
- దుర్గం చిన్నయ్య జైలుకు వెళ్లడం ఖాయం
- అతడికి టికెట్ ఇచ్చిన రోజే బీఆర్ఎస్ పతనం మొదలైంది
- బెల్లంపల్లిలో వినోద్‌ను, చెన్నూరులో వివేక్‌ను గెలిపించండి
- అరిజన్ డెయిరీ సీఈఓ షేజల్ కాంగ్రెస్ పార్టీలో చేరిక
బెల్లంపల్లి, వెలుగు : మహిళలకు రక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని అరిజిన్ డెయిరీ సీఈఓ బోడపాటి షేజల్ అన్నారు. గురువారం బెల్లంపల్లికి వచ్చిన షేజల్.. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. చిన్నయ్య లాంటి కామాంధుడికి బీఆర్ఎస్ టికెట్ఇచ్చిన రోజే ఆ పార్టీ పతనం ఆరంభమైందన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య తన మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని, యువకులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అరిజిన్ డెయిరీని బెల్లంపల్లిలో స్థాపిస్తే దుర్గం చిన్నయ్య అధికారాన్ని అడ్డు పెట్టుకుని డెయిరీ ఎండీ ఆదినారాయణ మీద పోలీసులతో పీడీ యాక్ట్ పెట్టించాడని ఆరోపించారు.
త్వరలోనే దుర్గం చిన్నయ్య జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. బెల్లంపల్లిలో కనీవినీ ఎరుగని రీతిలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ను, చెన్నూరులో వివేక్ వెంకట స్వామిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహిళా కాంగ్రెస్ నేత కంకణాల పద్మా రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపల్లి ఉదయ్ కాంత్, టీపీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు ఆదర్శ్ వర్ధన్ రాజు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మునిమంద రమేశ్, చిప్ప మనోహర్, కంకటి శ్రీనివాస్ పాల్గొన్నారు.