలో వేసుకుంది.
ఈ టోర్నీలో చివరి మ్యాచ్ ఆడిన 37 ఏండ్ల మెస్సీ కుడి కాలి చీలమండ గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు. 64వ నిమిషంలో బాల్ కోసం రన్నింగ్ చేస్తుండగా జారి పడి గాయానికి గురైన లియోనల్ భావోద్వేగంతో గ్రౌండ్ వీడాడు. డగౌట్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయితే, ట్రోఫీ గెలిచిన అర్జెంటీనా ఆటగాళ్లు అతనికి ఘనంగా వీడ్కోలు పలికారు. మ్యాచ్ పూర్తయ్యాక ప్లేయర్లంతా అతడిని ఎత్తుకొని గాల్లోకి లేపారు. ఈ విజయంతో కోపా అమెరికా కప్ అత్యధికసార్లు నెగ్గిన జట్టుగా అర్జెంటీనా.. ఉరుగ్వే (15 సార్లు)ను అధిగమించింది.
ALSO READ : సాత్విక్-చిరాగ్‌కు ఈజీ డ్రా
పోటెత్తిన ఫ్యాన్స్.. ఫైనల్ ఆలస్యం
భారీ స్థాయిలో పోటెత్తిన అభిమానుల కారణంగా ఫైనల్ గంట 20 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. రెండు బలమైన జట్ల మధ్య టైటిల్ ఫైట్, అందులోనూ లెజెండ్ మెస్సీ బరిలో ఉండటంతో టికెట్ లేని వాళ్లు కూడా స్టేడియంలోకి వచ్చే ప్రయత్నం చేయడంతో ఎంట్రీ పాయింట్ల వద్ద తోపులాట జరిగింది. పలువురికి గాయాలయ్యాయి. స్టేడియం లోపలికి వచ్చేందుకు ఎగబడ్డ వాళ్లలో రెడ్ జెర్సీలు వేసుకున్న కొలంబియా ఫ్యాన్సే ఎక్కువ ఉన్నారు. వాళ్లను కంట్రోల్ చేసేందుకు భద్రతా బలగాలు తీవ్రంగా శ్రమించాయి. చివరకు పరిస్థితిని అదుపులోకి తేవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.