
న్యూఢిల్లీ: అమెరికా నుంచి ఇండియన్ల డిపోర్టేషన్ ఇష్యూపై లోక్ సభ దద్ధరిల్లింది. ఇండియన్ల తరలింపులో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని తప్పుబడుతూ ప్రతిపక్ష ఇండియా కూటమి ఆందోళనకు దిగింది. ఇండియన్లను అమెరికా అవమానకరరీతిలో వెనక్కి పంపిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం మౌనంగా ఉంటున్నదని మండిపడింది. గురువారం లోక్ సభ ప్రారంభం కాగానే డిపోర్టేషన్ ఇష్యూపై ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళన చేపట్టారు. కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చేశారు. దీనిపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ నినాదాలు చేశారు.
దీంతో స్పీకర్ ఓంబిర్లా సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ సభ తిరిగి ప్రారంభం కాగా.. ప్రతిపక్ష ఎంపీలు తమ ఆందోళనను కొనసాగించారు. డిపోర్టేషన్ ఇష్యూపై కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో సభ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా పడింది. మళ్లీ ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించడంతో మధ్యాహ్నం 3:30 గంటలకు వాయిదా పడింది. ఇక చివరికి సభ మళ్లీ ప్రారంభమైన తర్వాత విదేశాంగ మంత్రి జైశంకర్ డిపోర్టేషన్ ఇష్యూపై లోక్ సభలో ప్రకటన చేశారు.
వలసదారుల భద్రతకు కొత్త చట్టం..!
విదేశాలకు వలస వెళ్లే మనోళ్ల భద్రత కోసం కొత్త చట్టం తేవాలని కేంద్రం ఆలోచన చేస్తున్నది. అక్రమంగా ఉంటున్న ఇండియన్లను అమెరికా వెనక్కి పంపుతున్న నేపథ్యంలో దీనిపై సీరియస్‌గా దృష్టి సారించింది. విదేశాల్లో ఉపాధి కోసం సురక్షితమైన, క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించే ఫ్రేమ్ వర్క్‌ను ఏర్పాటు చేసేలా కొత్త చట్టాన్ని రూపొందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తున్నది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. సోమవారం లోక్ సభకు సమర్పించిన నివేదికలో ‘ఓవర్సీస్ మొబిలిటీ (ఫెలిసిటేషన్ అండ్ వెల్ఫేర్)–2024’ బిల్లు గురించి ప్రస్తావించినట్టు తెలిసింది.