కరాచీ: పాకిస్తాన్లో దారుణం జరిగింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో సోమవారం జరిగిన మూడు వేర్వేరు దాడుల్లో సాయుధ టెర్రరిస్టులు 37 మందిని చంపేశారు. దారిని అడ్డగించి, ట్రక్కును ఆపి, ప్రయాణికుల ఐడీ కార్డులను చెక్ చేసి మరీ కాల్చి చంపారు. పంజాబ్ప్రావిన్స్ వ్యక్తులే లక్ష్యంగా ఈ దాడి చేసినట్టు పోలీసు అధికారులు వెల్లడించారు. మొదటి ఘటన బలూచిస్తాన్‌లోని ముసాఖెల్ జిల్లాలో జరిగింది.
రరాషమ్‌లోని రహదారిపై వెళ్తున్న ట్రక్కును అడ్డగించిన టెర్రరిస్టులు.. ప్రయాణికులను కిందికి దిగాలని ఆదేశించారు. వారి ఐడెంటీ కార్డులను చెక్ చేశారు. తర్వాత వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో మొత్తం 23 మంది మృతిచెందారు. మృతుల్లో ఎక్కువ మంది దక్షిణ పంజాబ్, ఖైబర్ పంఖ్తుఖ్వాకు చెందినవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. వారి జాతి నేపథ్యం కారణంగానే వీరంతా చంపబడ్డారని వెల్లడించారు.
ముసాఖెల్‌లోని హైవేపై సాయుధులు 12 వాహనాలకు నిప్పుపెట్టారని చెప్పారు. బలూచిస్తాన్‌లోని ఖలాత్ జిల్లాలో మరో కాల్పుల ఘటన చోటు చేసుకున్నది. ఇందులో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు పోలీసులు, ఆరుగురు సామాన్య పౌరులు ఉన్నారు. అలాగే, బోలన్ జిల్లాలోని కొల్పూర్ ఏరియాలో జరిగిన దాడిలో నలుగురు భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రావిన్స్‌లో అత్యంత చురుకైన మిలిటెంట్ గ్రూప్ అయిన బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ముసాఖెల్‌లో జరిగిన దాడికి బాధ్యత వహించింది.
దాడిని ఖండించిన ప్రెసిడెంట్, పీఎం
అమాయక ప్రజలపై జరిగిన మిలిటెంట్ దాడిని తాము ఖండిస్తున్నట్టు పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్‌షరీఫ్ తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థించారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అమాయక ప్రజలను హత్యచేయడం అంటే మానవత్వాన్ని చంపడమేనని జర్దారీ అన్నారు. దోషులకు శిక్షపడాల్సిందేనని అన్నారు.