రాధాకిషన్‌‌‌‌ రావు బెయిల్ పిటిషన్‌‌‌‌పై తీర్పు వాయిదా

రాధాకిషన్‌‌‌‌ రావు బెయిల్ పిటిషన్‌‌‌‌పై తీర్పు వాయిదా
  • హైకోర్టులో ముగిసిన  వాదనలు

హైదరాబాద్, వెలుగు: ఫోన్‌‌‌‌ట్యాపింగ్‌‌‌‌ కేసులో 5వ నిందితుడైన టాస్క్‌‌‌‌ఫోర్సు మాజీ డీసీపీ రాధాకిషన్‌‌‌‌రావు బెయిల్ పిటిషన్‌‌‌‌పై తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. తనకు బెయిల్ కోరుతూ ఇటీవల రాధాకిషన్‌‌‌‌రావు పిటిషన్ వేశారు. దాన్ని జస్టిస్‌‌‌‌ కె.సుజన శుక్రవారం వాదించారు.  పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ పల్లె నాగేశ్వరరావు వాదిస్తూ..మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌ సెక్యూరిటీ అధికారిగా ఉన్న రాధాకిషన్‌‌‌‌రావు 2020లో టాస్క్‌‌‌‌ఫోర్సు అధికారిగా నియమితులయ్యారని కోర్టుకు తెలిపారు. 

 యశోద ఆస్పత్రిలో దివ్యచరణ్‌‌‌‌ అనే వ్యక్తి వద్దకు మూడు సార్లు వెళ్లి ఒక్కోసారి కోటికిపైగా తీసుకున్నారని చెప్పారు. అంతేగాకుండా.. అధికారులకు ప్రైవేటు బాధ్యతలను అప్పగించేవారని వెల్లడించారు. ప్రభుత్వ అధికారిగా ఉంటూ చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడేవారని వివరించారు. 

మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌రావు, ఎమ్మెల్సీ కవిత, దామోదర్‌‌‌‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిలను తరచూ కలిసేవారని తెలిపారు. పలువురు ప్రైవేటు వ్యక్తులు నిధులు తరలిస్తున్న విషయాన్ని ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ ద్వారా తెలుసుకుని వారి నుంచి నగదు స్వాధీనం చేసుకోనేవారన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతోందని తెలిసి ఎస్‌‌‌‌ఐబీ సమాచారాన్ని రాధాకిషన్‌‌‌‌రావు ధ్వంసం చేయించారని పేర్కొన్నారు. 

మరో నిందితుడైన తిరుపతన్న బెయిల్ పిటిషన్‌‌‌‌ను ఇదే హైకోర్టు కొట్టివేసిందని, దీనిపై ఎస్‌‌‌‌ఎల్పీ దాఖలు చేయగా.. ఈనెల 18కి వాయిదా పడిందన్నారు.  పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది ఉమామహేశ్వరరావు వాదిస్తూ..అన్నీ అసత్య ఆరోపణలేనని కోర్టుకు చెప్పారు.

 హవాలా సొమ్ము తరలింపు అని చెబుతున్నారు తప్ప దానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పిటిషనర్‌‌‌‌కు చెందిన ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌ నివేదిక అందిందని, అది కోర్టులో భద్రంగా ఉందని చెప్పారు. ఇతరుల నివేదిక అందలేదని తన పిటిషనర్‌‌‌‌కు బెయిల్ నిరాకరించడం సరికాదన్నారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి తీర్పును వాయిదా వేశారు.