మణిపూర్‌‌‌‌లో శాంతి నెలకొంటుంది: కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్

మణిపూర్‌‌‌‌లో శాంతి నెలకొంటుంది: కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్

ఇంపాల్: మణిపూర్‌‌‌‌లో శాంతి నెలకొంటున్నదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. శాంతి స్థాపన ప్రక్రియలో పురోగతి సాధించామని, ఈ విషయంలో మరింత ముందుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. ‘‘మణిపూర్‌‌‌‌లో రాష్ట్రపతి పాలన పెట్టిన తర్వాత పార్లమెంట్‌‌లో చర్చించాం. రాష్ట్రంలో శాంతి నెలకొల్పాల్సిన అవసరం ఉందని సభ్యులందరూ సూచించారు.

 అందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది” అని అన్నారు. ఆదివారం ఇంపాల్‌‌లో జరిగిన మణిపూర్ హైకోర్టు 12వ వార్షికోత్సవంలో అర్జున్ రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మణిపూర్‌‌‌‌లో పరిస్థితులు కుదుటపడుతున్నాయని చెప్పారు. త్వరలోనే పూర్తిస్థాయిలో శాంతి నెలకొంటుందని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో దొరికిన నోట్ల కట్టలపై స్పందిస్తూ.. ‘‘దీనిపై సుప్రీంకోర్టు దర్యాప్తు చేస్తున్నది. ఆ రిపోర్టు వచ్చిన తర్వాత, దానిపై మాట్లాడతాం” అని పేర్కొన్నారు.