కాగజ్ నగర్, వెలుగు: ప్రభుత్వం మంజూరు చేసిన రైతు రుణమాఫీని బెజ్జూర్ మండల కేంద్రంలోని సహకార బ్యాంకులో వెంటనే అమలు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరీశ్ బాబు డిమాండ్ చేశారు. సహకార సంఘంలో రుణమాఫీ చేయడంలేదంటూ శనివారం బీజేపీ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. బెజ్జూర్ సహకార సొసైటీ ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘంలో జరిగిన అవకతవకల కారణంగానే రుణమాఫీ అమలు చేయడం లేదని ఆరోపించారు.
సొసైటీలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని,గతంలో వచ్చిన పంటల బీమా డబ్బులతోపాటు పర్సనల్ లోన్ డబ్బుల్ని కూడా కాజేశారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్ విచారణ జరిపించి రైతులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. మాజీ జడ్పీటీసీ ఎల్ములె మల్లయ్య, సింగల్ విండో మాజీ చైర్మన్ మనోహర్ గౌడ్, మాజీ ఎంపీపీ కొప్పుల శంకర్, బీజేపీ మండల అధ్యక్షుడు బాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.