పోలీసులు సతాయిస్తున్నరు.. సీఎం కక్ష సాధిస్తున్నడు: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

పోలీసులు సతాయిస్తున్నరు.. సీఎం కక్ష సాధిస్తున్నడు: ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

చేవెళ్ల, వెలుగు: తనను పోలీసులు సతాయిస్తున్నారని, మూడు రోజుల కింద 4 గంటల పాటు , గురువారం 3 గంటల పాటు విచారణ జరిపారని, తానేం టెర్రరిస్టును కాదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. భూముల ఆక్రమణ కేసులో మోకిలా పోలీస్​స్టేషన్​కు రెండోసారి విచారణకు హాజరైన ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు  తనను అరెస్ట్ చేయవద్దని ఆర్డర్ ఇచ్చిందని, పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పడంతో మళ్లీ పీఎస్కు వచ్చి114 ఎకరాలకు సంబంధించిన సేల్ డీడ్స్ సబ్మిట్ చేసినట్టు చెప్పారు. తనపై కేసు పెట్టిన వారితో సెటిల్ చేసుకోవాలని పోలీసులు చెప్తున్నారని, ఇదేం పద్ధతి అని ప్రశ్నించారు.

ఫిర్యాదు చేసిన సామ దామోదర్ రెడ్డి ఎవరో తనకు తెలియదని ఆయనో పెద్ద ల్యాండ్​ గ్రాబర్​అని, అతడిపై చాలా కేసులున్నాయన్నారు. తాను 2016లో రాంచందర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, నీరజా రెడ్డి, చైతన్య దగ్గర భూమి కొన్నట్టు చెప్పారు. శంకర్ పల్లిలో  114 ఎకరాలకు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధిస్తున్నారని ఆయన ఆరోపించారు.