ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర ఆలయంలో ఆర్జిత సేవల రేట్లను పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని ఆలయ ఈవో సోమయ్య వెల్లడించారు. అమ్మవారి రుద్రాభిషేకం టికెట్ ధర ప్రస్తుతం రూ.200 ఉండగా దానిని రూ.300కు పెంచారు. ఇందులో 200 గ్రాముల లడ్డూ, శేషవస్త్రం, రెండు కనుములను అందజేయనున్నారు. ప్రస్తుతం అక్షరాభ్యాసం టికెట్ ధర రూ.100 ఉండగా దానిని రూ.150కి పెంచారు. ఇందులో 100 గ్రాముల లడ్డూ ఇస్తారు.
ఇక ప్రత్యేక కుంకుమార్చన ధర రూ.150 ఉండగా రూ. 200కు పెంచారు. సత్యనారాయణ స్వామి పూజ రూ.100 నుంచి రూ. 200కు పెంచి 200 గ్రాముల లడ్డూతోపాటు, శేషవస్త్రం, రెండు కనుములు అందజేస్తారు. నిత్యచండీ హోమం టికెట్ ధర రూ.1,116 నుంచి రూ.1,500కు పెంచి శేషవస్త్రం, రెండు కనుములతోపాటు 200 గ్రాముల లడ్డూను భక్తులకు ఇవ్వనున్నారు. అన్నప్రసాదం సేవా టికెట్‌ను రూ.100 నుంచి రూ.150కి పెంచారు. పెరిగిన సేవల ధరలు నవంబర్ ఒకటో తేదీ నుంచి అమలుకానున్నట్టు ఆలయ ఈవో సోమయ్య వెల్లడించారు.