ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

జమ్మికుంట, వెలుగు: చేప పిల్లల పంపిణీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాల మధ్య మాటలు తీవ్రస్థాయికి చేరాయి. దీంతో పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్‌‌ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట గుండ్ల చెరువులో బుధవారం చేప పిల్లల పంపిణీ నిర్వహించారు. కార్యక్రమానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, పోలీసులను అడ్డుపెట్టు కొని కాంగ్రెస్ గుండాలు తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 

వెంటనే మున్సిపల్ వైస్‌ చైర్మన్​ దేశిని స్వప్న, ఆమె భర్త కాంగ్రెస్ నేత కోటితో పాటు కొందరు పార్టీ లీడర్లు అడ్డుకుని.. బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు మూడెకరాల భూమి, ఇంటికో జాబ్ ఎందుకు ఇవ్వలేదని ఎమ్మెల్యేను నిలదీశారు. తాను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ముక్కు నేలకు రాస్తానని ఎమ్మెల్యే సవాల్ విసిరారు . దీంతో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదం జరిగింది.

పోలీసులు అక్కడి నుంచి ఇరువర్గాలను పంపించి వేశారు. అనంతరం కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎజెండాపై మాట్లాడడం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సరికాదన్నారు. హుజురాబాద్ లో అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేని ఆయన కాంగ్రెస్ ని విమర్శించడమే పనిగా పెట్టుకొని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరోసారి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించబోమని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.