
- అడ్డుకుని వాగ్వాదానికి దిగిన ప్రస్తుతం విధుల్లో ఉన్న నాయిబ్రాహ్మణులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని కల్యాణకట్టలో బుధవారం గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. హైకోర్టు ఉత్తర్వులతో గుట్టకు చెందిన 20 మంది నాయిబ్రాహ్మణులను విధుల్లోకి తీసుకునేందుకు అధికారులు కల్యాణకట్ట వద్దకు వచ్చి ప్రాసెస్ చేపట్టారు. అక్కడ కొంతకాలంగా విధుల్లో ఉన్న యాదగిరిపల్లికి చెందిన నాయిబ్రాహ్మణులు అడ్డుకుని ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తవాళ్లను అనుమతించ బోమని భీష్మించారు. రెండు గంటల పాటు ఆలయ ఆఫీసర్లు, నాయిబ్రాహ్మణుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. హైకోర్టు ఆర్డర్స్ ను అమలు చేయడం తమ బాధ్యతని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే కోర్టులో తేల్చుకోవాలని, అధికారులు స్పష్టం చేశారు.
కోర్టు ఆర్డర్స్ మేరకు విధుల్లోకి తీసుకుంటే తమ ఉపాధి పోతుందని విధుల్లో ఉన్న నాయిబ్రాహ్మణులు తెలిపారు. దీంతో తమతో వాదిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులు హెచ్చరించారు. దీంతో ప్రస్తుత నాయిబ్రాహ్మణులు వెనక్కి తగ్గారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు 33 మందిని కొత్తగా విధుల్లోకి తీసుకోవాల్సి ఉండగా, 20 మందిని తీసుకున్నారు. పాత, కొత్త లేకుండా పని చేయాలని, భక్తులను ఇబ్బంది పెడితే చట్టపరంగా చర్యలు తప్పవని ఇరువర్గాలకు అధికారులు సూచించారు. కాగా కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చే ఒక్కొక్కరి వద్ద రూ.50 వసూలు చేస్తుండగా.. ఇందులో రూ.30 నాయిబ్రాహ్మణులకు, రూ.20 దేవస్థానం తీసుకుంటోంది.
ఆలయ అభివృద్ధిలో షాపులు, ఇండ్లను కోల్పోగా..
యాదగిరిపల్లికి చెందిన 96 మంది నాయిబ్రాహ్మణులు విధులు నిర్వర్తిస్తుండగా.. ఆలయ అభివృద్ధిలో షాపులు, ఇండ్లు కోల్పోయామని, తమకు కల్యాణకట్టలో అవకాశం కల్పించాలని యాదగిరిగుట్టకు చెందిన నాయిబ్రాహ్మణులు..2023 ఏప్రిల్ లో దేవస్థానానికి దరఖాస్తులు చేశారు. దీనిపై ఆలయ ఈవో దేవాదాయశాఖ కమిషనర్ కు నివేదిక ఇచ్చారు. 33 మందికి అవకాశం కల్పించాలని అదే ఏడాది ఆగస్టులో కమిషనర్ గుట్ట ఈవోను ఆదేశించారు.
కమిషనర్ ఉత్తర్వులపై ప్రస్తుత నాయిబ్రాహ్మణులు హైకోర్టును ఆశ్రయించారు. 2024 ఆగస్టు లో పిటిషన్ ను డిస్మిస్ చేసింది. కొత్తగా 33 మందికి అవకాశం కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఇరువర్గాల మధ్య గొడవలు తలెత్తకుండా చర్చించుకుని ఓ నిర్ణయానికి రావాలని దేవస్థాన అధికారులు కొంత సమయం ఇచ్చారు. అయినా ప్రస్తుతం విధుల్లోని నాయిబ్రాహ్మణులు తమ వైఖరిని మార్చుకోకపోవడంతో.. చివరకు హైకోర్టు ఉత్తర్వుల అమలుకు దేవస్థానం నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా అడ్డుకునే హక్కు లేదని ఆలయ ఈవో భాస్కర్ రావు తెలిపారు.