భారత్​ను విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మోదీ రావాలి : అర్జున్ ముండా

ఆదిలాబాద్ ​టౌన్, వెలుగు: భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలబెట్టాలంటే మరోసారి ప్రధానిగా నరేంద్ర మోదీని భారీ మెజారిటీతో గెలిపించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అర్జున్​ముండా పిలుపునిచ్చారు. బుధవారం తలమడుగు మండలంలోని ఉండం గ్రామంలో నిర్వహించిన పార్లమెంట్​ స్థాయి సమీక్ష  సమావేశానికి ఆయన హాజరయ్యారు.

ఈ సందర్భంగా తలమడుగు బీఆర్ఎస్ ​జడ్పీటీసీ తాటి రాజుతో పాటు పలువురు బీఆర్ఎస్​ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. మంత్రి మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు దేశ సనాతన ధర్మంపై దండయాత్ర చేస్తున్నాయని ఆరోపించారు. దేశంలో రామరాజ్యం కావాలంటే మోదీని మరోసారి ప్రధానమంత్రి చేయాలన్నారు. దేశంలో ఆదివాసీల ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, అంతరించిపోతున్న ఆదివాసీ తెగలకు మోదీ నాయకత్వంలో పునరావాసం కల్పిస్తున్నామని, ఆదివాసీ వీరులకు గుర్తింపు తెస్తూ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్​ నాయకులు మరోసారి మోసపూరిత వాగ్ధానాలతో పార్లమెంట్​ ఎన్నికల ప్రచారారానికి వస్తున్నారని, వారి మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్​ను భారీ మెజారిటీతో గెలిపించి ప్రధానికి కానుకగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్​శంకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, నాయకులు అయ్యన్న గారి భూమయ్య, అంకత్ రమేశ్, ముస్తపురె అశోక్, వేద వ్యాస్, మయూర్ చంద్ర, సుహాసినీరెడ్డి, చిలుకూరి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.