కౌశిక్ రెడ్డి వర్సెస్ సంజయ్: మంత్రుల ముందే ఎమ్మెల్యేల కొట్లాట

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సమీక్ష సమావేశం హాట్ హాట్ సాగింది. కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కలెక్టరేట్లో ఆదివారం (జనవరి 12) జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకున్నాడు. ‘‘నువ్వు ఏ పార్టీలో గెలిచి, ఏ పార్టీలోకి వెళ్లావు. అసలు నీది ఏ పార్టీ’’ అంటూ కౌశిక్ రెడ్డి నిలదీశాడు. 

ALSO READ | అర్హులైన లబ్ధి దారులకు అందరికీ రేషన్ కార్డులు: మంత్రి పొన్నం

దీంతో ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, సంజయ్ మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రుల ముందే ఇద్దరు ఎమ్మెల్యేలు ఒకరిని ఒకరు తోసుకున్నారు.  వెంటనే అప్రమత్తమైన పోలీసులు సమావేశం నుండి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బయటకు లాక్కెళ్లారు. కౌశిక్ రెడ్డి, సంజయ్‎ల వాగ్వాదంతో సమావేశంలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ తరుఫున గెలిచిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన ఆ పార్టీకి  రాజీనామా చేశారు.