
న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. స్టెపాన్ అవగ్యాన్ మెమోరియల్ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఎనిమిదో రౌండ్‌లో అర్జున్ 63 ఎత్తుల్లో గ్రాండ్ మాస్టర్ వోలోడర్ ముర్జిన్ (రష్యా)పై నెగ్గి మరో గేమ్ మిగిలుండగానే టైటిల్ ఖాయం చేసుకున్నాడు. మంగళవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో ఆర్మేనియా గ్రాండ్ మాస్టర్ మాన్యూయెల్ పెట్రోస్యాన్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. ఫలితంగా 6.5 పాయింట్లతో ట్రోఫీ సొంతం చేసుకున్నాడు. రొమేనియా జీఎం బోగ్గాన్ 5 పాయింట్లతో రన్నరప్‌గా నిలిచాడు. తాజా విజయంతో అర్జున్ లైవ్ రేటింగ్స్‌లోనూ వరల్డ్ నం.4 ర్యాంక్ సాధించాడు. అతని కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ ర్యాంక్. ఎలో రేటింగ్‌ను 2779.9కు పెంచుకున్నాడు. లైవ్ రేటింగ్‌లో మాగ్నస్ కార్ల్‌సన్, హికరు నకాముర, ఫ్యాబియానో కరువాన ముందున్నారు.