చిన్నతనంలో నాపై రేప్ జరిగింది

చిన్నతనంలో నాపై రేప్ జరిగింది

బాల్యం నుంచి తనలో దాచుకున్న ఓ బాధాకరమైన సంఘటన గురించి బయటపెట్టాడు అర్జున్ రెడ్డి మూవీ స్టార్ రాహుల్ రామకృష్ణ. తాను చిన్నతనంలో ఉండగా రేప్‌కు గురయ్యానని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. లోలోపల ఇన్నాళ్లుగా తను అణచిపెట్టుకున్న ఆవేదన బయటపెట్టడంతో ఒక్కసారిగా ఫ్యాన్ నుంచి సపోర్ట్ వెల్లువలా వచ్చింది. కొందరు కో యాక్టర్స్ కూడా రాహుల్‌కు సానుభూతి తెలిపారు. తనకు అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్ అంటూ రాహుల్ ఇవాళ మధ్యాహ్నం ట్వీట్ చేశారు.

అర్జున్ రెడ్డి సినిమాతో బాగా ఫేమ్ అయ్యి వరుస సినిమాలతో మంచి యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ తన చిన్నతనంలో జరిగిన బాధాకరమైన ఘటనను బయటపెట్టాడు.  ‘‘నేను బాల్యంలో అత్యాచారానికి గురయ్యాను. నా బాధ గురించి ఏం చెప్పాలో కూడా నాకు తెలియదు. ప్రతిదీ బాధిస్తూనే ఉంటుంది. కానీ నా గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నా. నేను అనుభవించిన క్షోభ బయటపెట్టడం తప్ప ఏం చేయాలో తెలియలేదు’’ అని ఆదివారం అర్ధరాత్రి ట్వీట్ చేశాడు రాహుల్. ఆ తర్వాత మళ్లీ సోమవారం ఉదయం తాను ట్వీట్ చేయడానికి కారణం చెబుతూ మరో పోస్ట్ చేశాడు.

చిన్న రిలీఫ్ కోసమే..

తనపై చిన్నతనంలో లైంగిక దాడి చేసింది ఎవరన్నది బయటకు చెప్పని రాహుల్.. తనకు జరిగి దానికి న్యాయం జరగడమనేది ఉండదన్నాడు. తనపై జరిగిన నేరాన్ని భరిస్తూ బతికానని, అయితే ఇది ఎవరికి చెప్పుకోవాలో తెలియక వేదన అనుభవించానని చెప్పాడు. ఇలా బయటకి చెప్పడం ద్వారా చిన్న రిలీఫ్ తప్ప.. ఈ విషయంలో ఎప్పటికీ తనకు న్యాయం జరగడమనేది ఉండదని అన్నాడు. మగవాళ్లు మంచిగా ఉండడం నేర్పాలంటూ తన ఆవేదనను చెప్పుకొచ్చాడు రాహుల్. సామాజిక పరిస్థితుల్లో మార్పులు రావాలని, బాధితులు ధైర్యంగా ఉండాలని అన్నాడు. ఇలా తన బాధను చెబుతూ పెట్టిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. అభిమానులు, కో యాక్టర్స్, ఫాలోయర్స్ మద్దతు తెలిపారు. రాహుల్ ధైర్యాన్ని మెచ్చుకుంటూ ట్వీట్లు చేశారు.

ఆ బాధ ఊహకందనిది

రాహుల్ రామకృష్ణ కో యాక్టర్ ప్రియదర్శి ఈ ట్వీట్స్‌పై స్పందించాడు. చిన్నవయసులో అనుభవించిన ఆ బాధ ఊహకందనిదన్నాడు. ధైర్యంగా ఉండమని చెప్పడం తప్ప తాను ఏమీ చేయలేనన్నాడు. ఆ దారుణాన్ని దాటి జీవితంలో శక్తిసామర్థ్యాలను సరైన మార్గంలో వినియోగించడంలో విజయం సాధించావని, ఓ యోధుడిలా నిలిచావని అన్నాడు ప్రియదర్శి. కొందరు అభిమానులు, నెటిజన్లు కూడా ఆయన ధైర్యంగా ఈ విషయం బయటకు చెప్పడం గ్రేట్ అంటూ స్పందించారు. ‘మీరు చెప్పగలిగారు.. మేం చెప్పలేకపోతున్నాం. ఇదే చాలా పెద్ద తేడా’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఆడా మగా తేడా లేకుండా చిన్నతనంలో ఇలాంటి బాధను ఫేస్ చేసినవాళ్లు చాలామందే ఉన్నారంటూ మరికొందరు పోస్ట్ చేశారు. ఇదే ధైర్యంతో బలంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

థ్యాంక్స్ చెబుతూ.. పిల్లల విషయంలో సలహాలు

తనకు అండగా నిలిచిన వారందరికీ రాహుల్ రామకృష్ణ బుధవారం మధ్యాహ్నం ట్విట్టర్ వేదికగా థ్యాంక్స్ చెప్పాడు. పిల్లలను భద్రంగా చూసుకోవాలంటూ పేరెంట్స్‌కి సూచించాడు. వారి ప్రవర్తనలో సడన్‌గా ఏదైనా మార్పు ఉంటే గుర్తించి కేర్ తీసుకోవాలన్నాడు. ఇలాంటి భయానక విషయాల జరిగినప్పుడు ఆ బాధను ఎలా చెప్పాలో తెలియక పిల్లలు సతమతమవుతుంటారని చెప్పాడు రాహుల్.

More News:

కొద్ది రోజుల్లో పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి జంప్!

కరోనా వైరస్ ముప్పు: ప్రయాణించేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు