రిజిస్ట్రార్ నేను..కాదు నేనే! టీయూలో ప్రొఫెసర్ల మధ్య వాగ్వాదం

డిచ్ పల్లి, వెలుగు: తెలంగాణ వర్సిటీలో రిజిస్ట్రార్ నేనంటే నేను అని ఇద్దరు ప్రొఫెసర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో కాసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజులుగా వీసీ, ఈసీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎవరూ తగ్గకపోవడంతో యూనివర్శిటీ పరిపాలన గందరగోళంగా తయారైంది.

ఈసీ సభ్యులు రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్  యాదగిరిని, వీసీ రవీందర్ గుప్తా.. ప్రొఫెసర్ కనకయ్యను నియమించారు. సోమవారం ఉదయం యాదగిరి రిజిస్ట్రార్ చైర్​లో కూర్చున్నారు. కాసేపటి తర్వాత వచ్చిన కనకయ్య ఆర్డర్ కాపీ లేకుండా చైర్ లో ఎలా కూర్చుంటారని ఆయనను ప్రశ్నించారు. యాదగిరి వైపు స్టూడెంట్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు..కనకయ్యకు కొంత మంది ప్రొఫెసర్లు, దళిత సంఘాల లీడర్లు మద్దతుగా మాట్లాడారు. కొద్దిసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఇద్దరికి సర్ది చెప్పి పంపించారు.