లా కమిషన్‌ను సంప్రదించాల్సింది.. కొత్త చట్టాల అమలుపై మద్రాస్ హైకోర్టు

లా కమిషన్‌ను సంప్రదించాల్సింది.. కొత్త చట్టాల అమలుపై మద్రాస్ హైకోర్టు

చెన్నై: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టి, అమలు చేస్తున్న మూడు క్రిమినల్‌ చట్టాలను సవాల్‌ చేస్తూ తమిళనాడులోని డీఎంకే పార్టీ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి మద్రాస్‌ హైకోర్టులో  దాఖలు చేసిన పిటిషన్ పై వాదోపవాదాలు  జరిగాయి.  నిన్న విచారణకు స్వీకరించిన జస్టిస్‌ ఎస్‌ఎస్‌ సుందర్‌, జస్టిస్‌ సెంథిల్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం.. కొత్త చట్టాలు అమలులోకి తెచ్చే ముందు జాతీయ లా కమిషన్ ను, రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాల్సిందని అభిప్రాయపడింది.

చట్టపరమైన విషయాలపై ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేందుకు ఉద్దేశించిన లా కమిషన్ ను విస్మరించడం సరికాదని పేర్కొంది. భారతీయ  న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం వల్ల న్యాయవాదులు, జడ్జిలు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. సవరణల ఉద్దేశం మంచిదే కావచ్చు కానీ, దాని వల్ల కేసుల పరిష్కారంలో జరిగే జాప్యం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడింది.

భారతి తరపున సీనియర్ న్యాయవాది ఎన్ఆర్ ఎలాంగో వాదిస్తూ, ఎటువంటి అర్థవంతమైన చర్చ లేకుండానే పార్లమెంటు కొత్త చట్టాలను ప్రవేశపెట్టి ఆమోదించిందని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించలేదని, చట్టాల్లోని కొన్ని నిబంధనలు వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా ఉన్నాయని, అందువల్ల వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఇరు వర్గాల వాదనలు నమోదు చేసుకున్న హైకోర్టు పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్రానికి  నోటీసులు జారీ చేసింది.