
- క్వార్టర్స్‌లోనే ఓడిన అరీనా, రిబాకిన
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్ విమెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. స్టార్ ప్లేయర్లు అరీనా సబలెంక, ఎలీనా రిబాకినాకు షాక్ తగిలింది. బుధవారం జరిగిన క్వార్టర్స్‌లో రెండో సీడ్, గత సీజన్ సెమీఫైనలిస్ట్ సబలెంక (బెలారస్) 7–6 (7/5), 4–6, 4– తో అన్‌సీడెడ్, రష్యా టీనేజర్ మిరా ఆండ్రీవా చేతిలో కంగుతిన్నది. రెండున్నర గంటల మ్యాచ్‌లో తొలి సెట్‌ను టై బ్రేక్‌లో నెగ్గిన సబలెంకా తర్వాతి రెండు సెట్లలో నిరాశపరిచింది. 17 ఏండ్ల ఆండ్రీవా స్పీడ్‌ను తట్టుకోలేకపోయింది. 38వ ర్యాంకర్ అయిన ఆండ్రీవా.. వరల్డ్ నం.2 సబలెంకతో తలపడ్డ తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించి తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సెమీస్ చేరింది.
మరో క్వార్టర్స్‌లో 12వ సీడ్ జాస్మిన్ పవోలిని (ఇటలీ) 6–2, 4–6, 6–4తో నాలుగో సీడ్ ఎలీనా రిబాకిన (కజకిస్తాన్)కు చెక్ పెట్టింది. సెమీస్‌లో ఆండ్రీవాతో పోటీ పడనుంది. మెన్స్ సింగిల్స్‌క్వార్టర్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్ (స్పెయిన్) 6–3, 7–6 (7/3), 6–4తో వరుస సెట్లలో తొమ్మిదో సీడ్ స్టెఫనోస్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించాడు. సెమీస్‌లో అతను రెండో సీడ్ జానిక్ సినర్‌తో పోటీ పడనున్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో గాయం కారణంగా టాప్ సీడ్ జొకోవిచ్ వాకోవర్ ఇవ్వడంతో ఏడో సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) సెమీస్ చేరాడు.
సెమీస్‌లో బోపన్న
ఇండియా టెన్నిస్ లెజెండ్ రోహన్ బోపన్న తన డబుల్స్ పార్ట్‌నర్ మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ బోపన్న-–ఎబ్డెన్ 7-–6 (7/3), 5–-7, 6–-1తో పదో సీడ్ సాండర్ గిలీ–-జొరాన్ వ్లీగెన్ (బెల్జియం)పై విజయం సాధించారు. సెమీస్‌లో 11వ సీడ్ బొలెలి–-వవసోరి (ఇటలీ)తో పోటీ పడనున్నారు.