ఆర్మూర్, వెలుగు : అధికారంలో వచ్చిన కొన్ని రోజులకే కాంగ్రెస్ లీడర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని ఆర్మూర్ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన ఆర్మూర్ లో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి ఆర్మూర్‌లో పోటీ చేసిన వినయ్ రెడ్డి, స్థానిక అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకపోతే ప్రజలే లెక్క తేలుస్తారన్నారు.
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విషయంలో ఇది వరకే రుజువైందన్నారు. ఉమ్మడి జిల్లా ప్రజలు కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు.క్యాంప్ ఆఫీస్ కేంద్రంగా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అతడి అనుచరులు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, ఇక నుంచి అలాంటి ఆటలు సాగవన్నారు. పార్టీలకు అతీతంగా సేవ చేయడానికి సిద్ధం ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతకు ముందు మాజీ ప్రధాని వాజ్ పేయి ఫొటోకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
అనంతరం టౌన్ లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధులగుట్ట శివాలయంలో, క్యాంప్ ఆఫీస్ పక్కన ఉన్న నాగలింగేశ్వర ఆలయంలో పూజలు చేశారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లె గంగారెడ్డి, పెద్దోళ్ల గంగారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కంచెట్టి గంగాధర్, పుప్పాల శివరాజ్, జెస్సు అనిల్, నూతుల శ్రీనివాస్ రెడ్డి, సారంగి సాందన్న పాల్గొన్నారు.