హైదరాబాద్, వెలుగు: తాను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోలేదని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. తనకు సీఎం రేవంత్ రెడ్డి కప్పిన కండువా పైన ఏ పార్టీ గుర్తులు లేవని స్పష్టం చేశా రు. దేవుడి శాలువా మాత్రమే కప్పుకున్నట్టు వెల్లడించారు. ఒకవేళ పార్టీ మారానని అనర్హత వేటు వేస్తే.. బై ఎలక్షన్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
గ్రౌండ్ చాలా క్లారిటీగా ఉందని తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పీఏసీ చైర్మన్ పదవిని ప్రతిపక్షానికి కాకుండా పార్టీ మారిన ఎమ్మెల్యేకు ఇచ్చారని బీఆర్ఎస్ విమర్శలపై గాంధీ స్పందించారు. సీఎం రేవంత్ తనకు పాత మిత్రుడని.. అభివృద్ధి కోసం కలిసి పనిచేద్దామని ఆయన చెప్పారన్నారు. పార్టీలో చేరమని తనను ఎప్పుడూ కోరలేదని తెలిపారు. అయినా ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా అని ప్రశ్నించారు.
Also Read:-ఇండియాలో ఎన్నికలను కంట్రోల్ చేశారు
తనకు పీఏసీ ఇస్తే ఓర్వలేని తనం ఎందుకో చెప్పాలన్నారు. గతంలో మనం ఏం చేశా మో కూడా గుర్తుంచుకోవాలన్నారు. ఆనాడు శ్రీధర్ బాబుకి పీఏసీ ఇవ్వకుండా ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేకు కట్టబెట్టామన్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అని మాట్లాడుతున్నారని.. వారికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ వాదన చెప్పాలని.. ఆ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.
గతంలో మనం చేసిన తప్పులను మర్చిపోతే ఎట్ల అని ప్రశ్నించారు. పీఏసీ చైర్మన్ కోసం ఎమ్మెల్యేల సంతకాలతో రూల్స్ ప్రకారం నామినేషన్ వేసినట్లు చెప్పారు. తప్పులుంటే వెళ్లి స్పీకర్ ను అడగాలన్నారు.