- పదవి కోల్పోయిన పండిత్ వినీత
ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మున్సిపాలిటీలో కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు గురువారం తెరపడింది. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై మెజార్టీ కౌన్సిలర్లు ప్రతిపాదించిన అవిశ్వాసం నెగ్గడంతో ఆమె పదవి కోల్పోయారు. 24 మంది కౌన్సిలర్లు నెల కింద కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతును కలిసి చైర్ పర్సన్ పై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. గురువారం ఆర్మూర్ మున్సిపల్ ఆఫీస్ లో ఆర్డీవో, మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ వినోద్‌కుమార్ పర్యవేక్షణలో బలనిరూపణకు మీటింగ్ నిర్వహించారు.
ఉదయం 10:30 గంటలకు కౌన్సిలర్లు మీటింగ్ హాల్‌కు చేరుకోగా, ఎక్స్అఫీషియో సభ్యునిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి అటెండయ్యారు. కోరం 25 మంది సభ్యులు ఉండడంతో ఉదయం 11గంటలకు అవిశ్వాసంపై చేతులు పైకెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. 24 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా చేతులెత్తడంతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. చైర్ పర్సన్ పండిత్ వినీత పదవి కోల్పోయినట్లు ఆర్డీవో వినోద్ కుమార్ ప్రకటించారు.
ఆర్మూర్ మున్సిపల్చరిత్రలోనే చైర్పర్సన్ పై కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించడం, ఆ అవిశ్వాసం నెగ్గడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్కు చెందిన చైర్ పర్సన్ పండిత్ వినీత సొంత పార్టీ కౌన్సిలర్ల వల్లే పదవి కోల్పోయారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వల్ల తన పదవి కోల్పోయిన పండిత్ వినీత, ఆమె మద్దతుదారులు బీఆర్ఎస్లో కొనసాగుతారా, పార్టీ మారుతారా అనే విషయం చర్చనీయాంశమైంది.
ఉత్కంఠగా అవిశ్వాస ప్రక్రియ..
చైర్ పర్సన్ వినీతపై అవిశ్వాస బల నిరూపణ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. అవిశ్వాసం నేపథ్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి క్యాంప్‌లో ఉన్న కౌన్సిలర్లు ప్రైవేట్ బస్‌లో మున్సిపల్ఆఫీస్కు చేరుకున్నారు. బీజేపీ కౌన్సిలర్లు వచ్చిన కొద్దిసేపటికి ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి వచ్చారు. అవిశ్వాసం ఎదుర్కొన్న పండిత్ వినీతతో పాటు ఆమె మద్దతుదారులెవరూ మీటింగ్‌కు రాలేదు.
అవిశ్వాస ప్రక్రియ నిబంధనలను వివరించిన ఆర్డీవో వినోద్ కుమార్, అవిశ్వాసానికి మద్దతిస్తున్న వారు చేతులెత్తాలని సూచించారు. దీంతో 17 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, ముగ్గురు బీజేపీ, ఇద్దరు ఎంఐఎం, ఒక కాంగ్రెస్కౌన్సిలర్, ఇద్దరు ఇండిపెండెంట్లుచేతులెత్తడంతో అవిశ్వాసం నెగ్గింది. తర్వాత వచ్చిన బస్సులోనే కౌన్సిలర్లు తిరిగి వెళ్లిపోయారు.
బీజేపీ జెండా ఎగరేస్తాం
ఆర్మూర్ మున్సిపల్ పై బీజేపీ జెండా ఎగరేస్తామని ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఆఫీస్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి మొక్కలను ఒక్కొక్కటిగా తొలగిస్తున్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని ఓడించామని, ఇప్పుడు చైర్ పర్సన్ ను తప్పించామన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీతపై పెట్టిన అవిశ్వాసం నెగ్గడంలో బీజేపీ కీలకంగా వ్యవహరించిందన్నారు.
చైర్పర్సన్ ఎన్నిక విషయమై కలెక్టర్ నివేదిస్తాం
అవిశ్వాసంతో చైర్ పర్సన్ పండిత్ వినీత పదవి కోల్పోయినందున కొత్త చైర్ పర్సన్ ను ఎన్నుకునే విషయమై కలెక్టర్‌కు నివేదిస్తామని ఆర్మూర్ ఆర్డీవో వినోద్ కుమార్ తెలిపారు. కొత్త చైర్పర్సన్ఎన్నికయ్యే వరకు ఉన్నతాధికారులు ఒకరిని ఇన్చార్జ్గా నియమిస్తామన్నారు.
– ఆర్డీవో వినోద్ కుమార్