కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది: అర్జున్ ముండా

బాన్సువాడ, వెలుగు: కేసీఆర్ ​ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా పేర్కొన్నారు. శుక్రవారం బాన్సువాడలో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నామినేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఎస్​పీఎస్సీ నిర్వహించిన పరీక్షల పేపర్లు లీకై నిరుద్యోగులు రోడ్డున పడ్డారన్నారు. కేసీఆర్ ప్రభుత్వం అన్ని వర్గాలను వంచిందని, దళితులకు ఇస్తామన్న మూడెకరాల ముచ్చట మరిచారన్నారు.

మోదీ ప్రభుత్వం రైతుల కోసం ఫర్టిలైజర్ మీద సబ్సిడీ ఇస్తుందని, కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా అందించి అనేక మందిని కాపాడిందన్నారు. తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, స్కూళ్లను బాగు చేసేందుకు కేంద్రం నిధులివ్వగా, వాటిని ఇతర పథకాలకు మళ్లించారని విమర్శించారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. ఈ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. తనను స్థానికుడు కాదని చెబుతున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి, స్థానికులు కాని వారికి ఎందుకు కాంట్రాక్టులు ఇస్తున్నారని ప్రశ్నించారు. భారతీయ మూలాలున్న కమలా హారీస్​ అమెరికా ఉపాధ్యక్షురాలు అయ్యారని, రుషి సునాక్​ఇంగ్లాండ్ ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. ప్రజలకు మంచి చేసే వారు కావాలి కాని స్థానికతతో సంబంధం ఏమిటన్నారు. తాము అధికారంలోకి రాగానే బాన్సువాడను జిల్లా చేస్తామన్నారు. లీడర్లు అర్షపల్లి సాయి రెడ్డి, పైడిమల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, కోణాల గంగారెడ్డి, శంకర్ గౌడ్, చిదుర సాయిలు  పాల్గొన్నారు.