బయ్యారం(మహబూబాబాద్ అర్భన్),వెలుగు: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇసుకమేది గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియను మహిళలు అడ్డుకున్నారు. ప్రచారంలో భాగంగా గురువారం గ్రామానికి రాగా, పోడు భూములకు పట్టాలివ్వలేదంటూ ఎమ్మెల్యేతో మహిళలు వాగ్వాదానికి దిగారు. తమ ఊరికి ఏమీ చేయలేదని, ఎందుకు వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలక్షన్లు రావడంతో ఊరు గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. తమ ప్రాంత ప్రజల సమస్యలు అస్సలే పట్టవా అని నిలదీశారు. పోడు పట్టాల కోసం ఐటీడీఏ పీవో దగ్గరకు వెళ్లి సమస్య చెప్పినా పట్టించుకోలేదన్నారు. ‘మీ అనుచరులకే పనులు చేసుకుంటున్నరు’ అని మండిపడ్డారు. చివరకు పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పారు. తర్వాత ఎమ్మెల్యే ప్రచారం చేయకుండానే వెళ్లిపోయారు.