- కోదాడ పబ్లిక్ క్లబ్ మీటింగ్‌లో వాగ్వాదం
కోదాడ, వెలుగు : కోదాడలో బీఆర్‌ఎస్‌లో నెలకొన్ని అసమ్మతి సద్దుమణగడం లేదు. ఆదివారం కోదాడ పబ్లిక్ క్లబ్ జనరల్ బాడీ మీటింగ్‌లో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే చందర్ రావు మధ్య వాగ్వాదం జరిగింది. పబ్లిక్ క్లబ్ పాలవర్గం ఎమ్మెల్యేతో పాటు మాజీ ఎమ్మెల్యేను మీటింగ్‌కు ఆహ్వానించారు. సభ ప్రారంభం కాగానే ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హాజరయ్యారు. కొద్ది సేపటి తర్వాత మాజీ ఎమ్మెల్యే చందర్‌రావు సభలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా పాలకవర్గం సభ్యులు మాజీ ఎమ్మెల్యేను వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానించారు.
కానీ అక్కడ ఎమ్మెల్యే ఉండడం చూసి ఆయన కిందనే సభ్యులతో పాటు కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడారు. ఈ క్రమంలో క్లబ్ ఎన్నికలతో పాటు ఇతర అంశాలపై సభ్యులు అభిప్రాయాలు చెబుతుండగా.. చందర్‌రావు మైక్ తీసుకొని పాలకవర్గం ఎన్నిక ఈరోజు పూర్తి కావాలని కోరారు. వాయిదా వేయొద్దని, గత సంప్రదాయాన్ని అమలు చేయాలని అన్నారు. దీంతో ఎమ్మెల్యే కలుగజేసుకొని ‘మీ హయాంలో ఎన్నికలు జరపకుండా ఇంటి దగ్గరి నుంచి క్లబ్ పాలకవర్గాన్ని ఎన్నిక చేయలేదా..?
క్లబ్ ను వాడుకొని పేపర్ యాడ్‌లు ఇవ్వలేదా..? అన్నదానాలు పెట్టలేదా..? అని ప్రశ్నించారు. దీంతో చందర్ రావు ‘నీతో మాట్లాడడం లేదు’ అనడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో క్లబ్ సభ్యులు జోక్యం చేసుకొని ఇరువురిని శాంతింపజేశారు.