ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‎పై వాదనలు కంప్లీట్.. కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై తీర్పును తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఆర్గ్యూమెంట్స్ పూర్తి కావడంతో 2024, నవంబర్ 12వ తేదీన తీర్పును హోల్డ్‎లో పెట్టింది. దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అసలేం జరిగిందంటే..?

గతేడాది నవంబర్ నెలలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి ఆ తర్వాత అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. దీంతో ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‎కు ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ చేపట్టిన న్యాయస్థానం..  ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై షెడ్యూల్‌ ఖరారు చేయాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. 

హైకోర్టు సింగల్ బెంచ్ ఆదేశాలను అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్‎లో సవాల్ చేశారు. స్పీకర్‎కు ఆదేశాలు జారీ చేసే అధికారం న్యాయస్థానాలకు లేదని ఆయన పిటిషన్‎లో పేర్కొన్నారు. ఈ క్రమంలో అసెంబ్లీ స్పీకర్ దాఖలు చేసిన పిటిషన్‎పై సోమవారం (నవంబర్ 12) ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌‎పై తీర్పును రిజర్వ్ చేసింది. దీంతో న్యాయస్థానం ఎలాంటి తీర్పు వెలువరిస్తుందోనని స్టేట్ పాలిటిక్స్‎లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.