మన దగ్గర మండిపోయే ఎండ అంటే 45, 47 డిగ్రీల వరకు ఉంటుంది. ఒక్కేసారి 50 డిగ్రీల వరకు కూడా నమోదవుతుంది. మనకు ఇదంతా కామన్.. ఆ దేశంలో మాత్రం 43 డిగ్రీలకే జనం అల్లాడిపోతున్నారు. భరించలేని ఎండలు అంటూ.. ఏకంగా ఆ దేశ ప్రభుత్వమే ఎమర్జెన్సీ ప్రకటించింది.
అరిజోనాను అతి వేడి తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఈ క్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ కేటీ హోబ్స్ రాష్ట్రవ్యాప్తంగా ఒక నెలకు పైగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు హోబ్స్ ఒక ప్రకటనలో తెలిపారు. “విపరీతమైన వేడి మన ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తుంది. ఇది అనారోగ్యం, కొన్ని సార్లు ప్రాణనష్టానికి కూడా దారి తీస్తుంది ”అని గవర్నర్ అన్నారు.
ఫీనిక్స్, చుట్టుపక్కల ఉన్న మారికోపా కౌంటీలో గడిచిన 31-రోజుల్లో కనీసం 110 డిగ్రీలు (43.3 డిగ్రీల సెల్సియస్) అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హాబ్స్ తెలిపారు. ఉత్తర అరిజోనాలోని సాధారణంగా చల్లగా ఉండే కోకోనినో కౌంటీలో కూడా ఈ వేసవిలో విపరీతమైన వేడి నమోదైంది. వాటిలో గ్రాండ్ కాన్యన్ దిగువ భాగం కూడా ఉంది. ఇది కొన్ని సమయాల్లో 115 డిగ్రీల (46 డిగ్రీల సెల్సియస్) వరకు కూడా నమోదైనట్టు తెలుస్తోంది.